Friday, January 20, 2012

ఇక సమరమే - తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా

ఒంటరిగా ఎదగండి

ఉప పోరులో అన్నింటా పోటీ,     భవిష్యత్‌లో టిఆర్‌ఎస్‌తో కలవం    -  నేతలకు నితిన్ గడ్కారీ సూచన


మక్తల్, జనవరి 19: ఒదిగి ఉంటూనే ఒంటరిగా ఎదగాలని బిజెపి శ్రేణులకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కారీ సూచించారు. జాతీయస్థాయికి పార్టీ ఎదుగుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో బలహీన మవుతోందని, దీనికి కారణం ఎన్నికల సమయంలో స్థానిక పార్టీలపై ఆధారపడాలని చూడటమేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇతర పార్టీలవైపు చూడకుండా ఒంటరిగా పోటీ చేసి బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.


22రోజుల పాటు జరిగే తెలంగాణ పోరుయాత్రకు హాజరైన నితిన్, మక్తల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొండయ్య నివాసంలో దాదాపు గంటపాటు రాష్ట్ర కీలక నేతలతో భేటీ అయ్యారు. నితిన్ గడ్కారీని కొండయ్య నివాసంలోనే కొంతమంది విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కలిసి తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నితిన్‌గడ్కారీ రాష్ట్ర నాయకులకు రానున్న కాలానికి మార్గదర్ళనం చేశారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమవుతోందని, ఎన్నికల అనంతర పొత్తులపై దృష్టిపెట్టిందే తప్ప ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదనే విషయాన్ని విడమరిచి చెప్పారు. 

రాష్ట్రంలో టిఆర్‌ఎస్ వల్ల ఎప్పటికీ తెలంగాణ వచ్చే అవకాశం లేదనేది సుస్పష్టమైనా, దాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే విషయాన్ని గుర్తించాలని నితిన్ వారికి సూచించారు. పార్టీ కార్యక్రమాలను వ్యక్తిగత కార్యక్రమాలుగా కాకుండా పార్టీ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి కార్యక్రమాలుగా నిర్వహించాలని నితిన్ సూచించారు. ఈ సందర్భంగా టిడిపి, కాంగ్రెస్‌ల బలాబలాలు, టిఆర్‌ఎస్ బలాన్ని, మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దఎత్తున ప్రజలు వలస వెళ్లడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో భూములను పరిశ్రమలకు ఇస్తే లేదా విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయిస్తే స్థానిక ప్రజలు తమకు లబ్ది చేకూరినందుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి కదా? అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలిచినా ఆ పార్టీ భవిష్యత్‌లో బిజెపితో కలిసి పనిచేసే అవకాశం లేదని, ఇప్పటికే తెలంగాణ సాధిస్తామని చెప్పి కాంగ్రెస్‌తో చేతులు కలిపి పనిచేసిన ఆ పార్టీ నేత కె చంద్రశేఖరరావు విశ్వసనీయతపై నమ్మకం లేదన్నారు. రానున్న ఉప ఎన్నికల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేలా చూడాలని నితిన్ సూచించారు. ఒంటరి పోరుతోనే అసలు సత్తా తెలుస్తుంది కనుక, ఆ దిశగా కృషి చేయడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో సమాంతరంగా రెండోశ్రేణి నాయకులను తయారు చేయాలన్నారు.  కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తే సత్ఫలితాలు వస్తాయని నితిన్ నేతలకు వివరించారు. 

 http://www.andhrabhoomi.net/state/bjp-bahiranga-sabha-587

No comments:

Post a Comment