Monday, November 21, 2011

ఓటుకు నోటు కుంభకోణంలో అమాయకుల్ని జైలుకు పంపారు

సోనియా, మన్మోహన్ జాతికి క్షమాపణ చెప్పాలి బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఓటుకు నోటు కుంభకోణాన్ని బయటపెట్టిన తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను జైలుకు పంపినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ 38 రోజుల పాటు నిర్వహించిన జన చేతన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడి రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీలు అమాయకులని, వారిని తప్పుడు ఆరోపణలపై జైలుకు పంపినట్లు ఇప్పుడు ధ్రువపడిందని అన్నారు. ఈ ముగ్గురు జైలుకు వెళ్లడానికి యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు.

‘మీకు పెద్ద మనసు ఉంటే, వెంటనే మీరు జాతికి క్షమాపణ చెప్పాలి’ అని గడ్కరీ డిమాండ్ చేశారు. ముగ్గురు బిజెపి నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అవినీతికి పాల్పడినా చర్య తీసుకోని కాంగ్రెస్ నాయకత్వం, యుపిఎ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. విదేశాల్లో నల్ల ధనాన్ని కూడబెట్టిన వారి పేర్లు వెల్లడించడానికి కేంద్రం ఎందుకు సిగ్గుపడుతోందని ఆయన నిలదీశారు.

http://www.andhrabhoomi.net/national/o-019

No comments:

Post a Comment