కాంగ్రెస్‌పై నమ్మకం పోయంది చాప్టర్ 8 ప్రజాస్వామ్యానికే మచ్చ ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు.. రాష్ట్రం ఏర్పడితేనే సమస్యల పరిష్కారం తెలంగాణ పోరు సభలో సుష్మాస్వరాజ్
నల్లగొండ, నవంబర్ 5: బిజెపి సారథ్యంలో కేంద్రంలో అధికారం చేపట్టబోయే
ఎన్డీయే కూటమి ప్రత్యేక తెలంగాణ ఇచ్చితీరుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత
సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు. నల్లగొండలో శనివారం నిర్వహించిన బిజెపి
తెలంగాణ పోరు సభలో ఆమె మాట్లాడారు.
వేలాది మంది ప్రజలు, తెలంగాణవాదులు, ఉద్యోగులు, న్యాయవాదులు తరలివచ్చిన పోరుసభలో ముఖ్య
అతిధిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం
లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ పేరిట తెలంగాణకు వ్యతిరేకంగా రూపొందించిన
నివేదికే అందుకు నిదర్శనమన్నారు. వాస్తవానికి అది శ్రీకృష్ణ నివేదిక కాదని,
ఏఐసిసి నివేదికని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో అనేక నివేదికలు చూసిన
తాను, ప్రజాస్యామ్యానికే మచ్చ తెచ్చే రీతిలో తెలంగాణ ఉద్యమ అణిచివేతకు
పార్టీల ప్రజాప్రతినిధులను, మీడియాను ప్రలోభ పెట్టాలంటూ ఇచ్చిన శ్రీకృష్ణ
కమిటీ ఇచ్చిన 8వ చాప్టర్ రహస్య నివేదిక చూసి దిగ్భ్రాంతి చెందానన్నారు.
తెలంగాణ ఉద్యమ అణిచివేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు
చేసిన, కేసులు అరెస్టులు కొనసాగించినా తెలంగాణ సాధించేదాకా ప్రజలు
ఉద్యమాన్ని ఆపబోరన్న సంగతి శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం కాలంలో
జరిగిన ప్రజా ఉద్యమాలు స్పష్టం చేశాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో
వందేమాతరం నినాదం మాదిరిగా నేడు జై తెలంగాణ నినాదం ప్రజలకు
ఉత్తేజాన్ని, ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తుందన్నారు. తెలంగాణ సాధనకు
సాగుతున్న ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలిచివేశాయని, కాంగ్రెస్
పాలకులు మాత్రం బలిదానాలు పట్టనట్లుగా వ్యవహరించడం అమానుషంగా
ఉందన్నారు. తెలంగాణ కోసం ఎవరు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, ప్రత్యేక
తెలంగాణ చూసేందుకైనా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ప్రజల
మధ్య ఎలాంటి విద్వేషాలు లేకుండా బిజెపి గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు
చేసిందని, రాష్ట్ర విభజన సరైంది కాకపోతే ఆ రాష్ట్రాల్లో బిజెపిని ప్రజలు ఎందుకు
గెలిపిస్తారని ప్రశ్నించారు. ప్రగతిపథంలో ఆ రాష్ట్రాలు ఎలా ముందంజలో
ఉన్నాయని సుష్మ నిలదీశారు. అభివృద్ధి సమతుల్యత, అసమానతల
నిర్మూలనకు చిన్నరాష్ట్రాలు ఉపకరిస్తాయన్న విషయం మూడు రాష్ట్రాల
ఏర్పాటుతో రుజువైందన్నారు. 2004లో రాష్టప్రతి ప్రసంగంలో పెట్టి,
2009ఎన్నికల్లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని, డిసెంబర్ 9న ప్రకటన చేసిన తర్వాత
కాంగ్రెస్ మరియు తెలుగుదేశం నేడు మాటమార్చి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయన్నారు.
తెలంగాణ ఏర్పాటైతే నల్లగొండ జిల్లా ప్రజలు ఎదుర్కొనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి
కృష్ణ జలాలు అందించే శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తవుతాయని, దేశంలోనే ప్రఖ్యాతి
పొందిన జిల్లా పత్తి, మిర్చి, వరి రైతులకు పూర్వ వైభవం వస్తుందన్నారు.
తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడం సమంజసం కాదంటూ ఫజల్ అలీ
కమిషన్ ఆనాడే చెప్పగా, ప్రధానీ నెహ్రు నిజామాబాద్ సభలో తుంటరి
అబ్బాయికి, అమాయక తెలంగాణ అడపిల్లతో వివాహాంగా పోల్చి విడాకుల
మార్గాన్ని ఆనాడే బలపరిచారని సుష్మ గుర్తుచేశారు. ముల్కీ, ఆరుసూత్రాలు,
పెద్ద మనుషుల ఒప్పందం, 610జీవో, గిర్గ్లానీ కమిషన్లన్ని
ఉల్లంఘించబడటంతో ఇక ప్రత్యేక రాష్ట్రంతోనే తమకు న్యాయం జరుగుతుందని
తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తెలంగాణ
సాయుధ పోరాటాన్ని సాగించిన నల్లగొండ గడ్డపై నుంచి తాను తెలంగాణ
ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇస్తున్నానని, రానున్న శీతకాల సమావేశాల్లో
పార్లమెంటులో బిల్లు కోసం ప్రయత్నిస్తామని లేని పక్షంలో ఎన్డీయే
అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో తెలంగాణ ఇస్తామని
ప్రకటించారు. సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, జాతీయ
కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రులు
విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ, టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహ్మరెడ్డి,
తెలంగాణ నగారా సమితి కన్వీనర్ నాగం జనార్ధన్‌రెడ్డి, జెఎసి చైర్మన్
కోదండరాం, న్యూ డెమోక్రసీ నేత సూర్యం, ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్,
ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు.
(చిత్రం) బిజెపి తెలంగాణ పోరు సభలో ప్రసంగిస్తున్న సుష్మాస్వరాజ్. సభకు
హాజరైన జనం.
http://www.andhrabhoomi.net/state/sushma-swaraj-760
No comments:
Post a Comment