Wednesday, February 15, 2012

బిజెపి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చగలదా?


 
తెలంగాణలో సకల జనుల సమ్మె విరమణ తరువాత ఒక నిస్తేజ వాతావరణం కనిపిస్తున్నది. తెలంగాణా పొలిటికల్ జాక్ ఇచ్చిన పిలుపుతో అన్ని ఆందోళనలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో 42 రోజులపాటు సామాన్య పౌరుడు పాల్గొన్నాడు. ఈ సమ్మె సరియైన ఫలితాలు ఇవ్వకపోవడంతో అంతటా నిరాశా, నిస్పృహలు కనబడుతున్నాయి. తెలంగాణా విషయంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట నిలబెట్టుకోక తెలంగాణ ప్రజలను మోసం చేశారు. దేశంలో రెండవ జాతీయ పార్టీ అయిన బిజెపి "ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు" అన్న కాకినాడ తీర్మానం, ఇటీవల తెలంగాణ పేరుతో ఆవిర్భవించిన పార్టీ కంటే ముందే చేశారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి "తెలంగాణ పోరు యాత్ర" పేరుతో రాష్ట్రమంతటా రథయాత్ర చేశాడు. పరిస్థితుల ప్రాబల్యంతో తాము కేంద్రంలో ఉన్న సమయంలో తెలంగాణ సమస్యను పరిష్కరించలేకపోయాము. అయినా ఆ ఉద్యమాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నామనే విషయాన్ని ఈ ఉద్యమంతో బిజెపి తేటతెల్లం చేసినట్లైంది. ఈ సమయంలో జరుగుతున్న సభలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సభలు, సభలలో పాల్గొన్న ప్రజానీకాన్ని చూసినప్పుడు తెలంగాణలోని సామాన్య ప్రజలలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదో స్పష్టమవుతున్నది. తెలంగాణ రావాలంటే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ సరియైన సమర్ధన ఇవ్వగల పార్టీ అధికారంలో ఉండాలి. ఆ బాధ్యత తమదని ప్రజలలో నిరూపించుకోవలసిన బాధ్యత బిజెపి పార్టీదే.

ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం వంటి ఉద్యమం ఈ మధ్య కాలంలో ఇంత దీర్ఘకాలం ఏదీ జరగలేదు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం కావలసిన ఈ అంశం కోసం వందలమంది ఆత్మార్పణ చేసుకోవటం, దశాబ్దాలపాటు ఉద్యమించటం ఆంద్రప్రదేశ్ చరిత్ర తెలియచేస్తున్నది. ప్రజలను పాలించవలసిన పాలకులే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించటం, తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీల చరిత్ర కూడా మనకు కనబడుతున్నది. తెలంగాణ పోరుయాత్ర విజయవంతం కావటమనేది సామాన్య ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒక జాతీయ పార్టీగా బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని తేటతెల్లమవుతున్నది. బిజెపి తెలంగాణ ప్రజలను కదిలించగలిగినప్పటికి వారి ఆకాంక్షను తీర్చగలదా  లేదా అనేది రాబోయే రోజులలో తేలవలసిన అంశం.
 
 http://www.lokahitham.net/2012/02/blog-post_15.html

No comments:

Post a Comment