Monday, October 24, 2011

కూలుతున్న గోపురాలు

అయినా స్పందించని ప్రభుత్వం నిపుణుల సిఫార్సులు బుట్టదాఖలు ‘భవనారాయణ’ ఘటన ఊహించిందే పట్టించుకోని అధికారులు శిథిల స్థితిలో మరిన్ని పురాతన ఆలయాలు


హైదరాబాద్, అక్టోబర్ 23: చారిత్రాత్మక దేవాలయాలు నేలపాలవుతున్నాయి. పురాతన ఆలయాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాలూ శిధిలమవుతున్నాయి. చారిత్రాత్మక నిర్మాణ సంపద క్రమంగా మాయమవుతోంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను సర్కారు విస్మరించడంతో, అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి దాపురించింది. శిధిల దశకు చేరిన ఆలయాలను ముందుగానే గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులు, నిపుణుల బృందాలు లిఖిత పూర్వకంగా ఎన్ని సిఫార్సులు చేస్తున్నా, అవి బుట్టదాఖలే అవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బాపట్లలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన భావనారాయణ ఆలయ గాలి గోపురం కుప్పకూలడంతో, చారిత్రాత్మక ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి చర్చకు తావిచ్చింది.
 

గత ఏడాది శ్రీకాశహస్తిలో విజయగోపురం కూలిన సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు, ఆలయ స్తపతులు, దేవాలయాల నిర్మాణాలపై అవగాహన ఉన్న అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా పరిణమించిన ఆలయాలపై అధ్యయనం చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. శిధిల స్థితికి చేరిన ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన సూచనలు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. 

రంగంలోకి దిగిన కమిటీ చారిత్రక ప్రాముఖ్యతవున్న 47 దేవాలయాలను పరిశీలించింది. అందులో శ్రీకాళహస్తి, అమరావతి, సింహాచలం, శ్రీశైలం వంటి ఆలయాలతోపాటు, ప్రస్తుతం కూలిపోయిన భావనారాయణ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, కొన్ని గోపురాలను పునరుద్ధరించాలని సూచించింది. లేనిపక్షంలో అవి కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా దేవాదాయ శాఖకు అందించిన నివేదికలో కమిటీ పేర్కొంది. 

దీనికోసం 30కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు కేటాయిస్తే వెంటనే పునరుద్ధరణ, మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ శాఖనుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. ఇక నిధులు వచ్చాక పనులు ప్రారంభిద్దామని వేచి చూస్తున్న దేవాదాయశాఖకు నిరాస మిగిలింది. 

విజయగోపురం కూలిపోయి ఏడాది దాటినా, ఇతర ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు వెళ్లి ఆరు నెలలు గడచినా ఇప్పటివరకు ఎటువంటి స్పందనా కనిపించలేదు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆలయాల కనీస రక్షణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టలేకపోతోందని అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు. ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి అందిన నివేదికల తాజా పరిస్థితి ఏమిటన్నది కూడా అర్థంగాని వ్యవహారంగానే మిగిలింది.
 

ఇలావుండగా, భావనారాయణ గోపురం కూలిన ఘటనను దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కెవి రమణాచారి వద్ద ప్రస్తావించగా, ఇది బాధాకరమని, పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆలయ గోపురాన్ని పునర్నిర్మించే అంశంపై ఆ శాఖతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. ఇతర ఆలయాల పరిరక్షణపైనా చర్యలు తీసుకుంటామని రమణాచారి వెల్లడించారు. (చిత్రం) కుప్పకూలిన బాపట్ల క్షీర భావనారాయణ స్వామి గాలిగోపురం.

http://www.andhrabhoomi.net/state/gopuram-741

No comments:

Post a Comment