http://en.wikipedia.org/wiki/Bammera_Pothana
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు[ఆధారం కోరబడినది]. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ భాగవతము మొత్తము తెలుగు తనము ఉట్టిపడుతుంది.
పోతన, శ్రీనాధ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.
పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.
పోతన ఇతర కృతులు
- వీరభద్ర విజయము, భోగినీ దండకము, భాగవతము 8 స్కందములు మరియు నారాయణ శతకము
వీరి భాగవతము నుండి మచ్చుకి కొన్ని పద్యాలు
ఆయన సంకల్పాన్ని, వినయాన్ని, భక్తిని చాటే పద్యములు....-
- పలికెడిది భాగవతమట !
- పలికెంచెడువాడు రామ భద్రుండట, నే
- పలికిన భవహరమగునట
- పలికెద వేరొండు గాథ పలుకగనేలా
-
- భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు !
- శూలికైన - తమ్మిచూలి కైన !!
- విబుధ జనులవలన విన్నంత కన్నంత
- తెలియ వచ్చినంత తేట వరకు
-
- శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
- క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్ దానవో
- ద్రేకస్తంభకు కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
- నాకంజాత భవాండకుంభకు మహానందాంగనాఢింభకున్
-
- చిత్రంబులు, త్రైలోక్య ప
- విత్రంబులు, భవలతా లవిత్రంబులు, స
- న్మిత్రంబులు, ముని జనవన
- చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబుల్
వామన మూర్తికి దానమివ్వటానికి సిద్ధపడిన బలి చక్రవర్తిని వారిస్తూ శుక్రాచార్యుడు...
-
- వారిజాక్షులందు వైవాహికములందు
- ప్రాణ విత్త మాన భంగ మందు
- చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
- బొంకవచ్చు అఘము పొంద డధిప
శుక్రాచార్యునితో బలి చక్రవర్తి సంవాదం...
-
- కారే రాజులు రాజ్యముల్ కలుగవే
- గర్వోన్నతింబొందరే! వా రేరీ?
- సరి మూటగట్టుకొని పోవంజాలిరే!
- భూమిపై పేరైనింగలదే! శిబిప్రముఖులున్
- ప్రీతిన్ యశ:కాములై యీరే కోర్కులు
- వారలన్ మరచిరే యిక్కాలమున్ భర్గవా!
-
- ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై
- అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై
- కపోల తటిపై పాలిండ్లపై
- సూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట
- మీదై నా కరబుంట మేల్గాదే!
- రాజ్యము గీజ్యమున్ సతతమే!
- కాయంబు నా పాయమే!
-
- మేరువు తలక్రిందైనను
- పారావారంబు లింకబారిన లో లో
- ధారుణి రజమై పోయిన
- తరాధ్వము ఖండమైన తప్పక యిత్తున్
-
- ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
- నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
- ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
- ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
- సత్యపదోన్నతుం డగుచు
- బ్రహ్మాండాంత సంవర్ధియై
బృందావనములో గోపాలుని వెదుకుచున్న గోపకాంతల తాపత్రయము.....
-
- నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై
- జల్లెడువాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వురా
- జిల్లెడుమోమువా డొకడు ెల్వల మానధనంబు దెచ్చె నో
- మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ, చెప్పరే?
-
- మామా వలువలు ముట్టకు
- మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్
- మా మాన మేలకొనియెదు
- మా మానసహరణ మేల మానుము కృష్ణా:
-
- పున్నాగ: కానవే పున్నాగ వందితు, తిలకంబ: కానవే తిలకనిటలు
- ఘనశర: కానవే ఘనసారశోభితు, బంధూక: కానవే బంధుమిత్రు
- మన్మథ: కానవే మన్మథాకారుని, వంశంబ: కానవే వంశధరుని
- చందన: కానవే చందన శీతలు, కుందంబ: కానవే కుందరను
మొసలిబారి చిక్కిన గజేంద్రుడు ఆపన్నశరణుని వేడుకొన్న విధము... దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు ఈ పద్యము చక్కని సమాధానము. అన్ని మతములవారికి సరిపోగలదు.
-
- ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
- ఎవ్వనియందు డిందు, పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
- బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వముదాన యైన వా
- డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
-
- లోకంబులు లోకేశులు
- లోకస్థులు తెగిన తుది అలోకంబగు
- పెంజీకటి కవ్వల
- ఎవ్వండేకాకృతి వెలుగు నతను నే సేవింతున్
-
- లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
- ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
- నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
- రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;
-
- అల వైకుంఠపురంబులో నగరిలో
- ఆ మూల సౌధంబు దావల
- మందారవనాంతరామృత నర:
- ప్రాంతేందుకాంతోపలోత్సల పర్యంక
- రమావినోదియగు ఆపన్నప్రసన్నుండు
- విహ్వల నగేంద్రము పాహి పాహి యన
- కు య్యాలించి సంరంభియై
గజరాజును కాచుటకు తొందరపడుచున్న శ్రీ మహా విష్ణువు ఆర్తజనరక్షణా తత్వము ఇలా ఉన్నది.
-
- సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
- పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
- తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
- పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.
-
- తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
- న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ
- క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చిరొ
- య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
-
- అడిగెదనని కడువడిజను
- అడిగిన తన మగడు నుడువడని నడయుడుగును
- జిరజిర చిరిముడి తడబడ
- అడుగిడు అడుగిడదు జడిమ నడుగిడునెడలన్
-
- పడతీ: నీ బిడ్డడు మా
- కడవలలో నున్న మంచి కాగిన పా లా
- పడుచులకు బోసి చిక్కిన
- కడవలబో నడిచె నాఙ్న గలదో లేదో?
-
- ఓ యమ్మ నీ కూమరుడు
- మాఇంటి పాలు పెరుగు మననీ డమ్మా
- పోయదము ఏక్కడి కైనను
- మాయనెన్నల సొరబులాన మంజుల వాణి
మన్ను తిన్నావా? కన్నా? అని తల్లి యశోద గద్దించినది. లేదమ్మా అని బాలకృష్ణుడు నోరు తెరచి చూపెను. ఆ లీలామానుషుని నోట యశోదమ్మ సకల భువనములను చూచి అబ్బురపడినది...........
-
- కలయో!వైష్ణవమాయయో! ఇతర సంకల్పార్ధమోసత్యమో
- తలపన్ నేరక యున్నదాననొ: యశోదాదేవి గానో! పర
- స్థలమో! బాలకుడెంతయీతనిముఖస్తంబైయజాండంబు ప్ర
- జ్వలమైన్ యుండుట కేమిహేతువో! మహాశ్చర్యంబు చింతింపగన్
నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము......
-
- కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్ కుంభినిం
- కలడగ్నిన్ దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్
- కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగవ్యక్తులందంతటన్
- కలడీశుండు కలండూ తండ్రీ వెదుకంగానేల ఈయాయెడన్
-
- ఇందు గలడందు లేడను
- సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
- డెందెందు వెదెకి చూసిన
- అందందే కలడు దానవాగ్రణి కంటే!
ప్రహ్లాదోపాఖ్యానమునుండి మరికొన్ని...
-
- కమలాక్షు నర్చించు కరములు కరములు
- శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ
- సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
- శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
- విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
- మధువైరి తవిలిన మనము మనము
- భగవంతు వలగొను పదములు పదములు
- పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
- దేవ దేవుని చింతించు దినము దినము
- చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
- కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు
- తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి
-
- బలయుతులకు దుర్భలులకు
- బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మా
- దులకున్ బలమెవ్వడు ప్రాణులకును
- బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా!
రుక్మిణి కళ్యాణం నుంచి.....
-
- శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో
- మాయువు గోరుచందమున మత్తుడు చైద్యు॰డు నీ పదాంబుజ
- ధాయిని యైన నన్ను వడి॰ దా॰ గొనిపోయెద నంచు నున్నవా॰
- డా యధమాధముం డెఱుగ॰డద్బుత మైన భవత్ప్రతపముల్
-
- ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణంధ్రబుల కలిమి యేల
- పురుషరత్నమ! నీవు భోగింప॰గా లేని తనులతవలని సౌందర్యమేల
- భువనమోహన! నిన్ను॰ బొడగాన॰గా లేని చక్షురిద్రియముల సత్త్వమేల
- దయిత! నీ యధరామృతం బాన॰గా లేని జిహ్వకు ఫలరససిద్ది యేల
-
-
- నీరజాతనయన! నీ వనమాలికా
- గంధ మబ్బలేని ఘ్రాణ మేల
- ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
- జన్మమేల యెన్ని జన్మములకు
-
-
- వచ్చెద విదర్భభూమికి॰
- జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్
- దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
- వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చిన॰ బోరన్.
-
- ఘను॰డా భూసురు॰డేగెనో నడుమ మార్గశ్రాంతు॰డై చిక్కెనో
- విని కృష్ణుండిది తప్పుగా దల॰చెనో విచ్చేయునో యీశ్వరుం
- డనుకూలింప॰ దలంచునో తలప॰డో యార్యా మహాదేవియున్
- నను రక్షింప నేఱుంగదో నా భాగ్య మేట్లున్నదో.
-
- నమ్మితి నా మనంబున సనాతనులైన యుమా మహేశులన్
- మిమ్ము॰ బురాణదంపతుల మేలు భజింతు॰ గదమ్మ!మేటి పె
- ద్దమ్మ!దయాంబురాశివి గదమ్మ! హరం బతిసేయుమమ్మ! నిన్
- నమ్మిన వారి కెన్న॰టికి నశము లేదు గదమ్మ! యీశ్వరీ!
-
- ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
- భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
- ధవ సత్కారిణి॰ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
- సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణి॰ రుక్మిణిన్
-
- తొలుకారు మెఱుఁగు కైవడి
- తళతళ యని మేను మెఱయ ధగధగ యనుచున్
- గలుముల నీనెడు చూపుల
- చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా!
-
- పాలమున్నీటిలోపలి మీఁది మీగడ మిసిమి జిడ్డునఁజేసి మేనువడసి
- క్రొక్కారుమెఱుఁగుల కొనల తళుక్కుల మేనిచేగల నిగ్గుమెఱుఁగు చేసి
- నాఁడునాఁటికిఁ బ్రోది నవకంపుఁ దీఁగెల నునుఁబోద నెయ్యంబు నూలుకొలిపి
- క్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁబ్రొద్దునఁ బొలసిన వలపులఁ బ్రోదివెట్టి
-
- పసిఁడిచంపకదామంబు బాగుఁ గూర్చిబ్రాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చి
- జాణతనమునఁ జేతుల జిడ్డివిడిచి నలువ యీ కొమ్మనొగిఁజేసినాఁడు నేడు
-
- విషధరరిపు గమనునికిని
- విషగళ సఖునికి విమల విషశయనునికిన్
- విషభవభవ జనకునికిని
- విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్
No comments:
Post a Comment