Sunday, November 6, 2011

రాజకీయ వర్గాలకూ చేరువైన నల్లధనం - స్విస్ బ్యాంక్ అకౌంట్ల వార్తలపై అద్వానీ


ముంబయి, నవంబర్ 5: స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నల్లధనం దాచుకున్న 700 మంది పైచిలుకు భారతీయుల్లో ముగ్గురు ఎంపీల పేర్లు కూడా ఉన్నాయన్న వార్తలు నిజమైన పక్షంలో నల్లధనం సమస్య రాజకీయ వ్యవస్థకు కూడా చేరువైనట్లేనని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. ‘ఆ వార్తలే గనుక నిజమైన పక్షంలో నల్లధనం సమస్య రాజకీయ వ్యవస్థకు కూడా చేరువయినట్లే. ఈ సమస్యను కేవలం పన్ను ఎగవేతగానే చూడరాదు’ అని అద్వానీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

కాగా, మీడియా వార్తలపై ఈ నెల 1న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) స్పందిస్తూ, నల్లధనం కేసుల దర్యాప్తుకు సంబంధించి ఏ ఎంపీకి కూడా సమన్లు జారీ చేయలేదని, పత్రికల్లో వచ్చిన సమాచారం సరయినదికాదని, అందువల్ల వాటిని ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

విదేశాల్లో నిధులు దాచుకున్న వారి బండారాన్ని బట్టబయలు చేయాలని కేంద్రం నిజంగా ఆసక్తితో ఉందా అని అడగ్గా, దేశానికి చెందిన నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం ఒక శే్వతపత్రం విడుదల చేయాలని తాను మొదటినుంచీ డిమాండ్ చేస్తున్నట్లు అద్వానీ చెప్పారు. విదేశీ బ్యాంకు అకౌంట్లలో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడంలో అమెరికా, జర్మనీ, ప్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలే కాకుండా ఫిలిప్పీన్స్, పెరూ, నైజీరియా లాంటి చిన్న దేశాలు కూడా అనేక చర్యలు తీసుకుని విజయవంతమైనాయని ఆయన చెప్తూ, ‘యుపిఏ ప్రభుత్వం అదే పని చేయడానికి ఎందుకు సిద్ధంగా లేదు?’ అని ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నల్లధనంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని ఆయన అంటూ, ప్రభుత్వం గనుక ఆ సమావేశాల్లో నల్లధనంపై ఒక స్థారుూ నివేదికను సమర్పిస్తే బాగుంటుందని అన్నారు. జెనీవాలోని ఓ బహుళ జాతి బ్యాంకులో 700 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వంనుంచి సమాచారం అందడంతో ఆ దాయం పన్ను విభాగం దీనిపై దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.

యుపిఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగానే నల్లధనం సమస్యపై చర్యలు తీసుకుంటుందని
ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని అద్వానీ ఆయనకు గుర్తు చేస్తూ, భారత ప్రభుత్వం గనుక రాజకీయ దృఢచిత్తాన్ని ప్రదర్శిస్తే ఈ విషయంలో సహకరించడానికి స్విస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కొద్ది నెలల క్రితం మన దేశంలో స్విస్ రాయబారి కూడా చెప్పారన్నారు. కాగా, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పపై వచ్చిన అవినీతి కేసుల గురించి అడగ్గా, ‘ఈ విషయంపై నా వైఖరి గురించి ఇదివరకే వివరంగా చెప్పాను. మళ్లీ, మళ్లీ అదే విషయాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు’ అని అద్వానీ చెప్పారు. (చిత్రం) పుణె సమీపంలోని తలసారిలో శనివారం జరిగిన బహిరంగ సభలో సంప్రదాయ వాద్య పరికరం పుంగీని వాయిస్తున్న బిజెపి అగ్రనేత అద్వానీ.

http://www.andhrabhoomi.net/national/black-money-795

No comments:

Post a Comment