Thursday, November 3, 2011

ఎడ్యూరప్పపై చర్యకు పశ్చాత్తాపం లేదు - బిజెపి సీనియర్ నేత అద్వానీ

పనాజీ, నవంబర్ 2: అవినీతి, అక్రమార్జన కేసుల్తో సంబంధ ఉన్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్పపై పార్టీ తీసుకున్న చర్యల పట్ల ఎటువంటి పశ్చాత్తాపం లేదని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ బుధవారం అన్నారు. ‘అక్కడ పార్టీ అవినీతి కుటుంబం ఉచ్చులో చిక్కుకోడం ఒక సమస్య’ అని ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్‌కె అద్వానీ చేపట్టిన అవినీతి వ్యతిరేక జనచేతన యాత్ర బుధవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘దీనికి పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి అయినా సరే అవినీతిని మాత్రం కఠినంగా అణచాల్సిందే’ అని అన్నారు. ఎడ్యూరప్ప విషయమై పార్టీలో తలెత్తిన విభేదాలు గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. దక్షిణాదిన తొలి బిజెపి ముఖ్యమంత్రి ఎడ్యూరప్పపై కర్నాటక లోకాయుక్త అవినీతి, ఆశ్రీత పక్షపాతం వంటి నేరాలు ఆరోపించినప్పుడు ఆయనను రాజీనామా చేయాల్సిందిగా బిజెపి పార్టీ కోరింది. ‘లోకాయుక్త నివేదిక అందిన రెండు మూడు గంటల్లోనే ఆయనపై చర్యకు నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు.

గోవాలో అక్రమ గనుల వ్యవహారంపై ప్రశ్నించగా, ఈ విషయాన్ని కూడా పార్టీ చిన్న అంశంగా పరిగణించడం లేదని చెప్పారు. ‘గనుల అక్రమతవ్వకాలు చిన్న విషయం కాదు. దీని వల్ల న్యాయంగా గనుల తవ్వకాలు చేపట్టే కంపెనీలు కూడా దెబ్బతింటాయి. అందుకే అటువంటి వ్యవహారానికి అడ్డుకట్టవేసేందుకు పార్టీ సహచరులు గట్టిగా కృషి చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు.

‘ప్రధాని కాక ముందు సింగ్ అంటే గౌరవం ఉండేది’

కాగా, ప్రధాని కాక ముందు తనకు మన్మోహన్ సింగ్ అంటే గౌరవం ఉండేదని ఎల్‌కె అద్వానీ బుధవారం వ్యాఖ్యానించారు. మన్మోహన్‌సింగ్‌ను విమర్శించే ఏ అవకాశాన్నీ వదులుకోని అద్వానీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘ప్రధాన మంత్రి కాక ముందు ఆయనంటే గౌరవం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆయన ఏదో చేస్తారన్న అంచనాలు పెద్దగా లేవు’ అని అన్నారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా సింగ్ చాలా సమర్ధవంతంగా పనిచేశారని ఆయన చెప్పారు.

మొదట్లో తాను సింగ్‌ను బలహీనమైన ప్రధాన మంత్రి అని పిలిస్తే ప్రజలు అభ్యంతరం తెలిపేవారని కానీ ఇప్పుడు ఆయన ఒక బలహీన ప్రధాని అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు’ అని అద్వానీ అన్నారు. తాను విమర్శించేటప్పుడు కఠినమైన పదాలను వాడతానని ప్రధాన మంత్రి అంటున్నారని కానీ ‘ఆయన ఒక బలహీనమైన ప్రధాని’ అని అనడం కఠిన పదం కాదని ఆయన అన్నారు. ‘ప్రభుత్వం చాలా విషయాలు గోప్యంగా ఉంచుతోంది. దేశంలోని కుంభకోణాలన్నింటిలో సీనియర్ల పాత్ర గురించి దర్యాప్తు జరగాలి’ అని ఆయన అన్నారు.

http://www.andhrabhoomi.net/international/wrer-093

No comments:

Post a Comment