Saturday, October 29, 2011

యుపి అసెంబ్లీకి ముందస్తు పొత్తులు లేవు - గడ్కారీ

నాగపూర్, అక్టోబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీకి ముందస్తుగా ఎటువంటి పొత్తులు లేవని, తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ శుక్రవారం అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు’ అని ఆయన విలేఖరులకు చెప్పారు. 403 సభ్యులు గల అసెంబ్లీలో ఇప్పుడున్న 48 స్థానాలతో పాటు మొత్తం 200 పైగా సీట్లను బిజెపి గెలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగపూర్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. తాను పోటీ చేసే విషయంపై తుది నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు సమావేశం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రశ్నించగా ఆయన ‘నాగపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆసక్తిగా ఉంది’ అని అన్నారు. 1985లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పశ్చిమ నాగపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా భండార, వార్దా లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, ఓటర్లు తనను పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారని ఆయన తెలిపారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావిస్తూ, జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ.రాజాకు ఎంత బాధ్యత ఉందో, మాజీ ఆర్థిక మంత్ర పి.చిదంబరానికి అంతే బాధ్యత ఉందని గడ్కారీ అన్నారు.

http://www.andhrabhoomi.net/national/pre-poll-alliance-795

No comments:

Post a Comment