రూ. 327 కోట్ల కాంట్రాక్టులో అన్నీ లొసుగులే
పనులు పూర్తి కాకుండానే టోల్ వసూళ్లు
దర్యాప్తు పేరిట కాలయాపన చేసి కేసు మూసేసిన సీబీఐ
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు జాతీయ రహదార్ల నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనాన్ని ఆంగ్ల వార పత్రిక ‘తెహల్కా’ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ ఏడాది తిరగకుండా కేసును మూసేసిన వైనం పలు అనుమానాలకు తావిస్తోందని అక్టోబర్ 29నాటి సంచికలో ఆ పత్రిక వ్యాఖ్యానించింది. జాతీయ రహదార్ల కుంభకోణం బయటపడితే యూపీఏ ప్రభుత్వంలో మరికొందరి జాతకాలు బయటపడే ప్రమాదం ఉందని గ్రహించడం వల్లే కేంద్రం సీబీఐ నోరునొక్కేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తనకు లోపాయికారీగా సహకరిస్తున్న తెలుగుదేశంకు పనిలో పనిగా సాయపడటం కోసం నామా కంపెనీపై దర్యాప్తును నీరుగారేలా చేసిందని అంటున్నారు.
నిబంధనలు తోసిరాజని అడ్డగోలు వసూళ్లు
తమిళనాడులోని ఎన్ హెచ్7పై కరూర్ బైపాస్ నుంచి దిండిగల్ వరకూ గల 68 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి, 13 కిలోమీటర్ల కరూర్ బైపాస్‌ను మెరుగుపర్చడానికి 2006 ఏప్రిల్ 20న జాతీయ రహదార్ల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ)తో మధుకాన్‌కు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు రహదార్లనూ నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీఓటీ) ప్రాతిపదికన నిర్మించి 20 ఏళ్లపాటు మధుకాన్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత వాటిని జాతీయ రహదార్ల అథారిటీకి అప్పగిస్తుంది. అంటే, ఈ ప్రాజెక్టు పూర్తయిన తేదీనుంచి 20 ఏళ్లపాటు మధుకాన్‌కు ఆ రహదార్లపై టోల్‌గేట్ వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. 327 కోట్ల రూపాయల ఈ ఒప్పందంలోని నిబంధనలన్నిటినీ మధుకాన్ ఉల్లంఘించింది. నిర్మాణాలు సరిగా పూర్తికాకుండానే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కుమ్మక్కై టోల్ వసూళ్లు ప్రారంభించింది. ఈ వసూళ్లు రోజుకు దాదాపు లక్షన్నర రూపాయలు ఉంటాయని సీబీఐ అంచనా వేసింది.
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లను ఇలా అక్రమ వసూళ్లకు అనుమతించినందుకు, ఆ రహదారిపై ప్రయాణించేవారి ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు చెన్నైలోని ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్. ఎస్. సింఘ్వీని బాధ్యుడిగా గుర్తిస్తూ ఆయనపై కేసు నమోదు చేసింది. సింఘ్వీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్. సింఘ్వీకి స్వయానా సోదరుడని ‘తెహెల్కా’ పత్రిక వివరించింది. సీబీఐ మధుకాన్ కంపెనీపై కూడా కేసులు పెట్టింది. ఈ కేసుతోపాటు మరో నిర్మాణ సంస్థ ఇందూ-నవయుగ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌పై కూడా ఇంకో కేసు నమోదైంది. ఈ కేసులో సైతం సింఘ్వీని బాధ్యుణ్ణి చేసింది. ఇదంతా 2009 నవంబర్ 9న జరిగింది. అయితే, ఆశ్చర్యకరంగా ఏడాది తర్వాత మధుకాన్‌కు సంబంధించిన కేసులో ‘వాస్తవానికి సంబంధించిన లోపం’(మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) ఉందంటూ దాన్ని మూసేసింది. అలాగే..సింఘ్వీ చర్యలో తమకు ‘దురుద్దేశం’ ఏదీ కనబడలేదని, అయితే, కాంట్రాక్టర్‌ను టోల్ వసూళ్లకు అనుమతించడంలో అనవసరమైన తొందర కనబరిచినందున ఆయనపై శాఖాపరంగా ‘తగిన చర్య’ తీసుకోవచ్చని కేసును మూసేస్తూ సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది.
సీబీఐ నివేదికలో లోపాలెన్నో...
మధుకాన్ విషయంలో సింఘ్వీ అడ్డగోలు అనుమతులిచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నా, తమ దర్యాప్తులో అది రుజువు కాలేదని సీబీఐ ‘ముగింపు నివేదిక’లో తెలియజేసింది. అయితే, ఈ ప్రక్రియలో జరిగిన అవకతవకలను సీబీఐ సరిగా పట్టించుకోలేదు. జాతీయ రహదార్ల నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించి, సర్టిఫై చేసే ఎగిస్ బిసియామ్ ఇంటర్నేషనల్ సంస్థ వద్దకు ధ్రువీకరణ కోసం మధుకాన్ వెళ్లినప్పుడు అందుకు ఆ సంస్థ నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతిస్తానని ఆ సంస్థ కన్సల్టెంట్‌గా ఉన్న ఇయాన్ ప్రాగ్నెల్ స్పష్టంచేశారు.
ఇది 2009 ఆగస్టులో జరిగింది. అయితే, అదే సంవత్సరం అక్టోబర్‌లో తన డిప్యూటీ విశ్వనాథరావుకు బాధ్యతలు అప్పగించి ప్రాగ్నెల్ సెలవుపై వెళ్లారు. ఇదే అదునుగా భావించి విశ్వనాథరావు ద్వారా మధుకాన్ ధ్రువీకరణను సంపాదించింది. దాని ప్రాతిపదికగా టోల్ వసూళ్లకు అనుమతి సైతం పొందింది. ఈలోగా సెలవునుంచి తిరిగొచ్చిన ప్రాగ్నెల్ ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను లేనప్పుడు ఇలా ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం విశ్వనాథరావుకు లేదని స్పష్టంచేస్తూ ఎన్‌హెచ్‌ఏఐకి ఘాటుగా లేఖ రాశారు. అసంపూర్ణ నిర్మాణాలపై టోల్ వసూళ్లు చేస్తున్నందుకు మధుకాన్‌పై 5.95 కోట్ల రూపాయల జరిమానా విధించాలని చేసిన సిఫారసుకు సైతం దిక్కులేదు. దర్యాప్తు చేసినప్పుడు వెల్లడైన ఈ అంశాలను సీబీఐ పట్టించుకోలేదు.
దాడుల్లో దొరికినవెన్నో...: దర్యాప్తులో భాగంగా సీబీఐ చెన్నై, ఢిల్లీ, జైపూర్ నగరాల్లోని సింఘ్వీ కార్యాలయాలు, ఇతర గృహాలపై దాడులు చేసింది. అందులో కోటి రూపాయలకు పైగా విలువచేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వివిధ బ్యాంక్‌లకు చెందిన 30 పాస్‌బుక్‌లు, 4.70 లక్షల నగదు, అర కిలో బంగారం, నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో ఉంచుకున్న ఎన్‌హెచ్‌ఏఐ ఫైళ్లు లభ్యమయ్యాయి. సింఘ్వీకి కాంట్రాక్టర్లు బహూకరించిన లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు పెద్ద సంఖ్యలో దొరికాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని కాంట్రాక్టర్ల ఇళ్లలో కూడా దాడులు చేశారు.
కేసును మూసేస్తున్నప్పుడు సీబీఐ ఈ వాస్తవాలన్నిటినీ ఎందుకు విస్మరించిందో అంతుపట్టని అంశం. ఇక మధుకాన్ విషయానికొస్తే.. పనులు నాసిరకంగా చేయడం, వాటిని పూర్తి చేయడంలో అపరిమిత జాప్యం వంటి అంశాలపై దాన్ని ఎన్‌హెచ్‌ఏఐ పలుమార్లు హెచ్చరించిన సందర్భాలున్నాయి. అయినా, ఆ సంస్థను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదో, దానికి ఎందుకు పెనాల్టీలు విధించలేదో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ తప్పించుకోవడమే కాదు..ఏకంగా దొడ్డిదారిన ధ్రువీకరణ తెచ్చుకుని టోల్ వసూళ్లు సైతం ప్రారంభించింది. ఇన్ని వాస్తవాలు ఎదురుగా కనబడుతున్నా దర్యాప్తు పేరుతో ఎంతో సమయం తీసుకున్నాక కూడా కేసును సీబీఐ ఎలా మూసేసిందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
జవాబు దొరకని ప్రశ్నలు
అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నవారిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో చూడటానికి మధుకాన్ కేసే ఉదాహరణ. వాస్తవానికి గత మూడేళ్లలో జాతీయ రహదార్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవకతవకలకు సంబంధించి సీబీఐకి వంద కుపైగా ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు డెవలపర్లు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కుమ్మక్కై వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఈ ఫిర్యాదుల సారాంశం. అయితే, సీబీఐ వీటిల్లో మూడంటే మూడే ఫిర్యాదులు దర్యాప్తునకు అర్హమైనవాటిగా పరిగణించడం గమనార్హం. ఈ మూడింటి లో మధుకాన్‌పై ఉన్న కేసును మూసేస్తూ చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎదుట సీబీఐ ఒక నివేదికను దాఖలు చేసింది.
No comments:
Post a Comment