న్యూఢిల్లీ, నవంబర్ 3: భారత దేశానికి చైనా మంచి మిత్ర దేశమని నమ్మిన అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్న విషయాన్ని విస్మరించవద్దని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి కేంద్రాన్ని హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి చైనా సైనిక దళాలు విపరీతంగా చొచ్చుకువస్తున్న నేపథ్యంలో దేశ భద్రత పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన విలేఖర్లతో అన్నారు. మన ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో చైనా అత్యంత బలీయమైన ప్రత్యర్ధి అని ఆయన చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఇటీవల ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధిచేస్తూ, స్థావరాలను పెంచుకుంటున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ‘చైనా మనకు మంచి మిత్రదేశమని ఒక మంత్రి పదేపదే చెబుతున్నారు. చైనా వ్యక్తిగతంగా ఆయనకే మిత్రదేశమా? లేక భారత్‌కు మిత్రదేశమా? అన్నది తేలాల్సి ఉందని జోషి అన్నారు. దేశ రక్షణకు అణు జలాంతర్గామితో పాటు ఇతర తరహా జలాంతర్గాములను అధిక సంఖ్యలో సమకూర్చుకునేందుకు ప్రభుత్వం తటపటాయిస్తోందని ఆయన చెప్పారు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతున్నాయని, ఇందుకు యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత, అవకతవకలతో కూడిన విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించగల సత్తా యుపిఎ సర్కారుకు లేదని ఆయన అన్నారు. పరిస్థితిని అదుపుచేయటానికి ప్రభుత్వం పరిపాలనాపరంగా తీసుకోవలసిన నిర్ణయాలను తాను తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్‌కు విడిచిపెట్టేస్తోందని విమర్శించారు. అనేక దేశాల్లో డాలర్ విలువ పతనమవుతుంటే మన దేశంలో మాత్రం డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
2జి అవకతవకల్లో చిదంబరం ప్రమేయం
దేశానికి విపరీత నష్టం కలిగించిన 2జి స్ప్రెక్టమ్ లైసెన్సుల కేటాయింపు అవకతవకల్లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను వేలం ద్వారానే కేటాయించాలన్న నిర్ణయానికి చిదంబరం కట్టుబడి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదని ఆర్థిక శాఖ ధృవీకరించిన విషయాన్ని జోషి గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తాజాగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. ప్రణబ్ పంపిన లేఖను ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) అనేక చోట్లు మార్చటం వెనుక ఎదో కనిపించని వ్యూహం ఉండే ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కుంభకోణంపై తన అధ్యక్షతన విచారిస్తున్న పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ త్వరలోనే నివేదికను సభకు అందచేస్తుందని జోషి తెలిపారు.
http://www.andhrabhoomi.net/national/joshi-318
No comments:
Post a Comment