Thursday, October 6, 2011

రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన - నిద్రావస్థలో పాలనా వ్యవస్థ

ముందెన్నడూ లేని విధంగా  రాష్ట్రంలో పాలన స్తంభించింది. అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన మంత్రులు ప్రాంతాల వారీగా విడిపోయే వాళ్ళకు వాళ్ళే గిరిగీసుకున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు సమన్వయము లోపించింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ముక్కలు చెక్కలైంది. ప్రజా ప్రతినిధుల పరిస్థితి 'ఎవరికి వారె యమునా తీరే' అన్నట్లుగా ఉంది. 

 సచివాలయంలో గాని, పాలకుల్లో గాని, అభివృద్ధికి సంబంధించిన అంశాలేవీ చర్చకు రావడం లేదు. అసలు అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజా ప్రతినిధులే  కరువయ్యారు. కనీసం మంత్రులందరూ ఒక చోటికి చేరి సమావేశమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రాంతీయ విభేదాలతో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఒకరి చరిత్ర మరొకరు తవ్వి తీస్తున్నారు. 

రెండు నెలలకు పైగా కేబినేట్ మీటింగ్ జరగలేదంటే... పాలన ఏ విధంగా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మంత్రులే ముఖ్యమంత్రికి డిమాండ్ల చిట్టాలు, సవాళ్ళ పట్టాలు విసురుతున్నారు. సచివాలయానికి రాబోమని తెగేసి చెప్పారు. చివరకు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సిఎం క్యాంప్ ఆఫీస్ లో  'కేబినేట్ మీటింగ్' ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సచివాలయంలో కేబినేట్ మీటింగ్ పెడితే తెలంగాణా ప్రాంతానికి  చెందిన మంత్రులు హాజరు కారనే భయమే సిఎం ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది.  


కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ కింద చేసిన ఓ ప్రకటన పర్యవసానమే ఇప్పుడున్న పరిస్థితి. కనీసం రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవడం అందరినీ ఆలోచింప చేస్తోంది.  కానీ అక్కడ కేంద్రం కూడా అవినీతి ఆరోపణల ఊబిలో కురుకుని పోయి, తనను తాను కాపాడుకొనేందుకే సకల ఉపాయాలూ వెతుకుతోంది. సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన సర్కారును పట్టించుకునేందుకు కేంద్రానికి కూడా సమయం దొరకడం లేదు.


- హంసిని

No comments:

Post a Comment