Friday, October 21, 2011

కాంగ్రెస్‌కు శాశ్వత సెలవే... - ప్రస్తుత ముఖ్యమంత్రిని సాగనంపండి బీజేపీ నేత వెంకయ్యనాయుడు ధ్వజం



హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రైతులు సర్కారు విధానాలతో విసుగెత్తి క్రాప్ హాలిడేకు దిగారు. అధికారులు పరిపాలనా విరామాన్ని ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చేయడం మానేశారు. మంత్రులు సచివాలయాన్ని మరిచారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశాల్ని మరిచిపోయారు. ఉద్యోగులు సకల జనుల సమ్మెలో ఉన్నారు. సీఎం తన చాంబర్‌కే పరిమితమై అంతా బాగుందనుకుంటున్నారు. ఇలా అందరూ అన్ని పనులకు విరామమిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి శాశ్వత సెలవు ప్రకటించాలన్న నిర్ణయానికొస్తున్నారు’ అని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

రెండు రోజులు జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారమిక్కడ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ.. ఏ సమస్యా పరిష్కరించని ప్రస్తుత ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని సాగనంపడమే ఉత్తమమన్నారు. తెలంగాణపై పార్టీ వైఖరిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, తాము కోరేది ప్రాంతాల మధ్య చీలికే గాని ప్రజల మధ్య కాదన్నారు. కలిసుండి కలహించుకునే కన్నా విడిపోయి సుఖంగా ఉంటే మంచిదని చెప్పారు. సమైక్య రాష్ట్రాన్ని ఏ పార్టీ కోరుకోవడం లేదన్నారు. హింస, ప్రాంతీయ విద్వేషం, అవహేళన వంటివి చోటుచేసుకున్నప్పుడు పార్టీ ఖండించాలని కోరారు.

మమ్మల్ని విమర్శించే అర్హత లేదు...

బాన్సువాడలో అభ్యర్థిని నిలపని టీడీపీ తమనెలా విమర్శిస్తుందని వెంకయ్య ప్రశ్నించారు. ‘తెలంగాణపై తీర్మానం చేసింది మీరు.. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చింది మీరు.. టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసింది మీరు.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మీరు.. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకుని మా పార్టీపై నిందలెలా వేస్తారు..?’ అని ఆయన టీడీపీ తీరును విమర్శించారు. ఇదే సందర్భంలో ఆయన పీసీసీ అధ్యక్షుణ్ణీ ఎండగట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేసిన విషయాన్ని మరుగుపరిచి తమను ఎలా తప్పుబడతారని నిలదీశారు. కమ్యూనిస్టులతో సహా ఎవ్వరికీ తమను విమర్శించే అర్హతే లేదన్నారు. మజ్లిస్‌కు భయపడి బీజేపీని విమర్శిస్తే అర్థంలేదన్నారు. ఎంఐఎంను ఎదుర్కోగల సత్తా తమకే ఉందన్నారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీని కింది నుంచి పైవరకు పటిష్టం చేయాలని కోరారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన యాత్రను విజయవంతం చేసినందుకు అద్వానీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ఏ క్షణాన్నైనా రావచ్చని వెంకయ్య అభిప్రాయపడ్డారు. అన్నిచోట్ల తగిన ప్రాతినిధ్యం కోసం పని చేయాలని కోరారు.
Source : http://www.sakshi.com/main/FullStory.aspx?catid=253013&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment