Tuesday, October 25, 2011

రాష్ట్రానికి సిఎం ఎవరు? ఆజాద్ జోక్యంపై - బిజెపి అభ్యంతరం

హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి పేరుకు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, గులాం నబీ అజాద్ అన్నింటిలో జోక్యం చేసుకుని ఆయనే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ సోమవారం విలేఖరుల సమావేశంలో ఎద్దేవా చేశారు. టెండర్లు ఖరారుకు గులాం నబీ అజాద్ అంటున్నారని, ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయానికీ ఆయనేనని, మంత్రుల సమావేశానికీ ఆయన పేరే చెబుతున్నారని, టెండర్ల రద్దుకూ ఆయన పేరే ప్రస్తావిస్తున్నారని, శాసనసభ సమావేశాలకూ ఆయన పేరే చెబుతున్నారని ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కిరణ్‌కుమార్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని, డిప్యూటీ సిఎం 12 సార్లు ఢిల్లీకి వెళ్లారని, పిసిసి అధ్యక్షుడు, గవర్నర్ కూడా ఢిల్లీకి వెళుతున్నారని, రాష్ట్ర రాజధాని ఢిల్లీనా? హైదరాబాదా? అనేది అనుమానంగా ఉందని అన్నారు. అసలు మంత్రులకే ముఖ్యమంత్రిపై విశ్వాసం లేకుండా పోయిందని అన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించలేదని, శీతాకాల సమావేశాలకు కనీసం ఏర్పాట్లు కూడా చేయడం లేదని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి శాసనసభా సమావేశాలను నిర్వహించి తీరాలని తాము డిమాండ్ చేసినా, గవర్నర్ స్పందన కొరవడిందని అన్నారు. రాష్ట్రంలో ఇటు దేవాలయాలకు రక్షణ కొరవడిందని, అటు రాజ్యాంగ రక్షణ కూడా గాలికొదిలేశారని పేర్కొన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ఎత్తుకుపోతున్నారని, రాజగోపురాలు కూలుతున్నాయని దేవాలయాలను గవర్నర్ సందర్శిస్తున్నా రక్షణ కొరవడగా, మరో పక్క రాజ్యాంగ పరిరక్షణ కూడా కుప్పకూలిందని పేర్కొన్నారు. సకాలంలో మంత్రివర్గ సమావేశాలను నిర్వహించలేకపోతున్నారని, అస్తవ్యస్థమైన పరిస్థితులను సమన్వయం చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
 

పోలవరం టెండర్లను ముమ్మాటికీ రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు సాకుగా చూపి తప్పించుకోవాలని చూడవద్దని, అక్రమాలకు పాల్పడిన వారికి, బ్లాక్‌లిస్టులో ఉన్న వారికి పనులు అప్పగించారని ప్రభాకర్ అన్నారు. గులాం నబీ అజాద్ , ముఖ్యమంత్రి కలిసి టెండర్లను రాజకీయ టెండర్లుగా మార్చేశారని ఆరోపించారు. తెలంగాణను తాకట్టు పెట్టి జానారెడ్డి మంత్రి అయితే దామోదర్ రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయ్యారని, నేడు డి. శ్రీనివాస్ ఎమ్మెల్సీ అవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం దిగివచ్చేవిధంగా కార్యక్రమాలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తెలంగాణను తాకట్టు పెట్టి పదవులను పొందుతున్నారని, ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను వీరు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

http://www.andhrabhoomi.net/state/azad-pai-vimarsha-138

No comments:

Post a Comment