వివేక సూర్యోదయం
ప్రపంచంలో భారతదేశం ఎంతో విలక్షణమైనది, సమన్వయ దృష్టి కోణం కలిగినది భారతీయ సంస్కృతి. అసలు సంస్కృతి అంటే యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "ఏదేని సమాజంలో ఒక తరం నుండి మరొక తరానికి అందించబడే ఆలోచనలు, నమ్మకాలు, ప్రతీకలు, భౌతిక, ఆధ్యాత్మిక విషయాలు, విలువలు, సామాజిక వ్యవస్థ మొదలైనవి అన్ని కలగలిపిన వ్యవస్థ సంస్కృతి అనబడును". భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల నుండి విలసిల్లుతూ వస్తున్నది. గడిచిన వెయ్యి సంవత్సరాలకు పైగా విదేశీయుల రాజకీయ, సాంస్కృతిక ఆక్రమణను ఎదిరించి పోరాటం చేసిన జాతి మనది.
ఆంగ్లేయులు పాలిస్తున్నరోజులలో భారత దేశాన్ని బాగుపరిచేందుకు భగవంతుడు మమ్ములను ఇక్కడికి పంపారు అని చెప్పుకొనేవారు ఆంగ్లేయులు. భారతదేశాన్ని మానసికంగా పూర్తిగా తనకు బానిసగా ఉండే దేశంగా నిర్మాణం చేయటానికి ఈ దేశంలో ప్రత్యేక విద్య వ్యవస్థను అమలు చేసారు. దేశ ఆర్థిక వ్యవస్థను, పాలనా వ్యవస్థను, న్యాయవ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఈ పరిస్థితులలో ఇక్కడి ప్రజలను జాగృత పరచటానికి జన్మించిన మహా పురుషులలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతల గొప్పతనాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పినవారు. ఈ దేశంలో ముఖ్యంగా యువతను జాగృతం చేయటానికి స్వామి వివేకానంద ప్రయత్నించారు.
స్వామి వివేకానంద బాల్యం నుండి భగవంతుడ్ని చూడాలనే కోరికతో ఏ సాధువు, సన్యాసి కలిసినా అడిగే మొదటి ప్రశ్న మీరు భగవంతుడ్ని చూశారా? విద్యార్థి దశ చివర్లో రామకృష్ణ పరమహంస ద్వారా ఆ ప్రశ్నకు వివేకానందుడికి సంతృప్తికరమైన సమాధానం లభించింది. రామకృష్ణ పరమహంస ప్రేరణతో అయన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది.
రామకృష్ణ పరమహంస పరమపదించిన తరువాత ఆశ్రమ బాధ్యత వివేకానందుడిపై పడింది. ఆ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆశ్రమం కలకత్తా పట్టణ శివారులోని ఒక దయ్యాల కొంపలోకి మార్చబడింది. అక్కడ తినేందుకు తిండి సరిగా దొరకని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వివేకానంద భారత పర్యటన చేయాలని నిర్ణయించుకొని శిష్యులలో ఒకరికి ఆశ్రమ బాధ్యతలు అప్పగించి దేశ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భమే వివేకానందుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దింది. ఈ పర్యటనలో దేశ పరిస్థితులను అవగాహన చేసుకొన్నారు. ఆ తరువాత విశ్వమత మహాసభ సమ్మేళనంలో పాల్గొని హిందూ సంస్కృతి, ధర్మాల గురించి ప్రపంచానికి చాటారు. దానితో ఆయన పేరు దేశ విదేశాలలో గుర్తింపు పొందింది. "హిందూ మాంక్ ఆఫ్ ఇండియా" గా ఆనాటి పత్రికలు ఆయనను అభివర్ణించాయి. భారత దేశానికి తిరిగి వచ్చిన తరువాత ఈ దేశ సంస్కృతిని రక్షించేందుకు, ఈ దేశ పునర్నిర్మాణానికి యువతను ప్రేరేపించాడు. దేశ పరిస్థితులను చక్కదిద్దుకోవడం మనందరి కర్తవ్యం అని బోధించాడు.
స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఈ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశమేమంటే "మనం పూజించే మూడు కోట్ల దేవతలను రాబోవు 50 సంవత్సరాల పాటు ప్రక్కన పెట్టి ఆ స్థానంలో మన తల్లియైన భారతమాతను ప్రతిష్టించి ఆ తల్లిని ఆరాధించాలని పిలుపునిచారు. ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు తలమానికంగా మరల నిర్మాణం చేసుకోవాలని చెప్పారు. ఈ దేశంలో దీన దుఃఖిత ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, వారికి విద్య, వైద్యం, సామాజిక గౌరవం కల్పించాలని పిలుపునిచ్చారు. ఆ దిశలో జరుగుతున్న విశేష ప్రయత్నమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యం. సామాన్య కుటుంబాల నుండి అనేక మంది గొప్ప గొప్ప మహాపురుషులు జన్మించారు. వాళ్ళందరు ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి కృషి చేసారు, చేస్తున్నారు. మన దేశమే కాక ప్రపంచంలో అనేక దేశాలకు వివేకానందుని పిలుపు ఆదర్శంగా పని చేసింది. ఉదాహరణకు ఇండోనేషియా దేశాన్ని డచ్ వాళ్ళు పాలిస్తున్న రోజులలో స్వాతంత్ర్య పోరాటం జరిగింది. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన సుకర్ణో జైలులో నిర్బంధించబడినప్పుడు ఆ జైలులో వివేకానందుని బోధనలు చదివాడు. అయన చెప్పిన "ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాము, ఇంకా ఎద్చేందుకు కన్నీళ్ళేమీ మిగల్లేదు. లేవండి, లేచి నిలబడండి" అనే వాక్యం సుకర్ణోను ఎంతో ప్రభావితం చేసింది. ఆ ప్రేరణతో స్వాతంత్ర్య పోరాటంలో విజయం సాధించాడు. వివేకానందుడిచ్చిన ప్రేరణతో అనేక పనులు దేశంలో నేడు జరుగుతున్నాయి. స్వామి వివేకానంద జన్మించి 2012 జనవరి 12 కు 150 సంవత్సరం ప్రవేశిస్తున్నది.
ఈ సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున వివేకానందుని ప్రేరణ దాయక విషయాలు యువతకు అందించాలని ప్రయత్నాలు ప్రారంభమైనాయి వీటి నుండి అందరు ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాం.
http://www.lokahitham.net/2012/01/50.html
No comments:
Post a Comment