Monday, January 23, 2012

తెలుగు ఆణిముత్యాలు : ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱన/ ఎర్రన





ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవిత్రయంలో మూడోకవి ఎర్రన. ఆంధ్రమహాభారతాన్ని నన్నయ ప్రారంభించాడు. ఎక్కువ పర్వాలు తిక్కన రచించాడు. అయినా దాన్ని పూర్తిచేసిన ఘనత మాత్రం ఎర్రనకే దక్కుతుంది. నన్నయ వదిలేసిన అరణ్య పర్వంలోని అర్ధభాగాన్ని ఏ కారణం వలనో తిక్కన కూడా విడిచిపెట్టి విరాటపర్వం నుంచి ప్రారంభించాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎర్రన అరణ్యపర్వాన్ని పూర్తిచేశాడు. దానివల్ల, ఎర్రన వర్ణనా నైపుణ్యం వల్ల ఆయనను ప్రబంధ పరమేశ్వరుడు అని పొగిడేవారు. ఎర్రన అరణ్యపర్వాన్ని నన్నయలా ప్రారంభించి, తిక్కనలా పూర్తి చేశాడు. వారిద్దరి కవితా మార్గాల మధ్య వారధిగా నిలిచాడు. వారి మార్గాలను అనుసరించడమే కాకుండా తెలుగు కవిత్వంలో కొత్త పోకడలకు నాంది పలికాడు ఎర్రన. ఒక భావాన్ని కొత్తగా చెప్పే ‘ఉక్తి వైచిత్రి’ లో ఎర్రన చాలా ప్రసిద్ధి చెందాడు. ఆయన హరివంశం, నృసింహ పురాణం అనే గ్రంథాలు కూడా రచించాడు. ఎర్రన క్రీ.శ.1280-1364 ప్రాంతంలో జీవించాడనడానికి ఆధారాలున్నాయి. ఆయన ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఆస్థానకవిగా ఉండేవాడు.

ఎర్రన రాసిన హరివంశంలో రెండు భాగాలున్నాయి. ఒకటి పూర్వ హరివంశం. మరొకటి ఉత్తర హరివంశం. మొదటి దానిలో తొమ్మిది ఆశ్వాసాలు 2044 గద్య పద్యాలు, రెండవదానిలో పది ఆశ్వాసాలు 2660 గద్య పద్యాలు ఉన్నాయి. ఎర్రన దీనిని రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. మహాభారతంలోని అరణ్యపర్వాన్ని పూర్తిచేయడమే కాకుండా, దానికి కొనసాగింపుగా హరివంశాన్ని రచించడంవల్లే ఎర్రన కవిత్రయంలో ఒకనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.

From wikepedia

ఎఱ్రాప్రగడ

 ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.

సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మద్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఏఅయనను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడ వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు కలదు.

ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని భాగము)లోని గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించినాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సుర్రన్న, తల్లి పొత్తమ్మ. ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱ్రపొతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ. ఎఱ్ఱాప్రగడ ముత్తాత ల పేర్లు బొలన మరియి పొలమ్మ. ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా విష్ణువుని కూడా పూజించేవాడు.

ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని అనువదించడానికి బహుశా మహాకవి తిక్కన వెనుకంజ వేశాడు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు.

ఇంకా ఎఱ్ఱన హరివంశమును, రామాయణాన్ని సంస్కృతం నుండి అనువదించి ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణము అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. పురాణం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కధ, విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది.

సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -

తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కనకవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు.

No comments:

Post a Comment