కేంద్రానికి అద్వానీ ప్రశ్న
మదురై/న్యూఢిల్లీ:
తమిళనాడులోని కూడంకుళంలో తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదోనంటూ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కూడంకుళంలో ప్రజల భద్రతపైనే ప్రాథమికంగా ఆందోళన నెలకొన్నప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. గురువారం మదురైలో జన చేతన యాత్రను తిరిగి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జపాన్‌లో ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత చాలా దేశాలు తమ తీరప్రాంతాల్లోని అణుకేంద్రాలను భద్రతాపరంగా పునరుద్ధరించాయన్నారు. వాణిజ్యపరమైన అంశాలు అవసరమే కానీ, వాటికోసం ప్రజల భద్రతను విస్మరించరాదని అన్నారు. అదేవిధంగా గత 40-50 ఏళ్లుగా రూ. 25 లక్షల దోపిడీ జరిగిందని, ఆ డబ్బంతా విదేశాలకు తరలిందని ఆరోపించారు. అమెరికా, జర్మనీలాంటి దేశాలు నల్లధనాన్ని వెనక్కి తెప్పించుకునేందుకు కృషిచేస్తుండగా, భారత్ మాత్రం చర్యలు తీసుకోవటం లేదన్నారు. జాలర్లపై విదేశీ నావికాదళం దాడిని సహించరాదని, ఈ విషయంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జన చేతన యాత్రలో భాగంగా అద్వానీ శుక్రవారం కేరళలోని కాల్లామ్ జిల్లాకు చేరుకోనున్నారు. తర్వాత ఆదివారం విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నారు.
యాత్ర నా కోసం కాదు.. దేశం కోసమే
తన సొంతలాభం కోసం జనచేతన యూత్ర చేపట్టారన్న విమర్శలను అద్వానీ కొట్టిపారేశారు. ‘నన్ను మళ్లీ కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది. ఈ యాత్ర అద్వానీ కోసం చేపట్టింది ఎంతమాత్రం కాదు. అలాగే ఇది బీజేపీ కోసమో లేదా వచ్చే ఎన్నికల కోసమో కాదు. ఇది పూర్తిగా భారత్ కోసమే’ అని అద్వానీ యాత్ర కు ముందు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ ప్రధాని పదవి రేసులో నిలిచేందుకే యాత్ర చేపట్టినట్లు అద్వానీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
No comments:
Post a Comment