Monday, October 24, 2011

టీడీపీ వల్లే నాడు ‘తెలంగాణ’ ఆగింది


ఎన్డీయే మిత్రపక్షమొకటి తెలంగాణకు అనుకూలంగా ఉండుంటే తాము అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని అద్వానీ తెలిపారు.


బీజేపీ అగ్రనేత అద్వానీ
ఎన్డీయే హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాం
ఆ పార్టీ అనుకూలంగా ఉండుంటే తెలంగాణ రాష్ట్రమూ ఏర్పడేది

రాయ్‌పూర్:
ఎన్డీయే మిత్రపక్షమొకటి తెలంగాణకు అనుకూలంగా ఉండుంటే తాము అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. నాటి ఎన్డీయే సర్కారులో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని ఉద్దేశించి పరోక్షంగా అలా వ్యాఖ్యానించారు. 
జన చేతన యాత్రలో భాగంగా ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వచ్చిన అద్వానీవిలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రశ్నించగా ‘మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాం. నాడు మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. అప్పట్లో మా మిత్రపక్షమొకటి సుముఖంగా ఉండుంటే నాలుగో కొత్త రాష్ట్రం(తెలంగాణ) కూడా ఏర్పాటు చేసేవాళ్లం’ అని చెప్పారు. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, తమ పార్టీ మద్దతిస్తుందని అద్వానీ వెల్లడించారు.

బెంగళూరుకు వెళ్తా: అద్వానీ


కర్ణాటక రాజధాని బెంగళూరులో జన చేతన యాత్ర ర ద్దయినట్టు వచ్చిన వార్తలను అద్వానీ ఖండించారు. బెంగళూరులో తన యాత్ర యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ నెల 30న బెంగళూరులో అద్వానీ యాత్ర, సభ యథాతథంగా ఉంటాయని పార్టీ రాష్ట్ర విభాగం కూడా తెలిపింది. అవినీతి ఆరోపణలపై పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప జైలుపాలైన నేపథ్యంలోనే బెంగళూరులో యాత్రను రద్దు చేసుకున్నారా అని అద్వానీని ప్రశ్నించగా.. ‘యాత్ర రద్దయినట్టు నాకెలాంటి సమాచారమూ లేదు. యాత్రలో భాగంగా కర్ణాటకకూ, బెంగళూరుకు వెళ్తాను’ అని తెలిపారు. యడ్యూరప్ప వ్యవహారంపై అడిగిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వలేదు. 
ఇదిలాఉండగా, మతహింస నిరోధక బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని 
అద్వానీ స్పష్టం చేశారు. మావోయిస్టులపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. నక్సల్స్ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని, అధికారాన్ని హస్తగతం చేసుకోజూస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

చిదంబరం పాత్రపై దర్యాప్తు జరపాలి..


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపై దర్యాప్తు జరపాలని అద్వానీ డిమాండ్ చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలు మోపడాన్ని స్వాగతిస్తూ.. దర్యాప్తు పరిధి నుంచి కొందరు వ్యక్తులను మినహాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=254277&Categoryid=1&subcatid=32

No comments:

Post a Comment