Thursday, October 20, 2011

2012 నాటికి తెలంగాణ

2012 నాటికి తెలంగాణ

కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం * భారతమాతనే దేశ ప్రజలకు పవిత్ర ఆరాధ్యదైవం * అవినీతిని నిర్మూలిస్తేనే ప్రగతి సాధ్యమని వెల్లడి * హైదరాబాద్ సభలో అద్వానీ

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ ప్రదేశ్ పేరిట కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు పార్లమెంటులో ఏ క్షణం బిల్లు పెట్టినా మద్దతు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని, 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ కల సాకారమవుతుందన్న ఆశాభావాన్ని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ వ్యక్తం చేశారు. జై భారత్‌మాతా, జై తెలంగాణ అంటూ ఆయన నినాదాలు చేసి జనాన్ని ఉత్సాహపరిచారు. అవినీతి నిర్మూలనకు చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా బుధవారం రాత్రి అద్వానీ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అద్వానీ ప్రసంగించారు.

తెలంగాణ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం అవసరం లేదని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని అద్వాని అన్నారు. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనకు ప్రజలు శాంతియుతంగా సమ్మె చేశారని, అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చివరికి ఒక యువకుడు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నా, యుపిఏ ప్రభుత్వానికి కనువిప్పు కలుగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇక ఏమాత్రం మీన మేషాలు లెక్కపెట్టకుండా వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలన్నారు. తాము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామంటే ఆంధ్రకు వ్యతిరేకం కానే కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ అంశాన్ని ఎన్నాళ్లని నానబెడతారని ప్రశ్నించారు. విపక్షాలు కూడా బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఎన్నాళ్లని మంతనాలు చేస్తారని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, భారతమాత అన్ని సంస్కృతులు, జాతులను కలిపి ఉంచే పవిత్ర ఆరాధ్యదైవమన్నారు. ఈ విషయాన్ని స్వామి వివేకానంద స్వాతంత్య్రం వచ్చే నాటికి ముందే చెప్పారన్నారు. భారతదేశ ప్రజల్లో ధార్మిక భావనలు ఎక్కువని, అందుకే ఈ దేశం సుసంపన్నమైనదన్నారు. అవినీతిని పారద్రోలి, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తెచ్చి దేశంలో దారిద్య్రాన్ని నిర్మూలించాలన్నారు. అవినీతి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దేశంలో జాతీయ భావనలు పెంపొందాలన్నారు.

బిజెపి సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ముహూర్తాలు పెట్టుకుని జాతకాలు చూసినట్లుగా కేంద్రం తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత మంతనాలు జరపడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతే సుఖంగా ఉంటాయన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే బిజెపి వల్ల మతతత్వం పెరుగుతుందంటూ మజ్లిస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బిజెపి విస్తరిస్తే తమ కోరలు ఎక్కడ పీకుతుందోననే భయంతోనే మజ్లిస్ పార్టీ తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నేతలు రవి ప్రసాద్, బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావు తదితరులు ప్రసంగించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.

http://www.andhrabhoomi.net/national/trtr-648

No comments:

Post a Comment