జైపూర్, నవంబర్ 11: ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ ముఖ్యమంత్రి మాయావతి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో కొత్త రాష్ట్రాలను ఆలోచించకుండా ఆషామాషీగా ఏర్పాటు చేయడం సరికాదని, ఈ విషయంలో మరింతగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ అభిప్రాయ పడ్డారు. ‘ఉత్తరప్రదేశ్‌ను విభజించే విషయంలో అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత మాత్రమే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలనేదే నా అభిప్రాయం’ అని అద్వానీ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు ప్రత్యేక ఉత్తరాఖండ్ ఏర్పాటు డిమాండ్ చాలాకాలంగా ఉండడంతో రాష్ట్రాన్ని ఇప్పటికే రెండు ముక్కలుగా విడగొట్టారని కూడా ఆయన అన్నారు. ‘రాష్ట్రాలను ఆషామాషీగా ఏర్పాటు చేయకూడదు. మేము కూడా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసాం. అయితే ఈ రాష్ట్రాలకోసం డిమాండ్ చాలాకాలంగా ఉండడంతో అందరితోను చర్చించి, అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకున్నాం’ అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అద్వానీ చెప్పారు.
కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్య గురించి మాట్లాడుతూ ‘అక్కడ ఈ డిమాండ్ గత పాతిక, ముఫ్ఫై సంవత్సరాలుగా ఉంది. అయితే గత రెండేళ్లుగా యుపిఏ ప్రభుత్వం ఈ సమస్య విషయంలో వ్యవహరించిన తీరు కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు, గతంలో 35-40 రోజుల పాటు అన్ని పనులు స్తంభించిపోయాయి’ అని అద్వానీ అన్నారు.
వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ నల్లధనం అంశాన్ని లేవనెత్తుతుందని, విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి చర్యలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని ఆయన చెప్పారు. ‘ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవయినా ఉంటే కోంతమందిని కాపాడ్డం కోసం మాత్రమే తీసుకుందనే అనుమానాలు కలుగుతున్నాయి’ అని బిజెపి అగ్రనేత అన్నారు.
తరచూ ఎన్నికలు జరగడం వల్ల పరిపాలన కుంటుపడుతున్నందున లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా అద్వానీ సూచించారు.‘మేము అధికారంలో ఉన్న ఆరేళ్ల సమయంలో ఏదయినా ముఖ్యమైన నిర్ణయం తీసుకోలసి వచ్చినప్పుడల్లా, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, అందువల్ల నిర్ణయం తీసుకోవద్దని ఎవరో ఒకరు చెప్పే వారు. దీంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చేది. ఇలాంటి అనుభవాలు చాలాసార్లు జరిగాయి’ అని అద్వానీ అన్నారు. ఇది పరిపాలనకు మంచిది కాదన్నారు. ‘గత ఏడాది నేను ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలతో మాట్లాడాను. ఈ ఆలోచన బాగుందని వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. అలాంటప్పుడు ఈ అంశంపై మరింత లోతుగా ఎందుకు చర్చించకూడదు, ఇతర పార్టీలను సంప్రదించకూడదని వాళ్లను నేను అడిగాను’ అని అద్వానీ చెప్పారు. 1950లో రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు మామూలుగా ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయన్న ఉద్దేశంతో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను అయిదేళ్లకోసారి జరపాలన్న నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. అయితే ప్రారంభంలో పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఆ తర్వాత వేరు చేసారని ఆయన అన్నారు. ‘అమెరికాలో తదుపరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టంగా ఉంటుంది. బ్రిటన్‌లో కూడా ప్రతినిధుల సభ (కామన్స్ సభ)కు ఎన్నికలు జరపడానికి నిర్దిష్టమైన తేదీ ఉండాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మన దేశంలో కూడా ఈ విషయంలో ఆలోచించి ఒక నిర్ణయానికి ఎందుకు రాకూడదు?’ అని అద్వానీ ప్రశ్నించారు. అంతేకాదు, ఎన్నికల్లో ధనబలం పాథ్రను తగ్గించడానికి ఎన్నికలకు ప్రభుత్వమే నిధులు అందించాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. (చిత్రం) శుక్రవారం రాజస్తాన్‌లోని చోము ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న అద్వానీ
http://www.andhrabhoomi.net/national/-404
No comments:
Post a Comment