Friday, October 28, 2011

యూపీఏ పాలనలో కానరాని సమఖ్య స్ఫూర్తి


 by chalasani
- కాంగ్రెసేతర రాష్ట్రాలపై వివక్ష
- పెండింగ్‌లో ఇతర రాష్ట్రాల బిల్లులు
- చట్టాల విషయంలో సంప్రదింపులు శూన్యం
- కేంద్ర పథకాల అమలుకు అందని సహాయం
- రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిని దిగజారుస్తున్న కేంద్రం
- నేరుగా జిల్లాలకే నిధులు!
- హాజరుకాని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు
- అవినీతి ఆరోపణలపై విచారణ పట్లా వివక్ష
ndcదేశంలో అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగినప్పుడు రాజకీయ వ్యతిరేక ఆలోచనా ధోరణులను విడనాడాలని ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య మంత్రులకు ప్రధాన మంత్రి డా మన్మోహన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. సంకుచిత రాజకీయ అజెండాలకు, దీర్ఘ కాలిక జాతీయ ప్రయోజ నాలకు మధ్య సమతుల్యం పాటిం చాలని కోరారు. కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల యూపీఏ ప్రభుత్వం వివక్ష ధోరణులను అవలం బిస్తున్నదంటూ గుజరాత్‌, తమిళ నాడు, పంజాబ్‌ తదితర ముఖ్య మంత్రులు విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి ఇటువంటి వ్యాఖ్య చేశారు.

సంకీర్ణ రాజకీయాలు గత రెండు దశాబ్దాలుగా దేశంలో రాజ్య మేలుతున్న తరుణంలో రాష్ట్రాల అభిప్రాయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నంత కాలం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉండేవి. అయితే యూపీఏ ప్రభుత్వ పాలనా వ్యవహారం మన రాజ్యాంగం లో పొందుపరచిన సమాఖ్య వ్యవస్థ భావనకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణులు అవలంబిస్తున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన గల జాతీయ సలహా మండలి ప్రేరణతో తీసుకొస్తున్న పలు చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం సంప్రదింపులు జరపకుండా రాష్ట్రాలపై అధిక భారం మోపుతున్నది.

రాష్ట్రాల సమస్యల పట్ల ప్రధాన మంత్రి అంతగా ఆసక్తి చూపడం లేదు. యూపీఏ ప్రభుత్వ మనుగడకు అవసరమైన పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ- ఇతర రాష్ట్రాల అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. పలు రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన అనేక బిల్లులను గవర్నర్‌, రాష్టప్రతుల ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నది. ప్రస్తుతం కనీసం పన్నెండు బిల్లులు ఆ విధంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ముఖ్య మంత్రులు ఎన్ని సార్లు విన్నవించుకున్నా, కనీసం ప్రధాన మంత్రి జోక్యం చేసుకొని, ఆయా బిల్లుల స్థాయి గురించి సంబంధిత రాష్ట్రాలకు సమాచారం పంపించడం, అభ్యంతరాలు ఉండే తెలపడం వంటివి జరగడం లేదు.

అసాధారణ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలు కోరినా కేంద్రం నుండి స్పందన ఉండటం లేదు. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఒడిస్సా వంటి రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. ప్రధాన మంత్రి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి బొత్తిగా ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్‌ అధికారం లో ఉన్న రాష్ట్రాలలో సైతం అయన చాలా అరుదుగానే పర్యటిస్తున్నారు. అది వేరే విషయం!
రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా హక్కు, ఆహార భద్రత వంటి బిల్లుల విషయంలో రాష్ట్రాల ఇబ్బందులను అస్సలు పట్టించు కోవడం లేదు.

కనీసం రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బిల్లుల పర్యవసానాల గురించి చర్చలు జరపడానికి సైతం ఆసక్తి చూపడం లేదు. ఈ రెండు బిల్లుల్నీ అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన ఆర్ధిక భారం కానున్నాయి. ఆ భారం ఏ విధంగా భరించాలనే విషయంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శిగా, సలహాదారుడిగా, సహాయకారిగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ చేయడం లేదు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా రాష్ట్రాల అధికారాలను అపహరించడమే అవుతున్నది. కొన్ని పథకాల ద్వారా నేరుగా జిల్లాలకే కేంద్రం నిధులు ఇవ్వడానికి సంకల్పిస్తున్నది. అటువంటి విధానం వల్లన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించ వలసి వస్తుంది. దాంతో రాజ్యాంగంలోని సమాఖ్య భావనకు విఘాతం కలిగించినట్లే కాగలదు. రాష్ట్ర ప్రభుత్వాలను పెద్ద పురపాలక సంఘాల స్థాయికి కేంద్రం దిగజార్చుతున్నదని జాతీయ అభివృద్ధి మండలి సమావేశానికి తాను పంపిన ప్రసంగ పాఠంలో తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత పేర్కొనడం గమనార్హం.

అలాగే మావోయిస్టుల సమస్యను ఎదుర్కొనడానికి సహకారం అందించడంలో కాంగ్రెస్‌ పాలనలో ఉన్న్న రాష్ట్రాల పట్ల ఒక విధానం, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల మరో విధానం అవలంభిస్తున్నారు. 12 వ పంచ వర్ష ప్రణాళిక రూపకల్పనలో ప్రాధాన్యత కల్పించ వలసిన అంశాలపై నిర్ణయించడానికి జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలలో- ఆయా ప్రాధాన్యతల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపించాయి. అటువంటి వైరుధ్యాలను సామరస్యంగా పరిష్కరిస్తామని, రాష్ట్రాల అవసరాల పట్ల సానుకూలంగా స్పందిస్తానని హామీ ఇవ్వడంలో ప్రధాన మంత్రి విఫలమయ్యారు. అయన ఒక ప్రభుత్వ అధికారిగా తన ధోరణిలో తాను పోతున్నారు గానీ, రాష్ట్ర ప్రభుత్వాల సమంజసమైన సమస్యల పట్ల సానుకూల వైఖరి అవలంభించడానికి సిద్ధంగా లేదనేది స్పష్టం అయింది.

అందుకనే ప్రతిపక్షాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం పట్ల ఆసక్తి చూపలేదు. గతంలో తరచు ఢిల్లీ పర్యటనలు జరిపే ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య మంత్రులు ఇప్పుడు చాలా అరుదుగా వెడుతున్నారు. కేంద్రం తమను అసలు పట్టించు కోవడం లేదనే అసంతృప్తి వారిలో వ్యక్తం కావడమే అందుకు ప్రధాన కారణం. దేశాధి నేతగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకు పోవాలనే ప్రయత్నం, కీలకమైన సమస్యలపట్ల ఏకాభిప్రాయం సాధించాలనే కృషి ప్రధానమంత్రి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధిని అడ్డుకొనే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. కేంద్రంలో ఒక మంత్రి ఆయా రాష్ట్రాల పథకాల పట్ల సానుకూలంగా స్పందిస్తారు. మరో ఇద్దరు మంత్రులు విరుద్ధ వైఖరులు అవలంబిస్తారు. హైడల్‌ పవర్‌ పథకం కోసం రాష్ట్రాలు అనుమతి కోరితే విద్యుత్‌ శాఖ మంత్రి ఇస్తారు. కానీ పర్యవరణ శాఖ మంత్రి ఇవ్వరు. అలాగే థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం అనుమతి కోరితే విద్యుత్‌ మంత్రి ఇస్తారు, కాని గనుల శాఖ మంత్రి బొగ్గు నిల్వలను కేటాయించకుండా కాలయాపన చేస్తారు. అటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి అన్ని శాఖల మంత్రులను సమావేశ పరచి, వాటిని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయరు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతలపై పై సీబీఐ దాడులకు, వారిని అరెస్టు చేయించడానికి కేంద్రం అమిత ఆసక్తి చూపుతున్నది. ఢిల్లీ తదితర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ిసీబీఐ పట్టించు కోదు. ఎ. రాజా, కనిమోళి వంటి వారిని సైతం సుప్రీం కోర్డు ఆదేశిస్తేనే అరెస్ట్‌ చేశారు. వారిని కాపాడడానికి ప్రధాన మంత్రి కార్యాలయం రెండు సంవత్సరాల పాటు తంటాలు పడింది. హోమ్‌ మంత్రి పి చిదంబరంతో సహా కొందరు కేంద్ర మంత్రులపై అనేక తీవ్ర అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా వచ్చినా ిసీబీఐ అస్సలు పట్టించుకోదు. సంకీర్ణ రాజకీయాల యుగంలో సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే దేశ సమైక్యతకే ప్రమాదం కాగలదు. ఇది దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తల ఎత్తడానికి దారితీయ గలదని కేంద్ర పాలకులు గ్రహించాలి.

No comments:

Post a Comment