ఆహార ద్రవ్యోల్బణం పనె్నం డు శాతానికి పెరిగిపోవడం గురువారం కేంద్ర మంత్రి వర్గం చిల్లర వ్యాపారాన్ని విదేశీయ సంస్థలకు అప్పచెప్పాలని నిర్ణయించడానికి నేపధ్యంగా నిలిచింది. బహుళ నామ వస్తువుల చిల్లర వ్యాపారంలో ఇరవై విదేశీయ సంస్థలు యాభయి ఒక్క శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చునట! అన్ని దేశాలలోను ఒకే పేరుతో చెలామణి అవుతున్న ఉత్పత్తుల చిల్లర వ్యాపారానికి ఈ విదేశీయ సంస్థలు వంద శాతం పెట్టుబడులు పెట్టవచ్చునట. బహుళ నామక వస్తువులు, ఏక నామక వస్తువులు, అనిర్ధారిత వస్తువులు, ప్రత్యక్షపు పెట్టుబడులు, సంస్థాగత నిధులు, వంటి పదజాలం పేరుతో జరుగుతున్న వాణిజ్య వర్గీకరణ ఆర్థికపరమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇలా గందరగోళాన్ని కల్పించడం బహుళజాతీయ వాణిజ్య సంస్థల ‘మారీచ క్రీడ’లో భాగం. ఈ పదజాలం ఇలాంటి మరెన్నో వాణిజ్య పారిభాషిక పదాలు ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత దేశంలోని దిగుమతి అయింది. బహుళ జాతీయ సంస్థల వారి చిల్లర దుకాణాల మహాప్రాంగణాలు దేశమంతటా ఇదివరకే విస్తరించి ఉన్నాయి. ఇలా దురాక్రమించడానికి ఏవైనా కారణం ప్రపంచీకరణ, ‘‘అంతర్జాతీయ సమాజంలో అనుసంధానం’’ అన్న ఆర్భాటాన్ని 1994నుండి అన్ని రాజకీయ పక్షాలు కొనసాగిస్తుండడం ‘ప్రపంచీకరణ’లో భాగం. ఈ ఆర్భాటపు మార్గంలో మరో ముందడుగు గురువారం నాటి ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ భూమిని కాజేసిన వారి దురాక్రమణలను ‘క్రమబద్ధీకరణం’ చేసినట్టుగా చిల్లర వ్యాపారంలో ఇదివరకే మొదలైపోయిన విదేశీయులు పెత్తనాన్ని ప్రభుత్వం గురువారం ఆధికారికంగా ఆమోదించిందంతే!
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలలోను తీవ్ర నిరసన చెలరేగింది. ‘ఐక్య ప్రగతి కూటమి’ - యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్- అధికార భాగస్వామ్య పక్షాలు సైతం నిరసన స్వరాలను నిగిడించాయి. కానీ ఈ రాజకీయ పక్షాలన్నీ చేతులు కాలాక ఆకులకోసం అనే్వషిస్తున్నాయి. మంత్రివర్గం నిర్ణయించిన సమయంలోనే అధికార భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఎందుకని అభ్యతరం చెప్పలేదు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన కారణంగా బంగ్లాదేశ్‌తో నదీ జలాల పంపిణి ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియను ఇటీవల మన్‌మోహన్‌సింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అంతే నిష్ఠతో పట్టుపట్టి ఉండినట్టయితే ‘్ఫరిన్ డైరెక్ట్ ఇనె్వస్టిమెంట్- ఎఫ్‌డిఐ- విదేశీయ సంస్థల నిధులు - చిల్లర వ్యాపారంలోకి చొరబడడానికి వీలు కలిగేది కాదు. కానీ మంత్రివర్గ నిర్ణయ సమయంలోను, అంతకు ముందూ కూడా మిన్నకుండిపోయిన తృణమూల్ కాంగ్రెస్‌వారు శుక్రవారం నిరసన తెలిపారు!
చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థలకు ప్రవేశం కల్పించే అంశంపై ఇప్పుడు హఠాత్తుగా మంత్రివర్గం నిర్ణయించలేదు. ఈ సమస్య గురించి రెండేళ్లకు పైగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, జాతీయ నిష్ఠగల ఆర్థికవేత్తలు, ఉద్యమకారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇదంతా బధిరాంధ ప్రభుత్వాలకు వినబడలేదు, కనపడలేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రధాన జాతీయ ప్రతిపక్షాలు ఉద్యమంలో భాగస్వాములు కాకపోవడమే. మన దేశపు పాలనా విధానాలను వాణిజ్య సంస్థల వారు నిర్ణయిస్తున్నారని, బహుళ జాతీయ సంస్థలవారు నిర్దేశిస్తున్నారని కొనసాగుతున్న ఆరోపణలు నిజమని సామాన్య ప్రజలు విశ్వసించడానికి ఈ పరిణామక్రమం దోహదం చేస్తోంది!
వాణిజ్య ప్రపంచీకరణ ప్రభావంనుండి, విదేశాల పెట్టుబడుల ప్రలోభం నుండి బయటపడనంత కాలం వ్యవసాయ రంగాన్ని, చిల్లర వ్యాపార రంగాన్ని ‘బహుళ జాతుల’ వాణిజ్య దురాక్రమణ నుండి కాపాడడం అసంభవమైన అంశం. ఇదొక్కటే కాదు... ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆహారం కొరత, ఎరువుల కొరత, విత్తనాల కొరత, ఇంధనం కొరత... ఇలాంటివన్నీ కూడా క్రమంగా ఏర్పడనున్నాయి, ఏర్పడుతున్నాయి. చిల్లర వ్యాపారంలో అరవై శాతం పెట్టుబడులు ఘరానా వాణిజ్య సంస్థలవేనన్న వాస్తవం మూడేళ్ల క్రితమే ధ్రువపడింది. అందువల్ల చిన్న దుకాణాలు మూతపడుతున్నాయి. నెత్తి బుట్టల ముసలమ్మలు, తోపుడుబండ్ల వీధి వర్తకులు కనుమరుగైపోతున్నారు. ఈ సంచార వ్యాపారుల శకం ముగిసిపోవడానికి వీధి వీధికీ విస్తరించిపోయిన ‘మెగా మార్కెట్లు’, ‘జెయింట్ బిజినెస్ జాయింట్లు’. గురువారంనాటి నిర్ణయానికి ముందే ఇవన్నీ జరిగిపోయాయి. అందువల్ల ఈ నిర్ణయం అమలు జరిగిన తరువాత దేశమంతటా నెలకొననున్న వికృత వాణిజ్య దృశ్యమేమిటో ఊహించడం కష్టంకాదు. చిన్న వ్యాపారులకు రక్షణ కల్పించడం పేరుతో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. కానీ ఈ నిబంధనలు నిజానికి విదేశీయ బృహత్ సంస్థల వస్తువులు మాత్రమే ‘మార్కెట్ల’లో నిండిపోవడానికి దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఒకే పేరుతో చెలామణి అయ్యే వస్తువులు ‘సింగిల్ బ్రాండ్’ ఉత్పత్తులట. వీటి చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థలు వంద శాతం పెట్టుబడులు పెట్టవచ్చునట. అంటే ఏమిటి? ఆయా సంస్థలు అమ్మే ‘సింగిల్ బ్రాండ్’ పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని మన దేశంలోని కుటీర, చిన్నతరహా పరిశ్రమలలో తయారవుతున్న వస్తువులు తట్టుకోగలగాలి. లేకుంటే ఆయా స్వదేశీయ వస్తువులు అంతరించిపోవాలి. ఇలా అంతరించిపోవడం అనేక వర్ధమాన దేశాలలో ఇదివరకే జరిగింది. ఇదంతా మన ప్రభుత్వ నిర్వాహకులకు తెలుసు. కానీ తెలిసితెలిసి ఈ ‘మారీచ క్రీడ’కు చిల్లర వ్యాపారులను బలిచేయడానికి ఈ అధికారగ్రస్త రాజకీయ జీవులు ఎందుకు పూనుకున్నారు? రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే స్థాయి నుండి రాజకీయ విధానాలను నిర్దేశించే దశకు విదేశీయ ‘బహుళ వాణిజ్య సంస్థలు’ ఎదిగిపోవడమే ఇందుకు కారణం! ప్రపంచీకరణ తొలి ఘట్టం నడిచింది. ఇప్పుడు మరో ఘట్టం మొదలైంది. రైతులకు పట్టిన గతి చిల్లర వ్యాపారులకు పట్టించడమే ఈ ఘట్టానికి ప్రభుత్వం నిర్దేశిస్తున్న ఇతివృత్తం! నిరోధించడానికి నడుం బిగించేదెవరు??
http://www.andhrabhoomi.net/sampaadakeeyam/editorial-265