మన దేశంలో అపర కుబేరులకు కొదవ లేదు. ఆబాపతు ఘనుల సంఖ్య లక్షకు దాటింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు భారత్‌లో నల్లకుబేరుల సంఖ్యా పెరుగుతోందన్నది విస్మయం కలిగిస్తోంది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లడబ్బులో అత్యధిక శాతం భారతీయులదే. నల్లధనంలో మనవాళ్లు అభివృద్ధి చెందిన దేశాలను మించిపోయారు. ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలో దేశ సంపద విదేశాలకు తరలిపోయిందని చదువుకున్నాం. ఇప్పుడు ఆ పనిని మనవాళ్లే యథేచ్ఛగా చేసేస్తున్నారు. అధికారులు, నేతలు, వ్యాపారవేత్తలు అక్రమార్జనను గుట్టుచప్పుడు కాకుండా విదేశాల్లో జమ చేస్తున్నారు. కాంట్రాక్టులు, అధికార దుర్వినియోగాలతో ఆర్జించిన మొత్తాన్ని ఇలా తరలించేస్తున్నారు. పన్నులు చెల్లించకుండా దాచిపెట్టిన సొమ్మును ఏయేటికాయేడు మూటగట్టేస్తున్నారు. దేశ ఖజానాకు గండి కొడుతున్నారు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న స్కాములలో కోట్లాది రూపాయలు గల్లంతయ్యాయి. సరళీకరణ పేరుతో నిబంధనలకు నీళ్లొదిలి గేట్లు బార్లా తెరవడంతో విదేశీ బ్యాంకులు నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అసలు ఈ బ్యాంకుల్లో భారత్‌కు చెందిన వారి ఖాతాల కింద ఎంత డబ్బుందో ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ఇదీ నల్లధనం వెలికితీతపై మన ఏలికలకు ఉన్న చిత్తశుద్ధి. 45 కోట్ల బీదలు కనీస అవసరాలకు నోచక విలవిల్లాడుతున్న భారతం ఒకవైపు.. దేశాన్ని కొల్లగొట్టి లక్షలాది కోట్లు విదేశాల్లో దాచేస్తున్న నల్లకుబేరులు ఒక వైపు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాదా..? మొన్న స్విస్, ఇప్పుడు హెచ్‌ఎస్‌బిసి రేపు మరొక బ్యాంకులో.. ఇలా నల్లధనం అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతోంది.
సర్కారు ఖజానాకు సంపన్నుల పన్ను ఎగవేత ఓ సవాలుగా మారుతోంది. నల్లధనాన్ని దాచిపెడుతున్న బ్యాంకుల పనిపట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఆయా బ్యాంకుల నుంచి ఈ మేరకు సమాచారం తెప్పించుకునేందుకు కృషి చేయాలి. ఇందు కోసం స్విట్జర్లాండ్, తదితర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందానికి చొరవ చూపాలి. దాదాపు 90 దేశాలతో స్విస్ ప్రభుత్వం ఈ మధ్యనే ఇటువంటి ఒప్పందం చేసుకుంది. నల్లకుబేరుల సమాచారాన్ని వెల్లడించేందుకు ఆ దేశ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. ఇది అసాధ్యమేమీ కాదు. తమ దేశానికి చెందిన నాలుగు వేల పైచిలుకు రహస్య ఖాతాల వివరాలను బహిర్గతం చేసేందుకు స్విస్ ప్రభుత్వంతో అమెరికా ఈ మధ్యనే ఒప్పందం చేసుకుంది. ఈ విషయంలో అమెరికా ఆదర్శంగా నిలిచింది. కానీ, నల్లధనం వెనక్కి రప్పించడం మన దేశంలో ఒక రాజకీయ నినాదంలా మారిపోయింది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వీలైనప్పుడల్లా నల్లధనం అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ అందజేసిన 700 పైచిలుకు హెచ్‌ఎస్‌బిసి ఖాతాల విషయంలోనూ రానున్న శీతాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షం నానాయాగి చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే యుపిఏ సర్కారు కూడా ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు తమరేమి చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. నల్లధనం ఒక రాజకీయ అస్త్రంగా మారింది. అవినీతిపై దేశ ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి అన్నా హజారే ఉద్యమానికి వచ్చిన స్పందనే నిదర్శనం. అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని గ్రహించి అవినీతి అంతమే లక్ష్యమని రాష్టప్రతి ప్రతిభా పాటిల్, అదే తక్షణ కర్తవ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల జరిగిన గవర్నర్ల సదస్సులో ఉద్ఘాటించారు కూడా. దేశ ఆర్థిక స్వరూపానే్న మార్చేయగల నల్లధనం వెలికితీతపై ఏలికలు ఇప్పటికైనా శ్రద్ధ చూపాలి. కేవలం జాబితాల విడుదల, వాటిపై విచారణ అంటూ కాలయాపన తగదు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని పోగేసిన బడాబాబుల వివరాలపై గోప్యత లేకుండా పారదర్శకంగా వ్యవహరించాల్సిన సమయమిదే. నల్లధనాన్ని దేశానికి రప్పించేందుకు తక్షణం నడుం బిగించాలి. ఖాతా జాబితాలను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలను ఆయా దేశాలపై ఒత్తిడి తెచ్చి అయినా చేసుకోవాలి. తమ్ముడు తన వాడైనా.. అన్న రీతిలో స్వపక్షీయులైనా నల్లకుబేరులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అవినీతికి చరమ గీతం పాడగలం. నాన్చుడు ధోరణితో కాలం వెల్లదీయాలని చూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్న సత్యాన్ని ఏలికలు గ్రహించాలి. నల్లకుబేరుల ఆటలు కట్టించాలి.
http://www.andhrabhoomi.net/sampaadakeeyam/wer-031
No comments:
Post a Comment