నల్లగొండ, న్యూస్‌లైన్‌ప్రతినిధి : ‘తెలంగాణ ఉద్యమంలో నల్లగొండకు ఎంతో చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో జిల్లా పాత్ర మరువలేనిది. ఒకప్పుడు ఇక్కడి రైతాంగానికి దేశంలోనే పేరుంది. కానీ ఇప్పుడు కూలీలుగా మారారు. జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీరు తాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ బాధ లన్నీ తీరుతాయి. కృష్ణా నీటిని ఫ్లోరైడ్ ప్రాంతాలకు మళ్లిస్తాం’ అని తెలంగాణ పోరు సభలో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో శనివారం బీజేపీ న ల్లగొండలో నిర్వహించిన తెలంగాణ పోరు సభ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని పదే పదే గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారం చేపట్టాక కేవలం 3 నెలల వ్యవధిలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా మోసపూరితంగా వ్యవహరించిందో, శ్రీకృష్ణకమిటీలో రహస్య నివేదికైన 8వ చాప్టర్‌ను ఎలా అమలు చేస్తుందో వివరించారు.
తెలంగాణ కోసం యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ఏర్పాటు కానున్న రాష్ట్రాన్ని చూసేందుకు బతికి ఉండాలని కోరారు. పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని, ఇంత మంది ఉద్యమ నాయకులను ఒకే వేదికపై చూస్తుంటే, తెలంగాణ వచ్చి తీరుతుందన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి ఆటకం అనడంలో అర్ధం లేదన్నారు. తన సొంత రాష్ట్రం హర్యానలో బీజేపీ ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఈ సారి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. ఈ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే, బీజేపీ తప్పక మద్దతు తెలుపుతుందన్నారు.
పలువురి మద్దతు
పలువురు బీజేపీ నాయకులు, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, న్యూడెమొక్రసీ పార్టీల నేతలతో పాటు పొలిటికల్ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీఎన్‌జీవోస్ నేతలు బహిరంగ సభలో పాల్గొని మద్దతు తెలిపారు. సుష్మాస్వరాజ్ ప్రసంగానికి ముందు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన పూజారులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదం అందించారు. తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారిలను సుష్మాస్వరాజ్‌కు ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఆత్మబలిదానం చేసుకున్న యువకుని తల్లిదండ్రులని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వివరించగానే ఆమె లేచి నిలబడి వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో తెలంగాణ పోరు సభా వేదిక నిండుగా కనిపించింది. దాదాపు నాయకులందరికీ ప్రసంగించే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్‌జీవోల నేత స్వామిగౌడ్, బీజేపీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఎమ్మెలే నాగం జనార్దన్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకుడు సూర్యం, తెలంగాణవిద్యావంతుల వేదిక నుంచి మల్లేపల్లి లక్ష్మయ్య, నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, తదితరలు బహిరంగ సభలో ప్రసంగించారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=261779&subcatid=8&Categoryid=3 |
No comments:
Post a Comment