Showing posts with label Freedom Fighters. Show all posts
Showing posts with label Freedom Fighters. Show all posts

Wednesday, January 18, 2012

తెలుగు వారి స్వాతంత్ర్య పోరాటం : యానాం విమోచనోద్యమం


యానాం గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరి (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచ్చేరి, కారైకల్, మాహే మరియు యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్దాలపాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో విమోచనం చెంది, స్వతంత్ర భారతావనిలో విలీనం చెందాయి.
భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రతి భారతీయునికి కొద్దో గొప్పో అవగాహన ఉంటుంది. కానీ 1947లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర భారతావనిలోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచివారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివినవారికి మాత్రమే తెలుస్తుంది. మరి, వారిని కూడా ఈ దేశం నుండి వెళ్లగొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి?, వాటిలో హీరోలెవ్వరు?, అసువులు బాసినదెవ్వరు? వంటి ప్రశ్నలకు వి.సుబ్బయ్య వ్రాసిన సాగా ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా, పాంచ్ రామలింగం ఆత్మకధ వంటి పుస్తకాలలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కానీ వీరంతా పాండిచేరికి చెందినవారు కావటంతో అందులోని విషయాలన్నీ పాండిచేరి స్వాతంత్ర్య పోరాటానికి చెందినవై ఉండటం, యానానికి సంబంధించిన అంశాల ప్రస్తావన తక్కువగా ఉండటమూ జరిగింది.
1954 జూన్ 13న జరిగిన యానాం విమోచన నేపథ్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ వ్యాసం.

విషయ సూచిక

  • 1 ఘటన చారిత్రిక ప్రాముఖ్యత
  • 2 ఫ్రెంచి కాలనీల విమోచన నేపథ్యం
  • 3 యానాం విమోచన నేపథ్యం
  • 4 యానాం విమోచనోద్యమానికి అంకురార్పణ
  • 5 యానాంలో ఉద్యమభావాలు రగల్చటం
  • 6 యానాం విమోచనోద్యమం
  • 7 యానాం విమోచనం
  • 8 ఇవి కూడా చూడండి
  • 9 వనరులు
  • 10 మూలాలు
  • 11 బయటి లింకులు

ఘటన చారిత్రిక ప్రాముఖ్యత

యానాం కాలనీ - పాత కాలపు చిత్రం

సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం 1954 జూన్ 13న విమోచనం చెందింది. ఈ కాలంలోనే ఫ్రెంచి వారి వలసపాలన నుండి ఇండో-చైనా విమోచనం చెందటానికి ఘోరమైన యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ భారత దేశంలోని ఫ్రెంచి కాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత పద్ధతులద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు ఫ్రెంచి కాలనీలైన పాండిచేరి, మాహే, కారైకల్ మరియు యానాంలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే. ఎందుకంటే ఇలా జరగటంవల్ల యానాం ఓ క్రాంతదర్శిగా చరిత్ర కెక్కింది.

అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా యానాం విమోచనం భిన్నకోణాలలో ఈ విధంగా దర్శించబడ్డది.
  1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య శృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్ర్య భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమం.
  2. భారత ప్రభుత్వము యానాం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది.
  3. భారత ప్రభుత్వం తన దేశభక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది.
  4. యానాం నాయకులు ఆంధ్రాప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానాం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.
ఏ వాదన ఎలా సాగినా, యానాం ఫ్రెంచి పాలన నుండి విమోచనం చెంది, భారతావనిలో విలీనం చెందటం అనేది అప్పటికి ఒక చారిత్రక అవసరం. ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని నడిపించిన నాయకుల దేశభక్తిని శంకించలేము. వారు ఈ ఉద్యమాన్ని శాంతియుతంగాను, ప్రజాస్వామ్యయుతంగానూ నడిపించిన తీరు అనన్యమైనది. భారత్-ఫ్రెంచి కాలనీల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలచిన యానాం విమోచనమును జరిపించిన ఆనాటి నాయకుల దార్శనికత అత్యంత ఉన్నతమైనది.

విమోచనమంటే ఉన్నపళంగా బయటకు వచ్చేసి, మనల్ని మనం పునర్నింమిచుకోవటమే అని జేన్ ఫాండా అనే అమెరికన్ రచయిత్రి అంటుంది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ముడున్ ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమ పొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత, తరతరాలుగా జీర్ణించుకున్న "సంస్కృతి" పట్ల తమకున్న విధేయతనుంచి ఉన్నపళంగా బయటకు వచ్చేయడం కొంతమందికి అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమందికి తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మధ్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ఘర్షణ ఫలితమే యానాంలో జరిగిన విమోచనోద్యమము.

ఫ్రెంచి కాలనీల విమోచన నేపథ్యం

1940 దశకంలో ఫ్రెంచి కమిషనర్‌తో యానాం మేయర్‌ మడించెట్టి
1947 లో బ్రిటిష్ వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టిపోవడంతో ఫ్రెంచికాలనీలలోని ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. అప్పటికి పాండిచేరి, కారైకాల్, మాహే, యానాం మరియు చంద్రనాగూర్ అనే అయిదు ప్రాంతాలు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్నాయి. ఈ అయిదు ప్రాంతాలు భౌగోళికంగా దూరదూరంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండటంవలన వీటిని నియంత్రించటం ఫ్రెంచివారికి కష్టంగా ఉండేది. ఇవి భారతభూభాగంలో చాలా చిన్నచిన్న ప్రాంతాలు. అందుకే నెహ్రూ ఒక సందర్భంలో ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖంపై మొటిమలవలె ఉన్నాయి అని వ్యాఖ్యానించాడు.

1948 లో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ ఐదు కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ఐదు ఫ్రెంచి కాలనీల భవిత రిఫరెండం ద్వారా (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్ణయింపబడాలి. అంటే సామాన్య ఎన్నికలద్వారా ప్రజలందరూ వారు భారతదేశంలో విలీనం చెందాల ఒద్దా అనే విషయాన్ని తెలియజేయాలన్నమాట. (ఈ ప్రాంత ప్రజలందరూ భారతావనిలో కలసిపోవటానికి ఎగిరి గంతేస్తారని నెహ్రూ భావించాడు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆయన అంచనాలను తప్పని నిరూపించాయి. అందుచేతనే వీటి విలీనానికి 1954 వరకూ సమయం పట్టింది). ఈ ఒప్పందానికి అనుగుణంగా 1949 జూన్ 19 న అప్పటిదాక ఫ్రెంచి కాలనీగా ఉన్న చంద్రనాగూర్ ప్రజాభిప్రాయ సేకరణలో జనామోదంతో జరుపుకొని భారతావనిలో విలీనమయిపోయింది.

చంద్రనాగూర్లో జరిగినట్లు మిగతా కాలనీలలో జరగలేదు. ఈ కాలనీలలో తరువాత జరిగిన ఎలక్షన్లలో ఫ్రెంచిపాలన కొనసాగాలని కోరుకునే సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో రిఫరెండం ప్రక్రియ అటకెక్కింది. ఆతరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయభావాలు బలపడి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెచ్చుకొని ఫ్రెంచిపాలనను అంతమొందించటానికి 1954 వరకు నిరీక్షించవలసి వచ్చింది.

1954 లో పాండిచేరికి చెందిన గుబేర్, ముత్తుపిళ్లై, ముత్తుకుమరప్పరెడ్డియార్ల వంటి నాయకులు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ధిక్కరించి బయటకు వచ్చి, నెట్టుపాక్కం అనే ఊరిలో తాత్కాలిక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తరువాత ఫ్రెంచి ప్రభుత్వం దిగివచ్చి, 1-11-1954 నవంబరు 1న తన నాలుగు కాలనీలైన పాండిచేరి, మాహే, కారైకాల్, యానాంలను భారత ప్రభుత్వానికి వాస్తవికాంతరణ (డి-ఫాక్టో ట్రాన్స్‌ఫర్)చేసింది.

యానాం విమోచన నేపథ్యం

1948 మరియు 1951 లలో యానాంలో జరిగిన ఎన్నికలలో ఫ్రెంచిపాలనకు అనుకూలంగా ఉండే పార్టీల తరపున పోటీచేసినవారే విజయాలు సాధించటంతో ఇక్కడ ప్రజలలో విమోచన భావాలు విస్తృతంగా లేవని వ్యక్తమైంది. అంతేకాక అన్ని కాలనీలలోకెల్లా యానాం ఫ్రెంచివారికి పెట్టనికోట అని పెద్దపేరు తెచ్చుకుంది. 1951లో జరిగిన ఎన్నికలలో నెగ్గిన ప్రముఖ నాయకులు: మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకట రాజారావు, గిరి మాధవరావునాయుడు, నాటి చినవెంకన్న, కశిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సమతం కృష్ణయ్య, పంపన వీరాస్వామి, గుర్రపు వెంకటరత్నం, జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు. ఓడిపోయినవారిలో కామిశెట్టి పరశురాం, యర్రా లక్ష్మణరావులు ప్రముఖులు.

యానాంలో 1947 నుంచి 1953 వరకూ ఫ్రెంచి ఇండియా (ఏంద్ ప్రాఁసెజ్) పోరాట సంఘటనలు ఒకటి రెండు మినహా పెద్దగా ఏమీ జరుగలేదు. బహుశా అందుచేతనే ఫ్రెంచి వారు యానాంను తమనిష్టపడే ప్రాంతంగా అభివర్ణించుకొనేవారు.

యానాం విమోచనోద్యమానికి అంకురార్పణ

1954 మార్చి మూడున యానాం కు చెందిన జాతీయవాదులు, కామిశెట్టి పరశురాం అధ్యక్షతన ఒక విలీన కూటమిగా ఏర్పడ్డారు. యానాంలో స్థానిక ఫ్రెంచి అధికారులు కొంతమంది స్వార్ధపరులైన ఫ్రెంచి విధేయులతో చేతులు కలిపి, జాతీయ భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణచివేతకు గురిచేస్తున్నారని అప్పటి ఫ్రెంచి గవర్నర్ అయిన ఆఁద్రె మేనార్ కిచ్చిన టెలిగ్రాంలో వీరు ఆరోపించారు. ఈ ఉదంతంద్వారా యానాంలో ప్రజలకు ఫ్రెంచివారిపట్ల అసంతృప్తి ఉన్నట్లు అర్ధంచేసుకోవచ్చు.

ఈ నేపధ్యంలో 1954 ఏప్రిల్ 11 వ తేదీ రాత్రి పాండిచేరిలోని భారత కోఁసుల్ జనరల్ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో పాండిచేరీలోని జాతీయవాదులందరూ సమావేశమయ్యారు. ఫ్రెంచివారి నుండి ఫ్రెంచి కాలనీలు విముక్తమవ్వాలంటే ఈ కాలనీలలో దేన్నో ఒక దానిని సంపూర్ణంగా చేజిక్కించుకోవటమే సరైన మార్గం అని కేవల్ సింగ్ ఆ సమావేశంలో అనగా ఆ విధంగా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమావేశానికి యానానికి చెంది, పాండిచేరీ స్వాతంత్ర్యపోరాటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న దడాల రఫేల్ రమణయ్య కూడా హాజరయ్యారు. కేవల్ సింగ్ మాటలకు ఉత్తేజితుడైన దడాల, యానాంలోని ఫ్రెంచి స్థావరాన్ని కైవసం చేసుకొని యానాన్ని ఫ్రెంచిపాలన నుండి విముక్తం చేయటానికై పాండిచేరి నుండి బయలుదేరాడు. ఆ విధంగా యానాం విమోచనోద్యమానికి 1954 ఏప్రిల్ పదకొండున అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు.

యానాంలో ఉద్యమభావాలు రగల్చటం

1954, ఏప్రిల్ 6న ఫ్రెంచిపాలన కొనసాగాలని యానాం మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని యానాం ఎడ్మినిష్ట్రేటర్, పాండిచేరిలోని ఫ్రెంచి అధికారులు - యానాం ప్రజలందరూ ఫ్రెంచిపాలన కోరుకుంటున్నారనీ, వారంతా ఫ్రెంచివిధేయులనీ, ఇక్కడ జాతీయవాద ధోరణులు లేనే లేవనీ పెద్ద ప్రచారం చేసారు.

సరిగ్గా ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో దడాల యానాం వచ్చాడు. యానాం చుట్టూ ఉన్న తూర్పు గోదావరి జిల్లా నాయకులను కలిసికొని, కాకినాడ టౌన్ హాలులో సభ ఏర్పాటుచేసి, గంభీరమైన ఉపన్యాసమిచ్చి అక్కడి పెద్దలు, యువతలో ఉద్యమం పట్ల ఉత్సాహాన్ని కలిగించారు. ఇలా సంపాదించుకున్న కార్యకర్తలతో దడాల, లారీలపై యానాం వీధులలో తిరిగి, ఫ్రెంచి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారు.

యానాంలో ఫ్రెంచి వ్యతిరేక వాతావరణం వస్తూండడంతో, ప్రభుత్వం కలవరపడసాగింది. ఫ్రెంచివిధేయులు యానాంలో మీటింగులు పెట్టుకొని, ఫ్రెంచివారిపట్ల విధేయతను ప్రకటించటమూ, దడాల దిష్టిబొమ్మను తగులపెట్టటము జరిగేది. ఇటువంటి పరిస్థితులలో దడాల, యానాం వంతెన కివతలి ఆంధ్రాప్రాంతంలో ఒక టెంటు వేసి, తన అనుచరులతో ఉంటూ, లౌడ్ స్పీకర్ల సహాయంతో విలీనం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ఉండేవాడు.

అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను, గొడవలను ఈ ఉద్యమంలో పాల్గొన్న బొల్లోజు బసవలింగం, 1954, అక్టోబరు 30వ తేదీ మాతృసేవ అనే పత్రికలో విమోచనోద్యమ విశేషాలు అనే వ్యాసం ద్వారా వివరించాడు.

యానాం విమోచనోద్యమం

దడాల రాక యానాం లోని రాజకీయనాయకులలొ విలీనం పట్ల సానుకూల ధోరణి ఏర్పడటానికి తోడ్పడింది. మొదట్లో దడాల ఆంధ్రా నాయకులైన భయంకరాచారి, డి.ఎస్.ఆర్. సోమయాజులు, కొంపెను సుబ్బారావు, కస్తూరి సుబ్బారావు వంటి వారితో కలసి తన పోరాటాన్ని సాగించారు. వీరి ఆధ్వర్యంలో సభలు, పికెటింగులు, రాలీలు, రాస్తారోకోలు వంటివి జరపటంవల్ల క్రమక్రమంగా యానాం ప్రజలలో కూడా ఉద్యమభావాలు కలగటం ఫ్రెంచివారి నుండి విమోచనం చెందాలన్న కోరిక ఉదయించటం జరిగింది.

ఈ సమయంలో జార్జి సాలా (అప్పటి యానాం పాలకుడు, ఫ్రెంచి దేశస్థుడు) ఫ్రెంచివారికి అనుకూలంగా ఉంటూ, ఫ్రెంచి పాలన కొనసాగాలని ఆశించే యానాం పౌరులను చేరదీసి వారి సహాయంతో విలీన వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నించాడు. వీరిలో ముఖ్యులు సమతం కృష్ణయ్య, బస్సా సుబ్బారావు, కాపగంటి బులిమంగరాజు, బళ్లా, మహమద్ జిక్రియా తదితరులు ముఖ్యులు.

ఇరవైతొమ్మిది, ఏప్రిల్, 1954 న యానాం కు చెందిన నాయకులు మద్దింశెట్టి, కామిశెట్టి, కోన, దవులూరి వెంకటరాజు తదితరులు తమ వేచిచూసే ధోరణిని విడనాడి, యానాం భారతావనిలో విలీనం చెందాలన్న అవసరమును గుర్తించి ఈ విధంగా తీర్మానం చేసుకున్నారు.
“ మా మాతృభూమి అయిన భారతావని పట్ల మేము సానుకూల ధోరణితో, దృఢంగా మమేకమైఉన్న కారణంగా, ఈ ప్రాంతపు (యానాం ) ఎన్నుకోబడిన నాయకులమైన మేము, భౌగోళికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా మాప్రాంతం భారతావనితో సారూప్యత కలిగిఉండటంచేత, ఈ ప్రాంతాన్ని రిఫరెండం లేకుండా భారతావనిలో తక్షణం విలీనం జరపాలని ఏకగ్రీవంగా కోరుచున్నాము. ఈ ప్రాంతాన్ని మా భారత మాతృభూమిలో కలుపుకోవటానికి అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని ఫ్రెంచిప్రభుత్వాన్నికోరుతున్నాము. సత్వరమే స్పందించి మాబలీయమైన ఆశలను నిజంచేసి, ఫ్రాంస్, ఇండియాల స్నేహాన్ని బలోపేతంచేయవలసినదిగా, ఫ్రెంచిప్రభుత్వ అధిపతి యొక్క విజ్ఞతకు, రాజనీతిజ్ఞతకు మేము విజ్ఞప్తి చేయుచున్నాము. ”

యానాంకు చెందిన ప్రముఖ పౌరులు యానాన్ని భారతావనిలో విలీనం చేయాలని కోరుతూ చేసుకున్న ఈ తీర్మానాన్ని అప్పటి భారత ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూకు, ఫ్రెంచిదేశ అసెంబ్లీకి పంపించారు. దీని తదనంతరం జరిగిన అన్ని ఉద్యమ కార్యక్రమాలను వీరు దడాలతో కలసి సాగించారు. మద్దింశెట్టి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణం చూపి వారిని యానాం మేయర్ పదవినుంచి ఫ్రెంచ్ ప్రభుత్వం తొలగించింది.

20-5-1954 న భారతపతాకాలు ధరించి అయిదువందల మంది కార్యకర్తలు యానాం బ్రిడ్జి మీదుగా కదంతొక్కుతూ యానాంవైపు కదిలారు. వీరికి నాయకులు దడాల, మద్దింశెట్టి, కామిశెట్టి, కనకాల, యర్రా, కస్తూరి సుబ్బారావు, పి. భయంకరాచారి తదితరులు. ఈ సంఘటనతో ఉద్యమకారుల బలం పతాకస్థాయిలో ప్రదర్శితమైనది. ఈ పతాక ప్రదర్శనను విమోచన ఉద్యమకారులు చేసిన బలప్రదర్శనగా భావించిన ఉద్యమ వ్యతిరేకవాదులు ఉక్రోషంపట్టలేక ఉద్యమకారులపై దాడులను ముమ్మరం చేసారు.

ఆ దాడులలో ప్రధానంగా చెప్పుకోవలసినది మద్దింశెట్టి ఇల్లు దోపిడీ. 1954 మే 23న మద్దింశెట్టి ఇంటిపై విలీన వ్యతిరేకవాదులు, దాడిచేసి సుమారు 17 వేల రూపాయిల విలువచేసే నగలు, కొన్ని విలువైన పత్రాలు లూటీ చేసారు. వీరి తమ్ముడైన సత్తిరాజు ఇంటిపై కూడా దాడిచేసి 20 వేలరూపాయల నగలు, ఇతర వస్తువులు లూటీ చేసారు. దడాల ఇంటిపై కూడా దాడి చేసారు.

ఈ సంఘటనలకు అఘాయిత్యాలకు వెనుక సూత్రధారులు యానాం జడ్జి గిర్మేన్ మరియు ఫ్రెంచ్ పోలీసు అధికారి బొర్నెట్ అని ఆరోపిస్తూ అప్పటి ఫ్రెంచి సముద్రాంతరపు మంత్రికి యానాం నుంచి టెలిగ్రాములు వెళ్ళాయి.
ఈ సంఘటనలపట్ల విచారణ జరపటానికై ఫ్రెంచ్ సెక్రెతెర్ జెనెరాల్ ఎస్కర్గుయిల్ పర్యటించి, యానాంలో గూండాల దాడులు జరిగాయని అంగీకరించి, మద్దింశెట్టికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. యానాంలో ఉంటున్న ఫ్రెంచి దేశస్థులైన అధికారులకు రక్షణ ఉండదని భావించి, తనతో పాటు వారిని తీసుకుపోయారు.

యానాం విమోచనం

1954లో యానాంలో మొట్టమొదటి సారిగా భారత జాతీయ పతాకావిష్కరణ
 
యానాం విమోచన తరువాత స్వతంత్ర సేననుండి సైనిక వందనం స్వీకరిస్తున్న తాత్కాలిక ప్రభుత్వం అధినేత దడాల. అతని ప్రక్కన ఉన్నవారు మేయర్ మడించెట్టి, కామిచెట్టి.

యానాంలో దాడులు ప్రతిదాడులతో పరిస్థితులు జటిలమవుతూండడంతో జార్జి సాలా (యానాం అద్మినిస్త్రాతోర్) పాండిచేరీ వెళిపోయాడు. ఆ భాధ్యతలను యానాం జడ్జి, శివా స్వీకరించారు.
యానాన్ని ఫ్రెంచిపాలన నుండి విమోచనం కలిగించటానికి ఇదే సరైన సమయం అని ఉద్యమనాయకులు భావించారు. ఈ పోరాటనాయకుల రక్షణార్ధమూ మరియు హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకూ\ అప్పటి కాకినాడ కలెక్టరు 200 సాయుధ బలగాలను రప్పించి వీరికి సహాయంగా ఉంచాడు.

అది ఆదివారం జూన్ 13, 1954, ఆరోజు ఉదయాన్నే మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దడాల, యర్రా సత్యన్నారాయణమూర్తి, కామిశెట్టి పరశురాం, కోన నరసయ్య కాకినాడకు చెందిన పి. భయంకరాచారి మరియు ఓ వేయి మంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశించారు. ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతిబాంబులను వీరివైపు విసిరారు. విమోచన ఉద్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంగా వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరుగకుండా (ఈ సందర్భంలో) ఫ్రెంచ్ పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను కావించారు. వీళ్ల రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయశక్తులు తలోదిక్కుకు పోయి దాక్కున్నారు.

ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిష్ట్రేటర్ బంగళాను చేరుకుని అప్పటి అద్మినిస్త్రాతోర్-ఏఁషార్జేయ్ శివా నుండి అధికారాలను స్వాధీనపరచుకున్నారు. శివా పరిస్థితిని సమీక్షించి, ప్రతిఘటించినట్లైతే శాంతిభద్రతల సమస్య తలెత్తగలదని ఆలోచించి అధికారాలను బదలాయించాడు. ఆ రోజే శివా పాండిచేరీకి ఈ విధంగా టెలిగ్రాం ఇచ్చాడు:
ప్రజలు యానాం నిర్వహణను ఈనాడు ఉదయం 6 గంటలకు ప్రతిఘటన ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ప్రజల ఆధీనమై ఉన్నవి. ఎవరికీ ప్రాణహాని లేదు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రభుత్వోధ్యోగులకు యానాంలో ఉండి పనిచేయటమా లేక పాండిచేరీ వెళ్లిపోవటమా అనే చాయిస్ (ఎంపిక) ఈయబడినది.
ఫ్రెంచి పాలనలో యానాం నుండి పాండిచేరీకి పంపబడ్డ ఆఖరు అధికారిక సమాచారం ఈ టెలిగ్రామే.
ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు ఫ్రెంచి విధేయులైన కాపగంటి, బాజీ, ఉమార్‌ల ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేయటం జరిగింది. విలీన కార్యకర్తలు మరియు సివిల్ దుస్తులలో ఉన్న కొంతమంది సాయుధ పోలీసులు యానాం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో యానాం ఇంచార్జ్ మేయర్, సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఫ్రెంచి విధేయుడూ అయిన సమతం కృష్ణయ్య (78 ఏండ్లు) వద్ద స్వీయరక్షణార్ధం ఉన్న పిస్తోలును చూసి, ఆయనే కాల్పులు జరపటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో ఆయనను కాల్చి చంపటం జరిగింది. యానాం విమోచనోద్యమంలో అసువులు బాసింది ఈయనొక్కడే.

ఉద్యమకారులు  పట్టణ వీధులలో ఊరేగింపు జరిపారు. ఆ తరువాత జరిగిన బహిరంగసభలో మద్దింశెట్టి మాట్లాడుతూ యానాం విమోచనమైనదనీ, భారతప్రభుత్వం దీని పాలన చేపట్టి, ఈ ప్రాంతమును రిఫరెండం లేకుండా భారతావనిలో విలీనం చేసుకోవాలని కోరాడు.

ఆరోజు మధ్యాహ్నం దడాల అడ్మినిష్ట్రేటరుగా భాధ్యతలు స్వీకరించాడు. మద్దింశెట్టి ప్రెసిడెంటుగా, కనకాల వైస్ ప్రెసిడెంటుగా, కామిశెట్టి, యర్రా సత్యన్నారాయణమూర్తి మరియు కోనలు సభ్యులుగా పాలక మండలి ఏర్పరచి బాధ్యతలు చేపట్టారు. చిన్నాభిన్నమైన శాంతిభద్రతలను తిరిగి స్థాపించటంలో ఈ పాలక వర్గం ఎంతో కృషి చేసింది. అలా ఉద్యమకారులచే జరపబడిన యానాం విమోచనం గురించి ఆలిండియా రేడియో మరియు పత్రికలు ప్రకటించాయి.

1954 జూన్ 27న యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచి పతాకాన్ని అవనతంచేసి భారత పతాకాన్ని ఎగురవేసారు. ఈ వేడుకలలో యానాం ప్రజలేకాక పరిసర ప్రాంతాలైన నీలపల్లి, జార్జిపేట, కాపులపాలెంలకు చెందిన ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆవిధంగా సుమారు 2 శతాబ్ధాల ఫ్రెంచిపాలనకు తెరపడింది.

http://te.wikipedia.org/wiki/యానాం విమోచనోద్యమం

తెలుగు ఆణిముత్యాలు - స్వాతంత్ర్య పోరాట వీరులు : ఆదివాసీల పోరుబిడ్డ కొమరం భీమ్!


కొమురం భీమ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సావూజిక న్యాయుంలో భాగవుని నిన దిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా వూరిన పోరాటయోధుడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రావుంలో కొమరం భీమ్ 1900 సంవత్సరంలో జన్మించాడు.
  
ఉద్యమ జీవితం
పదిహేనేళ్ల వయుసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి వురణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. అక్కడ కూడా కొమరం కుటుంబం ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు. సిద్ధిఖీ అన్న జాగీర్‌దార్ కొమరం సాగు చేస్తున్న భూమిని ఆక్రమించడంతో, పట్టరాని కోపంతో సిద్ధిఖీని హతవూర్చి బల్హార్ష మీదుగా అస్సాం చేరుకుని ఐదేళ్లపాటు అక్కడే గడిపాడు. అక్కడి కాఫీ, తేయూకు తోటల్లో పనిచేస్తూ గడించిన రాజకీయు పోరాట అనుభవంతో వుళ్లీ కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు ఆదివాసులపై ఆ రోజుల్లో అడవిలో పశువులు మేపుకున్నందుకూ, వంటచెరకు తెచ్చుకున్నందకూ పన్నులు వసూలు చేసేవాడు. తవు జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై నిజాం ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరం గంభీరంగా సాగించే ప్రసంగాలు ఆదివాసీలను పోరాట సింహాలుగా వూర్చారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు గెరిల్లా పోరాట కేంద్రాలుగా మారారు. జోడేఘాట్ గుట్టలు పోరాట జ్వాలలను రగిలించారు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.

 http://te.wikipedia.org/wiki and sakshi news paper

 కొమరం భీమ్ కధ (సినిమాను అనుసరించి)

 ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ప్రాంతంలో అడవిలో నివసించే గోండులను నిజాం ప్రభుత్వ అధికారులు బాగా దోచుకుంటుంటారు. వారి నుండి అనేక పన్నులు వసూలు చేస్తూ, వారి గూడేలపైబడి అనేక విధాలుగా హింసిస్తూ ఉంటారు. ఒక సారి కొమరం భీం ఉండే గ్రామ పట్వారీ (Village Secretary) వచ్చి “మీరు అడవిని కొట్టి భూముని చదును చేస్కుంటే మీకు నిజాం ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని చెబుతాడు. అది నమ్మి ఆ గోండులు కొంత భూమిని చదును చేసి సాగుచేసుకోవడం మొదలుపెడతారు. తీరా భూమిని దున్నే సమయానికి పట్వారీ దాన్ని కాజేసే ఉపాయం చేస్తాడు. ఆ భూములన్నీ ప్రభుత్వం ఒక ఆసామికి పట్టా చేయమని ఉత్తర్వులు ఇచ్చిందని గోండులు ఆ భూమిని ఖాళీ చేయాలని చెబుతాడు.

ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన గోండు నాయకుడిని చర్చలకు అని పిలిపించి ఆహారంలో విషం ఇచ్చి చంపుతాడు పట్వారి. జరిగిన మోసం అర్థం చేసుకున్న కొమరం భీం ప్రభుత్వాధికారులపైకి తిరగబడతాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు దగ్గరి నుండి తుపాకీ గుంజుకుని సాయుధుడవుతాడు. తోటి గోండులకు జరుగుతున్న మోసాలపై తిరగబడమని చెబుతాడు.

భీం చేస్తున్న పొరాటం గురించి తెలుసుకున్న పై అధికారులు కలవరపడతారు. భీం ను బంధించడానికి ఇంకొంతమంది పోలీసులను పంపుతారు. భీంపై కేసులు పెడతారు. సమీపంలోని టౌన్లో ఉన్న న్యాయవాదిని కలుస్తాడు భీం. “నువ్వు గూడెంలో ఉంటే పోలీసులు గూడెంపై బడతారు. నువ్వు అడవిలోకి పారిపోతే, పోలీసులు నీ వెంట బడతారు, గూడెం ప్రశాంతంగా ఉంటుంది” అన్న ఆ న్యాయవాది సలహా మేరకు భీం అజ్ఞాతంలోకి వెళతాడు. అక్కడే సోం బాయిని వివాహం చేసుకుంటాడు.

కొంత కాలానికి గూడేనికి తిరిగివచ్చిన భీం గోండులను సమావేశపరచి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తాడు.

ప్రాణాలకు తెగించి ఈ పోరాటం ఎందుకు చేయాలన్న భార్య ప్రశ్నకు బదులిస్తూ…
గెలిస్తే మనం తలెత్తుకుని తిరుగుతామని, ఓడిపోయి మరణిస్తే మన పిల్లలు తలెత్తుకుని తిరుగుతారని చెబుతాడు భీం.

భీం తిరుగుబాటును అణచివేయడానికి అసిఫాబాదుకు ఒక కొత్త అవ్వల్ తాలుఖ్దార్ (District Collector) ను పంపిస్తుంది నిజాం ప్రభుత్వం. భీం న్యాయవాది ద్వారా “పోరాటం విరమిస్తే 30 ఎకరాల భూమిని నజరానాగా ఇస్తానని” కబురు పంపుతాడు అవ్వల్ తాలుఖ్దార్.

కానీ భీం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అడవిలోని గోండులందరికి 30 ఎకరాల భూమి ఇస్తుందా ప్రభుత్వం అని ప్రశ్నిస్తాడు.

చివరికి జోడేఘాట్ కొండపైకి పెద్ద ఎత్తున బలగాలను తీసుకుని దండయాత్రకు బయలుదేరుతాడు అవ్వల్ తాలుఖ్దార్. ఉన్న కొద్దిపాటి ఆయుధ సంపత్తితో పోలీసులను మొదటి రోజు నిలువరించగలుగుతాడు భీం. అయితే ఆ రోజు రాత్రి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ ను వెనుకవైపునుండి చుట్టుముట్టిన నిజాం పోలీసులు భీం గోండు సైన్యంపై దొంగదెబ్బ తీస్తారు.

సూర్యోదయం అవుతుండగా పోలీసు బుల్లెట్లకు కొమరం భీం నేలకొరుగుతాడు.

తెలుగు ఆణిముత్యాలు - స్వాతంత్ర్య పోరాట వీరులు : అల్లూరి సీతారామరాజు


అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

విషయ సూచిక

  • 1 వంశం
  • 2 బాల్యం, చదువు
  • 3 ఉత్తరదేశ యాత్ర
  • 4 బ్రిటీషు అధికారుల దురాగతాలు
  • 5 మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం
  • 6 విప్లవం మొదటిదశ
    • 6.1 చింతపల్లి
    • 6.2 కృష్ణదేవి పేట
    • 6.3 రాజవొమ్మంగి
    • 6.4 అడ్డతీగల
    • 6.5 రంపచోడవరం
  • 7 విప్లవం రెండవదశ
  • 8 మరణం
  • 9 ఇతర విప్లవ వీరులు
  • 10 రాజు గురించి వివిధ అభిప్రాయాలు
  • 11 ఇవి కూడా చూడండి
  • 12 బయటి లింకులు
  • 13 మూలాలు, వనరులు

వంశం

సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు -- వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు మరియు అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు. [1]
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.
అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంధం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాధ.)

బాల్యం, చదువు


బాల్యంలో అల్లూరి సీతారామరాజు

సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం. [1] వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.

రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.
1909 లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారం లో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.

రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురం లో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తుని లో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.

రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

ఉత్తరదేశ యాత్ర

1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు.
కృష్ణదేవి పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవి పేటలోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.
రెండవ యాత్ర
1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవి పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్తులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావగారు కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు.
అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కధలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.

బ్రిటీషు అధికారుల దురాగతాలు

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.

ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.

మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.

అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

విప్లవం మొదటిదశ

ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాటయచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.

గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.

విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:

చింతపల్లి

1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.

కృష్ణదేవి పేట

ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.

రాజవొమ్మంగి

ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.

వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.

అడ్డతీగల

రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసి మరీ వెళ్ళాడు.

రంపచోడవరం

అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాలను గురించి కధలు కధలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.

ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు. ఆ తర్వాత రాజు దొరక్

విప్లవం రెండవదశ

డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.

ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.

1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)

క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.

జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాభీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.

2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.

సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.

మరణం

17-4-1924న మన్యంకు కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు.విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు.

ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత, 1923 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.[2].

ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

ఇతర విప్లవ వీరులు

సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న "పందుకొంటకొన" వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు.

22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగుపూడిలో నివశించాడు. [1]

రాజు గురించి వివిధ అభిప్రాయాలు


భారత తపాల శాఖ 1986లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల
  • అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
    • కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
    • స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
    • కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.
అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.

1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:
శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. - (యంగ్ ఇండియా పత్రిక - 1926) [3]
సుభాష్ చంద్ర బోస్-
సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
"సీతారామరాజు" బుర్రకధ ముగింపులో ఇలా ఉంది -
శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది [4] 

మూలాలు, వనరులు

  1. ↑ 1.0 1.1 1.2 అల్లూరి సీతారామరాజు (తెలుగు వైతాళుకులు శీర్షికలో లఘుగ్రంధం) - రచన: ఆచార్య కలిదిండి వెంకట రామరాజు - ప్రచురణ: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)
  2. ↑ తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ (మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు)
  3. ↑ http://www.archive.org/details/allurisitaramara025767mbp
  4. ↑ విప్లవజ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు బుఱ్ఱకధ - కూర్పు: పి.దుర్గారావు
 http://te.wikipedia.org/