Sunday, October 30, 2011

దేశ ప్రతిష్ఠను మంటగలిపిన యుపిఏ - కేరళ జన చేతన యాత్రలో అద్వానీ ధ్వజం



కొట్టార్కర (కేరళ), అక్టోబర్ 29: అవినీతికి పాల్పడ్డం, అవినీతిపరులను కాపాడ్డం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం ఈ దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య ప్రతిష్ఠను అపవిత్రం చేసిందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ దుయ్యబట్టారు.

అవినీతిని ఖండించడమే కాకుండా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకుని వచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి తేవడం తన యాత్ర ముఖ్య ఉద్దేశమని జన చేతన యాత్రలో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అద్వానీ అన్నారు. పార్లమెంటులో ఓటుకు నోటు కుంభకోణాన్ని తమ సహచరులు బైటపెట్టిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారిని అభినందించి, రక్షణ కల్పించడానికి బదులు ప్రభుత్వం వారిని జైల్లో పెట్టిందని ఆయన అంటూ, ఇది జరిగిన తర్వాతే తాను ఈ యాత్రను చేపట్టాలనుకున్నానని చెప్పారు. పార్లమెంటులో మెజారిటీని సంపాదించడం కోసం ఎంపిలకు లంచాలు ఇవ్వడం ద్వారా యుపిఏ ఈ దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య ప్రతిష్ఠను మంటగలిపిందని అద్వానీ దుయ్యబట్టారు.

గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తమ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిందని అంటూ, తాము చేపట్టిన ఉద్యమం కారణంగా ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తుకు అంగీకరించిందని చెప్పారు. మిత్రపక్షాలను బలిపశువులుగా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ కుంభకోణానికి బాధ్యులయిన తమ పార్టీ వారిని మాత్రం వదిలిపెడుతోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలపై తమకేమీ సానుభూతి లేదని, అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరినీ శిక్షించి తీరాల్సిందేనని అద్వానీ అంటూ, ‘కుంభకోణానికి మీరుకూడా బాధ్యులైనప్పుడు మిత్రపక్షాల వారిని మాత్రమే ఎందుకు బలిపశువులను చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. నల్లధనం గురించి మాట్లాడుతూ, స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్న మొత్తం 25 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని భారత్‌కు తీసుకు వస్తే దేశంలోని మొత్తం ఆరులక్షల గ్రామాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. 200 ఏళ్ల పాలనలో బ్రిటీష్ వాళ్లు లక్ష కోట్ల రూపాయలను దోచుకుంటే దేశంలోని అవినీతి శక్తులు అరవై ఏళ్లలోనే 25 లక్షల కోట్లు ఇక్కడినుంచి వేరే దేశాలకు తరలించాయని దుయ్యబట్టారు.

ప్రధానిపై విమర్శలు

అంతకు ముందు తిరువనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అద్వానీ ఒక ఆర్థిక నిపుణుడు ప్రధానిగా ఉన్నప్పటికీ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి పోతూ ఉందంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా అవినీతి విషయానికి వచ్చేసరికి ప్రధాని సంకీర్ణ ధర్మం అని అంటూ తప్పించుకోజూస్తున్నారని అద్వానీ అంటూ, సంకీర్ణ ధర్మం అనేది ఒక విదానం మాత్రమేనని, నిజాయితీకి సంబంధించిన విషయాలకు అది ఏమాత్రం అడ్డు కాదని అన్నారు.

కాగా, కేంద్రంలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అద్వానీ అంటూ సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్నారు. 2014లో కానీ అంతకు ముందు కానీ ఎన్నికలు జరిగినప్పటికీ ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేసారు. కాగా, భవిష్యత్తులో భాగస్వాములను ఎంచుకోవడంలో తమ పార్టీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో ఏవయినా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అద్వానీ తెలియజేసారు.

నేడు కర్నాటకలోకి ప్రవేశం

కాగా, అద్వానీ జన చేతన యాత్ర ఆదివారం కేరళనుంచి దక్షిణాదిలో బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్టమ్రైన కర్నాటకలోకి అడుగుపెట్టనుంది. అద్వానీ యాత్రకు ఘనంగా స్వాగతం పలకడానికి రాష్ట్ర బిజెపి నేతలు  సన్నాహాలు చేసుకుంటున్నారు.
http://www.andhrabhoomi.net/national/mantagalipina-upa-007

No comments:

Post a Comment