Tuesday, October 25, 2011

సర్కారులో నంబర్ 2 ఎవరు? - బీజేపీ అగ్ర నేత అద్వానీ

ఇప్పటివరకు యూపీఏ ప్రభుత్వంలో నంబర్ 1 ఎవరన్నదే ప్రశ్న
తాను లేనప్పుడు ప్రభుత్వాన్ని చూసుకోవాలని చిదంబరం, ప్రణబ్‌లను ప్రధాని ఆదేశించారు
దాంతో రెండో ప్రశ్న తలెత్తింది
2జీ స్కామ్ నుంచి చిదంబరాన్ని తప్పించాలనుకుంటున్నారా?

 
సంబల్‌పూర్(ఒడిశా): తన పరోక్షంలో ప్రభుత్వ వ్యవహారాలను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేదా హోం మంత్రి చిదంబరం పర్యవేక్షించాలంటూ ప్రధాని మన్మోహన్ జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో ఇప్పటివరకూ నంబర్ 1 ఎవరన్న ప్రశ్నే ఉండేది. ప్రధాని ఆదేశాలతో నంబర్ 2 ఎవరన్న మరో ప్రశ్న తెరపైకి వచ్చింది’ అని అద్వానీ అన్నారు. జన చేతన యాత్రలో భాగంగా సోమవారమిక్కడ అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ నాయకుడన్న వాస్తవాన్ని విస్మరించి.. ప్రధాని తన ఆదేశం ద్వారా హోం మంత్రిని, ఆర్థిక మంత్రిని ఒకే గాటన కట్టారని విమర్శించారు. లోక్‌సభకు ఇద్దరు నాయకులు ఉండరన్నారు.

‘యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి ఓ సందేహం ఉంది. సర్కారుకు సంబంధించి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల్లో ఎవరు నంబర్ 1 అన్నదే ఆ ప్రశ్న. ఇప్పుడు నంబర్ 2పైనా సందేహం తలెత్తింది. మొదటి ప్రశ్న సమాధానంపై ఎవరికీ పెద్దగా సందేహాలక్కర్లేదు. కానీ ఈ రెండో ప్రశ్న మాత్రం అందరి మెదళ్లనూ తొలుస్తోంది’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రధాని ఇద్దరు మంత్రుల్ని ఉప ప్రధానులుగా నియమిస్తే నియమించుకోవచ్చు గానీ, ఇలా ఇద్దరు మంత్రుల్ని మాత్రం నంబర్ 2గా ప్రకటించలేరని అన్నారు. 2జీ స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తును తప్పించడమే ప్రధాని ఆదేశం వెనక ఉన్న ఉద్దేశమా అని ప్రశ్నించారు. కేబినెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రధానే తీసుకుంటారని పేర్కొంటూ మంత్రులకు ఆదేశం పంపారని, అయితే దానర్థం ఆ నిర్ణయాలకు 10 జన్‌పథ్(సోనియా నివాసం) అనుమతి అక్కర్లేదని కాదని అద్వానీ అన్నారు. వచ్చే నెలలో తాను మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నానని, ఆ సమయంలో రాజకీయ వ్యవహారల కేబినెట్ కమిటీ భేటీలకు ప్రణబ్, చిదంబరంలలో ఎవరో ఒకరు హాజరవ్వాలని ప్రధాని ఆదివారం ఆదేశించడం విదితమే.


కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష


కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, తద్వారా రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందని అద్వానీ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోందని, ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవలి జాతీయ అభివృద్ధి మండలి భేటీలో కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కేంద్రాన్ని కడిగిపారేశారని అన్నారు. ఈ పోరాటంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలన్నీ ఒక్కటవుతాయన్న ఆశాభావాన్ని అద్వానీ వ్యక్తం చేశారు.


బెంగళూరు యాత్రకు సకల ఏర్పాట్లు


బెంగళూరు: అద్వానీ ఈ నెల 30న బెంగళూరులో చేపట్టనున్న జన చేతన యాత్ర కోసం స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర వివరాలను ప్రజలకు అందించేందుకు సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అలాగే, పార్టీ కార్యక్రమాల గురించే తెలిపే ఈ-న్యూస్ లెటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఒక రాజకీయ పార్టీ ఇంటర్నెట్‌లో ఇలాంటి వాటిని ప్రారంభించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

No comments:

Post a Comment