న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార
రథసారథి నరేంద్ర మోడీ కాంగ్రెసు పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి కొన్ని
ప్రశ్నలు వేశారు. తెలంగాణపై ముందడుగును స్వాగతిస్తూనే ఈ సమయంలో కాంగ్రెసు,
యుపిఎ ఉద్దేశం ఏ మేరకు వాస్తవమని అడగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ
మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఆయన
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాసిన లేఖ ఇలా ఉంది..
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు..
నమస్కారం! హైదరాబాదులో ఆగస్టు 11వ తేదీన జరిగే నవ భారత్ యువ భేరీ బహిరంగ సభలో మీ అందరితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాను.
ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని
ప్రాంతాలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై నా ఆలోచనలను మీతో పంచుకుంటాను.
జరిగిన సంఘటనల నేపథ్యంలో చూస్తే గత తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసి, గత కొద్ది రోజులుగా కాంగ్రెసు పార్టీ తెలంగాణ నిర్ణయం కోసం సాధారణ స్ధాయికి మించి పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు పార్టీ నిలకడగానూ, పారదర్సకంగానూ వ్యవహరించలేదనేది వివాదరహితమైన వాస్తవం. ఆ విధంగా ఆ పార్టీ, ప్రభుత్వం తెలంగాణ అంశంపై ప్రజలను ఎప్పటికప్పుడు మోసగిస్తూ వచ్చింది. అందువల్ల ఈ సయమంలో కూడా దాన్ని నమ్మడం కష్టమే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా బిజెపి ముందుకు వచ్చింది, పారదర్శకంగా వ్యవహరించిందనేది వాస్తవం.
చిన్న రాష్ట్రాల ఏర్పాటులో బిజెపికి మాత్రమే బలమైన రికార్డు ఉంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2000లలో చత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్ (ఉత్తరాంచల్‌గా పేరు), జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాలను ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలు మొగ్గలు తొడిగాయి.
మిత్రులారా, తెలంగాణ హామీతో 2004 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు పార్టీ తొమ్మిదేళ్ల పాటు ప్రజల ఆకాంక్షలు, మనోభావాలతో ఆటలాడుకుంది. ఎన్నికలకు కేవలం కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో తెలంగాణ ప్రకటన చేయడానికి హడావిడి చేసింది. ఇది కాంగ్రెసు పట్టింపు, ఉద్దేశ్యాలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004, 2009ల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెసు పార్టీ ఆయన మరణించిన తర్వాత రాష్ట్రం విషయంలో వెన్ను చూపింది. 2009లో అప్పటి హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటనను అకారణంగా వెనక్కి తీసుకుంది. తెలంగాణపై కాలయాపన చేయడానికి కాంగ్రెసు పార్టీ మరో కమిటీని ఏర్పాటుచేసింది. కానీ పాలనాయత్రాంగం స్తంభించడంపై, రాజకీయ హింసపై, దురదృష్టకరమైన తెలంగాణ యువకుల ఆత్మహత్యలపై ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించింది. దీంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా స్తంభించింది.
బహిరంగ లేఖ: తెలంగాణపై కాంగ్రెసు మోడీ ప్రశ్నలు
తెలంగాణ అంశంపై కదలికను స్వాగతిస్తూనే ఈ సమయంలో కాంగ్రెసు, యుపిఎ ఉద్దేశం
ఎంత వరకు వాస్తవనేది అడగాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెసు పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను.
ప్రశ్న 1: భిన్నమైన గొంతులు వినిపిస్తున్న సమయంలో తెలంగాణ అంశంపై మీ సొంత పార్టీలో, ప్రభుత్వంలో, అన్ని రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం సాధన కోసం మీరు చేసిన కసరత్తు ఏమిటి?
ప్రశ్న 2: రెండు రాష్ట్రాల్లో సరిహద్దుల్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానిగా పనికి వస్తుంది. అలా కాకుండా, తెలంగాణ మధ్యలో ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎలా అవుతుంది? స్వల్పకాలానికైనా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం న్యాయసమ్మతం కాదు. దానివల్ల కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. రాష్ట్రం మధ్యలో గానీ, సరిహద్దులో గానీ లేని నగరం ఆ రాష్ట్ర రాజధానిగా ఉండడం ఏ విధంగా ఆచరణ సాధ్యం?
ప్రశ్న 3: తెలంగాణ నిర్ణయాన్ని స్వాగతించడానికి ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనసులను సంసిద్ధం చేయడానికి మీరు తీసుకున్న నిర్మాణాత్మక చర్యలు ఏవి? వారి ఉద్వేగాలను శాంతింపజేసి మీతో పాటు నడిపించడానికి వారికి ఇచ్చిన హామీలేమిటి? "సాంకేతికమైన ప్రక్రియ" తప్ప ప్రజల్లో ఏకాభిప్రాయ సాధనకు మీ "రాజకీయ రోడ్ మ్యాప్" ఏది?
ప్రశ్న 4: ఇది వరకే ఎన్నో మోసాలకు గురై తీవ్రమైన వేదనకు గురవుతున్న తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు?
ప్రశ్న 5: చాలా మంది తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రమైన హైదరాబాద్ నష్టపోయింది. రాష్ట్ర పరిస్థితి దిగజారింది. అన్నపూర్ణగా పేరు గాంచిన రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బ తిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను సాహసంతో ఎదుర్కోవడానికి బదులు కాంగ్రెసు పార్టీ కమీటిలు, నివేదికలు, నిష్ఫలమైన సంప్రదింపుల మాటున దాక్కోవడానికి ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్ 2004లోనూ 2009లోనూ పార్టీకి అత్యధిక పార్లమెంటు సభ్యులను గెలిపించినా కాంగ్రెసు అధ్యక్షురాలు గానీ ఉపాధ్యక్షుడు గానీ ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. కాంగ్రెసు రాజకీయ అవకాశవాదం కోసం కాంగ్రెసు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను డూర్ మ్యాట్‌గా చూసినందుకు క్షమాపణలు చెప్పదా?
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు అర్థవంతమైన రోడ్ మ్యాప్ కోసం బిజెపి
సూత్రాలు..
మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్డుబడుతాం. అన్ని ప్రాంతాల ప్రజల మనసు దోచుకునే పరిష్కారాలతో రోడ్ మ్యాప్ ఉండాలని మేం విశ్వసిస్తాం. ఒక ప్రాంతానికి రాష్ట్రాన్ని ప్రసాదించడం వల్ల మరో ప్రాంతం ఇబ్బందులకు గురి కాకూడదు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వరంగల్, కరీంనగర్, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, కడప తదితర నగరాలను అభివృద్ధి చేయడానికి ఇది సరైన అవకాశమని మేం నమ్ముతున్నాం. అన్ని ప్రయోజనం పొందాల్సిందే.
పౌరలందరి హక్కులను రక్షించే రాజ్యాంగాన్ని మేం గౌరవిస్తాం. ఎక్కడ పుట్టినా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అన్ని ప్రాంతాల వ్యక్తులను, కుటుంబాలను, వ్యాపారాలను, అస్తులను రక్షించడానికి బిజెపి చర్యలు తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ఆర్థికాభివృద్ధిని సాధించడానికి మేం కట్టుబడి ఉన్నాం. శాంతిభద్రతలు, రాజకీయ స్థిరత్వం, క్రియాశీల విధానాల పాలన మా సొంతం. నదీజలాల ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు దక్కాలి. జలవనరుల పంపకంలో నిజాయితీ, న్యాయబద్ధత, సమానత్వం అవసరం.
అన్ని ప్రాంతాల్లో నమ్మకాన్ని, విశ్వసనీయతను పెంపొందించడానికి మేం కట్టుబడి
ఉన్నాం. దురుద్దేశపూర్వకమైన ఆటలు, మోసాలు ఉండవు.
పాలనాయంత్రాంగం సరిహద్దుల ప్రభావం పడకుండా అన్ని ప్రాంతాల తెలుగు
సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. తెలుగు
సంస్కృతికి, ఆత్మగౌరవానికి సరిహద్దులు ఉండవు.
భాషా ప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రం విభజనకు గురి కావడం ఇదే మొదటిది కావచ్చు.ఇది ఉద్వేగ భరితమైన సమయం.
రాష్ట్రం విభజనకు గురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణాలు త్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వంటి అమరవీరులను గౌరవించడానికి తలలు వంచి వందనం చేస్తాం. వారి జ్ఞాపకాల స్ఫూర్తితో అన్ని ప్రాంతాల్లోని తెలుగు ప్రజల ప్రగతికి కృషి చేయడానికి అంకితం అవుదాం.