ప్రధాని, సోనియా జాతికి క్షమాపణ చెప్పాలి
భోపాల్, నవంబర్ 18; ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించి బిజెపి నేతలను అన్యాయంగా జైలు పాలు చేసినందుకు ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ డిమాండ్ చేసారు. ఒక రోజు పర్యటనకోసం శుక్రవారం నగరానికి వచ్చిన గడ్కారీ విలేఖరులతో మాట్లాడుతూ 2008 జూలైలో విశ్వాస ప్రకటన ఓటింగ్ సమయంలో యుపిఏ ప్రభుత్వాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎంపీలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రధానికి మచ్చలేని వ్యక్తి అన్న ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండా, అనుమతి లేకుండా తమ పార్టీ వాళ్లను జైలుకు పంపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ మాజీ వ్యక్తిగత సహాయకుడు సుధీంద్ర కుల్కర్ణి గత 30 ఏళ్లుగా తనకు తెలుసునని, అలాంటి వ్యక్తి తప్పుపని చేస్తాడని ఊహించలేమని గడ్కారీ అన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో అన్యాయంగా కొంతమందిని ఇరికించడంపై ఢిల్లీ హైకోర్టు చాలా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, తమ పార్టీ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా లేవనెత్తుతుందని చెప్పారు. 2008 జూలై 22న యుపిఏ ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాసప్రకటన ఓటింగ్‌ను ఎదుర్కొన్న సమయంలో కొంతమంది బిజెపి ఎంపీలు సభలో నోట్ల కట్టలను చూపిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం కోసం తమకు ఆ డబ్బు ఇచ్చినట్లు చెప్పడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపి తరఫున ప్రచారం చేస్తారా అని విలేఖరులు అడగ్గా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తామని గడ్కారీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ యుపి ముఖ్యమంత్రి మాయావతి చేసిన ప్రకటన ‘రాజకీయ గిమ్మిక్కు’ మాత్రమేనని, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని ఆమెకు బాగా తెలుసునని ఆయన చెప్పారు. ఏది ఏమయినప్పటికీ కొత్త రాష్ట్రాలు ముఖ్యమంత్రుల ప్రకటనలతో ఏర్పడవని, రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌కు నివేదించడం ద్వారా మాత్రమే ఏర్పడుతాయని ఆయన అన్నారు. తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదని బిజెపి సాధారణ కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా గడ్కారీ చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గంనుంచి కూడా తాను పోటీ చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు. తాను నాగపూర్‌కు చెందిన వాడినని, ఒక వేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే అక్కడినుంచో లేదా విదర్భ ప్రాంతానికి చెందిన భండారానుంచో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేసారు. ప్రధానమంత్రి కావాలనుకునే వారంతా కూడా లోక్‌సభకు ఎన్నిక కావడం ద్వారా మాత్రమే రావాలని తాను గతంలో అన్న మాట నిజమేనని కూడా ఆయన అంగీకరించారు.
http://www.andhrabhoomi.net/national/pr-427
No comments:
Post a Comment