యాత్ర మార్గంలో పైప్ బాంబు లభ్యం
నిర్వీర్యం చేసిన పోలీసులు
మదురై మీనాక్షిని దర్శించుకున్న అద్వానీ
చెన్నై, న్యూస్‌లైన్: జనచేతన యాత్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన యాత్ర సాగే మార్గంలో శక్తిమంతమైన పైప్ బాంబును పోలీసులు కనుగొని నిర్వీర్యం చేశారు. అద్వానీ యాత్రలో భాగంగా గురువారం మదురైకి వచ్చారు. అక్కడి నుంచి తిరుమంగళం రోడ్డులో కేరళకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్గంలోనే ఆలంపట్టి గ్రామం ఉంది. అక్కడికి సమీపంలోని ఓ బ్రిడ్జి కింద డిటోనేటర్లు, వైర్లు ఉన్నట్టు గుర్తించిన కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాంబును పేల్చేందుకు అమర్చిన బ్యాటరీలను తొలగించారు. అనంతరం పేలుడు పదార్థాల నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేసింది. ఐదు డిటోనేటర్లను కలిపి ప్యాక్ చేసి...బ్యాటరీలకు అనుసంధానం చేశారని పోలీసులు తెలిపారు. బాంబు చాలా శక్తిమంతమైనదని, పేలినట్లయితే బ్రిడ్జి మొత్తం కూలిపోయి ఉండేద న్నారు.
ఈ చర్య వెనుక నక్సలైట్ల హస్తముందని భావిస్తున్నట్టు చెప్పారు. అద్వానీ యాత్ర వాహనాలు బ్రిడ్జిపైకి వచ్చే సమయానికి బాంబును పేల్చాలని వారు ప్రయత్నించినట్టు తెలిపారు. ఈ వ ్యవహారానికి సంబంధించి నెహ్రూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. అద్వానీపై బాంబు దాడికి యత్నించడం తమిళనాడులో ఇది రెండోసారి. 1998 ఫిబ్రవరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ రాష్ట్రానికి వచ్చినపుడు కోయంబత్తూరులో ముస్లిం తీవ్రవాదులు బాంబులను అమర్చారు. ఇదిలా ఉండగా, యాత్ర బయల్దేరేముందు అద్వానీ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మీనాక్షి, సుందరేశ్వరర్ స్వామివారిని దర్శించుకున్న అద్వానీ ప్రార్థనలు జరిపారు. అర్చకులు ఆలయంలోని ప్రాకారాల విశిష్టతను ఆయనకు తెలియజేశారు. మరోవైపు, అద్వానీ యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ ఢిల్లీలో స్పష్టం చేశారు. కేంద్ర ం, రాష్ట్రాల్లోని భద్రత సంస్థలపై తమకు పూర్తి విశ్వాసముందన్నారు.
అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతలపైనా దర్యాప్తు జరపాలి: అద్వానీ
‘పలు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సొంత పార్టీ మంత్రులను దర్యాప్తు నుంచి జాగ్రత్తగా తప్పిస్తోంది’ అంటూ బీజేపీ అగ్రనేత అద్వానీ ధ్వజమెత్తారు. స్కాముల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రమేయంపైనా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జన చేతన యాత్రలో భాగంగా శుక్రవారం తమిళనాడులోని మదురైలో అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్లలో చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. చాలా మంది మంత్రులు పదవులు పోగొట్టుకుని, జైలు పాలయ్యారు. అయితే, అలా ఊచలులెక్కిస్తున్న వారంతా యూపీఏ మిత్రపక్షమైన డీఎంకే నాయకులే. కాంగ్రెస్ మంత్రులు మాత్రం తప్పించుకున్నారు.
తమ కళ్లెదుటే జరుగుతున్న అవినీతిని అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా అవినీతిపరులుగానే భావించి శిక్షించాలి. కానీ ఇందుకు ఆ పార్టీ సుతరామూ అంగీకరించడం లేదు’ అని దుయ్యబట్టారు. మరోవైపు, ఓటుకు నోటు కుంభకోణాన్ని బయటపెట్టిన తమ పార్టీ నేతలను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ అద్వానీ మండిపడ్డారు. తన మాజీ సహచరుడు సుధీంద్ర కులకర్ణిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించగా.. తమ పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించేది లేదని, యడ్యూరప్పపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తమిళ జాలర్లపై శ్రీలంక నేవీ దాడుల్ని జాతీయ సమస్యగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
అణు విధానాన్ని పునఃసమీక్షించాలి: దేశ అణు విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అద్వానీ డిమాండ్ చేశారు. వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ప్రజాభద్రతను పణంగా పెట్టరాదన్నారు. అణు ప్లాంట్లను ముఖ్యంగా సముద్ర తీరాల్లో ఉన్న వాటిపై పునఃసమీక్ష జరపాలని చెప్పారు.
కోర్టు నిర్ణయాల్లో జోక్యం తగదు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు, పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్ష పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న డిమాండ్లపై అద్వానీ స్పందించారు. రాజకీయ పరమైన కారణాలతో కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదన్నారు. క్రూరమైన నేరం కిందకు రాని, ఇతరులు రెచ్చగొట్టడం వల్లే నేరానికి పాల్పడ్డ కేసులను మాత్రమే క్షమాభిక్ష కోసం పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=256753&Categoryid=1&subCatId=32 |
No comments:
Post a Comment