Thursday, January 19, 2012

నేటి నుంచి బిజెపి తెలంగాణ పోరుయాత్ర

రంగంలోకి జాతీయ నాయకులు ఏకతాటిపైకి బిజెపి సహ సంఘాలు, తెలంగాణ జాక్


హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవాన్ని తెస్తూ తెలంగాణ సాధన ఉద్యమానికి రెండోదశలో జవసత్వాలు నింపేందుకు భారతీయ జనతా పార్టీ గురువారం నుంచి తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించబోతోంది. గత మూడు నెలలుగా పెద్దఎత్తున యాత్రకు కసరత్తు చేస్తున్న పార్టీ పెద్దలు, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలమయ్యారు బిజెపి  అగ్రనాయకులు తెలంగాణ సాధన ఉద్యమంగానే చేపట్టినట్టు చెబుతుండటం గమనార్హం. పార్టీకి ప్రతిగ్రామాన నాయకత్వాన్ని పటిష్టపరిచే క్రమంలో యాత్ర సాగుతుందని సీనియర్ నేతలు చెప్పారు. గత పది రోజులుగా పార్టీ యంత్రాంగం మొత్తం తెలంగాణ పోరు యాత్రలోనే నిమగ్నమైంది. 24 రోజుల పాటు 9 జిల్లాల్లో 4 వేల కిలోమీటర్లు సాగే పోరుయాత్ర 400 మండలాల్లో 9వేల గ్రామాల మీదుగా సాగుతుంది. ఈమేరకు ఇప్పటికే సీనియర్ నేతలు కూర్చునేందుకు రథాన్ని సిద్ధం చేశారు. గతంలో అద్వానీ రథయాత్ర విజయవంతమైన నేపథ్యంలో పోరుయాత్రపై పార్టీ సీనియర్లు కోటి ఆశలతో ఉన్నారు. యాత్రలో భాగంగా 72 బహిరంగ సభలు, 58 రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఈనెల 19న మహబూబ్‌నగర్ జిల్లా తంగిడి సమీపాన కృష్ణా అనే గ్రామంలో మొదలయ్యే యాత్ర ఫిబ్రవరి 9న ఖమ్మం జిల్లా భద్రాచలంలో ముగుస్తుంది. అనంతరం 11న హైదరాబాద్‌లో భారీఎత్తున యువమోర్చ సదస్సు ముగింపు సభగా నిర్వహిస్తారు. తొలిరోజు మక్తల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వస్తారు. నితిన్ రాక సందర్భంగా తెలంగాణ నేతలు  భారీఎత్తున జనసమీకరణకు సన్నద్ధం అవుతున్నారు. పార్టీ అనుబంధ, యువజన సంఘాల నేతలతో పార్టీ పెద్దలు వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క టిఆర్‌ఎస్‌తోనూ, తెలంగాణ జాక్ నేతలతోనూ బిజెపి నాయకులు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు అందర్నీ సమావేశపరిచి కార్యశీలతను రూపొందించారు.
 

కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి వినియోగించడంతో పాటు యాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లోని స్థానిక సమస్యలను గుర్తించి ప్రస్తావించడం, ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను స్వీకరించడం, తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ అభివృద్ధికి బిజెపి ప్రణాళిక ఏమిటో రోజుకో అంశాన్ని వివరించడం, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో పెద్దఎత్తున యువజనులు పార్టీలో చేరేందుకు ప్రోత్సహించడం, పార్టీ కేడర్‌ను ప్రతిబింబించేలా వందలాది కార్లు, మోటారుసైకిళ్లను యాత్రలో వినియోగించడం వంటి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు.
 

తెలంగాణ అభివృద్ధి పట్ల బిజెపి ఆలోచనలను పంచుకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమం ముగిసిపోయిందనే వాదనలను తిప్పికొట్టి సమసిపోలేదనే గట్టి సందేశాన్ని కేంద్రానికి పంపించాలనే పట్టుదలతో పోరుయాత్రను రూపొందించారు. జనవరి 19, 20, 21 తేదీల్లో మహబూబ్‌నగర్, జనవరి 22, 23 తేదీల్లో రంగారెడ్డి, 24, 25 తేదీల్లో మెదక్, 26, 27 తేదీల్లో నిజామాబాద్, 28, 29 తేదీల్లో ఆదిలాబాద్, జనవరి 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో కరీంనగర్, 2, 3, 4 తేదీల్లో వరంగల్, 5, 6 తేదీల్లో నల్లగొండ, 7, 8, 9 తేదీల్లో ఖమ్మం జిల్లాల్లో యాత్ర సాగుతుంది. ప్రతి గ్రామంలో సమావేశాలు పెట్టే బదులు, స్వల్పదూరంలో భారీ సభలు పెడితే జన సమీకరణతోపాటు యాత్రకు అర్థం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూలు, అమనగల్లు, షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా కులకచర్ల, లక్ష్మాపూర్, తాండూరు, వికారాబాద్, శంకర్‌పల్లి, చిల్కూరు, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మెదక్‌లో పటాన్‌చెరువు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్, నర్సాపూర్, మెదక్‌లలో బహిరంగ సభలు జరుగుతాయి. తర్వాత నిజామాబాద్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. అవసరమైతే స్వల్ప మార్పులు చేసుకుని దానిని కొనసాగిస్తారు. అక్కడి నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది.

 http://www.andhrabhoomi.net/state/t-352

No comments:

Post a Comment