Friday, October 21, 2011

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమే - ఎటువంటి రాజీలేదని చైనాకు తెలిపాం: అద్వానీ

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమే

ఎటువంటి రాజీలేదని చైనాకు తెలిపాం: అద్వానీ


ఈటానగర్, అక్టోబర్ 20: అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమేనని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ప్రసక్తే ఉండదని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ పునరుద్ఘాటించారు. అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చేతన యాత్రలో భాగంగా గురువారం అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో పర్యటించిన ఆయన నహర్లాగున్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో కొంత భూభాగం తమదని చైనా పేర్కొంటున్నప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమేనని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉందని అద్వానీ స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ఇటీవల న్యూఢిల్లీలో పర్యటించిన చైనా అధ్యక్షుడు హు జింటావోకు తెలియజేసినట్టు ఆయన చెప్పారు.
కుంభకోణాలు దేశ ప్రతిష్ఠకు మాయని మచ్చ


యుపిఎ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు పాలక కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోలేకపోతుండటంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అద్వానీ ధ్వజమెత్తారు. కామనె్వల్త్ క్రీడల కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం, ముంబయిలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం వంటి ఎనిమిది భారీ కుంభకోణాలు అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చాయని అద్వానీ పేర్కొన్నారు. సంకీర్ణ రాజకీయాలను సాకుగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ అవినీతిని అంతమొందించేందుకు చర్యలు చేపట్టకుండా చేష్టలుడిగి చూస్తోందని, దీంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, ఇది సామాన్య మానవునికి శాపంలా పరిణమించిందని అన్నారు.


ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలు స్విస్ బ్యాంకులో అక్రమంగా ఆస్తులను దాచిన తమ తమ దేశీయుల వివరాలను వెల్లడించాల్సిందిగా స్విట్జర్లాండ్‌పై వత్తిడి తెచ్చాయని, దీని ఫలితంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం 2009లో వారి వివరాలను వెల్లడించిందని అద్వానీ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచిన 25 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆ దేశంపై వత్తిడి తీసుకురాలసిందిగా స్వయంగా తానే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు మొదటి లేఖను రాసినట్టు అద్వానీ చెప్పారు. అయితే ఈ విషయమై యుపిఎ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


దేశంలో 6000 గ్రామాలు తాగునీరు, రోడ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు వంటి వౌలిక వసతులు లేక అల్లాడుతున్నాయని, స్విట్జర్లాండ్‌లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురాగలిగితే అనతికాలంలోనే నూతన భారత దేశాన్ని నిర్మించవచ్చని అద్వానీ పేర్కొన్నారు. 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్‌లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తామని చెప్పారు.

 Source : http://www.andhrabhoomi.net/national/advani-931

No comments:

Post a Comment