Monday, January 23, 2012

తెలుగు ఆణిముత్యాలు : కందుకూరి వీరేశలింగం పంతులు



తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార! 



చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధిపైఈ నాటికీ కనుపిస్తుంది.

గొప్ప సంఘ సంస్కర్త. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.

చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.

చదువుకునే రోజుల్లో కేశవచంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.

ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు.

1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు.

పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మ కు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది.

వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.

 http://www.chandamama.com/lang/story/TEL/12/40/117/1558/stories.htm

No comments:

Post a Comment