న్యూఢిల్లీ, నవంబర్ 17: తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొందేందుకు వీలుగా లోక్‌సభలో చర్చకు అనుమతించాలని స్పీకర్ మీరా కుమార్‌ను సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ కోరారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాలం సమావేశాలలో చర్చకు అనుమతించాల్సిందిగా తాను స్పీకర్‌ను కోరినట్లు ఆమె తెలిపారు. 193 నిబంధనకు లోబడి ఈ చర్చకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరామని ఆమె తెలిపారు. శీతకాల సమావేశాలలో చర్చించవలసిన వివిధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్పీకర్ లాంఛనంగా గురువారం ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తరువాత సుష్మా స్వరాజ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో నెలకొన్న పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని, అక్కడి ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తమ పార్టీ పూర్తిమద్దతునిస్తుందని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరారావు కూడా తెలంగాణపై చర్చకకు అనుమతి ఇవ్వవలసిందిగా స్పీకర్‌ను కోరారని సుష్మా స్వరాజ్ తెలిపారు. సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజున ధరల పెరుగుదలను అరికట్టటంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించటానికి వీలుగా వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెడటానికి అనుమతి కోరుతామని ఆమె చెప్పారు. ఎనిమిది కీలక అంశాలపై చర్చించడంతో పాటు నాలుగు ముఖ్య అంశాలపై సావధాన తీర్మానాలను తమ పార్టీ ప్రవేశపెడుతుందని సుష్మా స్వరాజ్ వివరించారు.
ధరల పెరుగుదల, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి తెప్పించడం, దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారిని గుర్తించే ఆర్థిక స్థితి గతులు, జమ్మూకాశ్మీర్‌పై మధ్యవర్తులు అందచేసిన నివేదిక వంటి అంశాలను ప్రస్తావిస్తామన్నారు. అదే విధంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో భారత్, పాక్ సంబంధాలపై చర్చించటానికి అనుమతి కోరామని సుష్మా స్వరాజ్ తెలిపారు.
ధరల నియంత్రణకు సంబంధించి గత సమావేశాలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటంలో ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ నియంత్రణపై ప్రభుత్వం చేతులేత్తిసిందని ధ్వజమెత్తారు. రైతాంగానికి విపరీత నష్టం కలిగించే తీరులో జరుగుతున్న భూసేకరణను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే తీరులో సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అవినీతిని అదుపు చేసేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లు ఈ సమావేశాలలో సభ ముందుకు వస్తుందని ఆమె చెప్పారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలను సోమవారం జరిగే తమ ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో ఖరారు చేస్తామని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వామపక్షాలతో సహా అన్ని పార్టీలను కూడకడతామని తెలిపారు.
(చిత్రం: స్పీకర్ మీరా కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ లాలూ ప్రసాద్ యాదవ్‌తో ముచ్చటిస్తూ బయటకు వస్తున్న సుష్మా స్వరాజ్)
http://www.andhrabhoomi.net/national/v-062
No comments:
Post a Comment