న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) తమ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితంచేసి మిగిలిన ప్రాంతాలను మినహాయించవలసిందిగా జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తున్న డిమాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించరాదని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ తేగేసి చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాన్ని ఏ మాత్రం సడలించినా తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థల విధ్వంసకాండ మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర భవితవ్యాన్ని పణంగా పెట్టటం అభిలషణీయం కాదని జైట్లీ అన్నారు.
గత రెండు దశాబ్దాల నుంచి అగ్నిగుండంలా మండుతున్న జమ్మూ-కాశ్మీర్ సీమాంతర ఉగ్రవాదానికి బలైపోతోంది. తీవ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేయటానికి ప్రభుత్వం కాశ్మీర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి ఈ చట్టాన్ని అమలు చేస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించటంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమయ్యిందన్న నిర్ణయానికి వచ్చినందునే కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దించింది. సైన్యంతో పాటు రాష్ట్ర పోలీసులు, సరిహద్దు దళాలు, కేంద్ర రిజర్వ్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తున్నాయి.
జమ్మూ-కాశ్మీర్‌లో పనిచేస్తున్న సైనిక దళాలకున్న అధికారాలు రాష్ట్ర పోలీసులకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తప్పు చేశాడన్న అభియోగానికి గురైన సైనికులపై చర్య తీసుకునే అధికారం రాష్ట్రానికి లేకపోవటం తప్పించి ఇతర విషయాల్లో రాష్ట్ర పోలీసులకు సైన్యానికి ఎటువంటి తేడా లేదని జైట్లీ చెప్పారు. సైనిక దళానికి చెందిన 2500 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఫిర్యాదులు అందటమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలియజేశారు. తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచివేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం కల్లోల ప్రాంతంగా ఉన్నప్పుడు చట్టం అమలులో మినహాయింపులు కోరటంలో ఔచిత్యం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఏమాత్రం సడలించినా ఇంత కాలంగాపడుతున్న శ్రమ ‘బూడిదలో పోసిన పన్నీరు’ అవుతుందని ఆయన హెచ్చరించారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాక క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని జైట్లీ సూచించారు.
http://www.andhrabhoomi.net/national/special-powers-act-801
No comments:
Post a Comment