ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము!
ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమొ,
జనియించినాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్ ప్రేమించినావొ
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున!
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు!
సూర్యునివెలుతురుల్ సోకునందాక,
ఓడల జెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడుచునందాక,
అందాక గల ఈ యనంత భూతలిని
మన భూమి వంటి చల్లని భూమి లేదు
పాడరా నీ తెన్‌గు బాలగీతములు
పాడరా నీ వీర భావభారతము!
తమ తపస్సులు ఋషుల్ ధారపోయంగ,
శౌర్యహారము రాజచంద్రు లర్పింప,
భావ సూత్రము కవిప్రభువు లల్లంగ,
రాగదుగ్దము భక్త రత్నముల్ పిదుక
దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ
రాళ్ళతేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనం బెగయ
సౌందర్య మెగబోయు సాహిత్య మలర
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర!
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర!
పొలములు రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట
పృథివి దివ్యౌషదుల్ పిదికెరా మనకు
అవమాన మేలరా, అవమాన మేల,
భరత పుత్రుడ నంచు భక్తితో బలుక!
this good
ReplyDeletethis good
ReplyDelete