Friday, October 7, 2011

అవినీతిని అంతం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

 Jan Chetna Yatra to counter  Corruption

 

గడిచిన కొన్ని నెలలుగా "అవినీతి"కి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి గురైన కేంద్రప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితులలో చిక్కుకొంది. అవినీతిని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహానికి సిద్ధమైన అన్నాహజారెను ఆగస్టు 16 న నిర్బంధించి తిహార్ జైలుకు పంపింది.అవినీతిని అంతం చేయటానికి గాని, భవిష్యత్తులో అవినీతిని అరికట్టేందుకు ఏమి చేద్దాం అని ఆలోచించకుండా 76  సంవత్సరాలు వయసు పైబడిన పెద్ద మనిషిని నిర్బంధించింది. తదుపరి దేశ ప్రజల ఆగ్రహానికి గురియై అన్నాను విడిచిపెట్టడమే కాకుండా 15  రోజుల పాటు దీక్షకు అనుమతినిచ్చింది. 

అన్నాహజారే తీహారు జైలు నుండి బయటకు వచ్చి వేలాదిమంది అనుయాయులతో రామలీలా మైదానంలో వారం రోజులుగా దీక్షలో ఉన్నారు. 6 కిలోల బరువు తగ్గారని డాక్టర్లు చెపుతున్నారు. కేంద్రం ఈ సమస్యల నుండి బయటపడటానికి దారులను వెతుకుతున్నది. ఆగస్టు 22 న పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. 24 వ తేదీ అన్ని పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఏ విషయం నిర్ణయం కాలేదు. అన్నాహజారే దీక్ష విరమించాలని మాత్రం అన్ని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం జనలోకపాల్ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపినట్లుగా ప్రకటించింది. అన్నాహజారే బృందంతో జరిగిన చర్చలలో హజారే ప్రతిపాదించిన మూడు అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చించేందుకు అంగీకరించింది. రేపు (26 ఆగస్ట్) పార్లమెంటులో హజారే ప్రతిపాదించిన మూడు ప్రతిపాదనలపై పార్లమెంటులో చర్చ ప్రారంభమవుతుంది. పార్లమెంటులో చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అన్నాహజారే తాను చేసిన ప్రయత్నంలో తొలివిజయం సాధించినట్లే.

పెరుగుతున్న అవినీతిపై ప్రజాగ్రహం 
 
ఈ మధ్య ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అవినీతి స్కాములు చూసి ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉందా? లేక రాక్షస పాలనా ఉన్నదా? నీతిమాలిన రాజకీయ నాయకులూ, వారి అండదండలతో స్వైరవిహారం చేస్తున్న నేరగాళ్లు దేశాన్ని బాహాటంగా దోచుకొంటున్నారు. అచేతనమైన న్యాయవ్యవస్థ పుణ్యాన దేశాన్ని దోచుకొంటూ స్వేచ్చగా తిరగగలుగుతున్నారు. రాజకీయ నాయకులూ - నేరగాళ్ల అక్రమ సంబంధాల కారణంగా దేశంలో పెరుగుతున్న అవినీతిపై భారతదేశంలోని ప్రజలు విసిగిపోయారు. కుళ్ళిపోయిన ఈ అవినీతి వ్యవస్థను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. క్రమంగా రాజుకొంటున్న ఈ ఆందోళనను భగ్నం చేయాలని కేంద్రం తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నది. ప్రజా ఉద్యమాలను అణచటంలో  కాంగ్రెస్ ది అందే వేసిన చేయి. ప్రలోభ పెట్టో, దమన నీతితోనో అన్ని ఉద్యమాలను అణచగలనని కాంగ్రెస్ అనుకొంటున్నది. ఇది ఎల్లకాలం సాగదు.
 

రాందేవ్ బాబా ప్రారంభించిన నిరాహార దీక్షను రాత్రికి రాత్రే భగ్నం చేసింది. ఒక శత్రువుపై దాడి చేసినట్లు వ్యవహరించింది. అట్లా అన్నాహజారే దీక్షను భగ్నం చేయవచ్చు అనుకొన్నది. అన్నాహజారేను నిర్బంధించి జైలులో పెడదామని అనుకొన్నది. కాని అది బెడిసికొట్టింది. అన్నాహజారేతో చర్చలకు తెర తీసింది. లోకపాల్ బిల్లుపై చర్చించేందుకు సిద్ధపడుతున్నది. 

అసలు లోకపాల్ బిల్ ఆలోచన అన్నాహజారేకు వచ్చిన ఆలోచన కాదు. స్వాతంత్ర్యం సిద్ధించిన తోలి రోజులలోనే ఈ ఆలోచన వచ్చింది. 1962 వ సంవత్సరంలో జరిగిన అఖిల భారత న్యాయ మహాసభలో దీనిపై చర్చలు జరిగాయి. 1962 లో చైనా యుద్ధం రాకపోతే న్యాయ మహాసభ చేసిన సూచనలపై పార్లమెంటులో చర్చ జరిగేది. ఆనాటి అటార్నీ జనరల్ గా ఉన్న ఎం.పి.సెతల్వాద్ అధ్యక్షతన చర్చలు జరిగాయి. రాజకీయ అధికార స్థాయిలో అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవటానికి అంబుడ్స్ మన్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ తదుపరి కాలంలో దీనిపై అంతగా చర్చ జరగలేదు.

రాజకీయ వ్యవస్థపై అవినీతి ఆరోపణలు ఈ రోజున క్రొత్త కాదు. నెహ్రూ కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. 1948 లో జీపుల కుంభకోణం, 1950 ముద్గల్ కేసు, 1961 లో సైకిళ్ళ కుంభకోణం, 1960 లో రేడియోల కుంభకోణం, ధర్మతేజ రుణ కుంభకోణం వంటివి వెలుగులోకి వచ్చాయి. ఆ తదుపరి జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం. ఇలా అనేక సందర్భాలలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి 2 జి స్కాం కుంభకోణంపై ప్రజలలో చాల తీవ్రంగా చర్చ జరుగుతోంది. స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకొన్న వారి వివరాలు బయట పడుతున్నాయి. ఆ ధనాన్ని బయటకు తేవాలనే ఆలోచన ప్రజలలో తీవ్రంగా వచ్చింది. అందుకే అన్నాహజారే ప్రతిపాదించిన జనలోకపాల్ బిల్ గురించి చర్చ జరుగుతోంది. దానిని చట్టంగా చేసేందుకు ప్రారంభమైన ఉద్యమానికి ప్రజల మద్దతు ఉన్నది. ఈ నేపథ్యంలో అన్నాహజారే ఉద్యమం శక్తివంతమై ప్రభుత్వాన్ని కదిలించింది. పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చకు ముందు న్యాయ నిపుణులు, ప్రజలలో చర్చకు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ బాధ్యతను నిర్వహించటానికి బదులు ఉద్యమాన్ని ఎట్లా బలహీన పరచాలి అనే విషయానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ దేశంలో వాతావరణాన్ని ఉద్రిక్తం చేస్తున్నది. మళ్ళీ ఎమర్జెన్సీ రోజులను తలపింప చేస్తున్నది. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ఏదో విదేశీ కుట్ర జరుగుతోందని ప్రకటించడం చూస్తుంటే "ఇందిరా గాంధీ" ఎమర్జెన్సీకి ముందు మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం ఆగ్రహిస్తున్న ప్రజాశక్తిని తక్కువగా అంచనా వేసినట్లుగా కనపడుతున్నది. ప్రభుత్వ ధోరణి ఇట్లాగే కొనసాగితే ఇప్పటికే అపఖ్యాతి పాలైన ప్రభుత్వం తన పతనాన్ని తానే కొనితెచ్చుకొన్నట్లవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం "అవినీతిని అంతం చేయటానికి మేము నిబద్ధతతో ఉన్నాము" అని ప్రకటించి ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాలి. లేకపోతె ఇది ఇంతటితో ఆగదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.


Source : http://www.lokahitham.net/2011/09/blog-post_08.html

No comments:

Post a Comment