Friday, January 20, 2012

తెలంగాణా ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిన కమలం



మక్తల్, నారాయణ్‌పేట్ బహిరంగ సభలు సక్సెస్,  కదలివచ్చిన అగ్ర నేతలు,

బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం




మక్తల్, జనవరి 19: తెలంగాణ పోరుయాత్ర ప్రారంభ సందర్భంగా మక్తల్, నారాయణ్‌పేట్‌లో గురువారం నిర్వహించిన సభలతో భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. 

మక్తల్ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణాలో ఏ  పార్టీకి లభించని ఆదరణ తెలంగాణ పోరుయాత్రకు లభించడం, అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, సంస్థల నేతలు సైతం ముందుకొచ్చి మద్దతు పలకడం పార్టీ నేతలకు ఆనందం కలిగించింది. 22రోజుల పాటు సాగే తెలంగాణ పోరుయాత్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి నేతృత్వంలో గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామంలో మొదలైంది. ఉదయానే్న కిషన్‌రెడ్డి సహా వందలాది పార్టీ నేతలు వెంటరాగా కృష్ణా గ్రామంలోని కృష్ణా నది ఒడ్డున కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా మక్తల్ వస్తున్న దారిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి కిషన్‌రెడ్డి బృందానికి ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మక్తల్ చేరిన బృందం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని జాతీయ అధ్యక్షుడితో చర్చలు జరిపిన తర్వాత సాయంత్రం రెండున్నరకు బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జనం మక్తల్ సభకు తరలి వచ్చారు. 

సభకు జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కారీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నితిన్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ తమ చేతులు మీదుగానే ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు సాగునీరు అందించి రైతాంగానికి చేతినిండా పని కల్పిస్తామని, తెలంగాణ ప్రజలకు కొత్త జీవితాన్ని అందిస్తామని  హామీలిచ్చారు. ప్రాజెక్టులు కట్టాలనేది కాంగ్రెస్ నైజం కాదని, 2జి స్పెక్ట్రమ్, కామనె్వల్త్ గేమ్స్‌లో వారు అవినీతికి పాల్పడిన డబ్బుతో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఈప్రాంతంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని వ్యాఖ్యానించారు. నదీ జలాల అనుసంధానానికి తాము యత్నిస్తే వాటికి కాంగ్రెస్ అడ్డుపడిందని, పేదరికాన్ని నిర్మూలించమని ఆనాటి కాంగ్రెస్ నాయకురాలు పిలుపునిస్తే నేటి నేతలు పూర్తిగా పేదలనే నిర్మూలిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఈ తరహా యాత్రలు చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువకావాలని హితవుపలికారు. 

తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై, కార్యకర్తలపై పెట్టిన కేసులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 

సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె లక్ష్మణ్, మురళీధరరావు, జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, నాగర్‌కర్నూల్ నగరాభేరి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ ఇంద్రసేనారెడ్డి, ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆచారి, ఎన్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభా పక్షనేత లక్ష్మీనారాయణ సహా వందలాది నేతలు సభకు హాజరయ్యారు. పోరుయాత్రకు గతంలో అద్వానీ వినియోగించిన రీతిలో రథాన్ని తయారు చేశారు. రథంపై బిజెపి నేతలు యాత్రను కొనసాగిస్తున్నారు.


No comments:

Post a Comment