Saturday, October 22, 2011

రీకాల్ హక్కుతో శాశ్వత అస్థిరత - హజారే డిమాండ్‌ను వ్యతిరేకించిన అద్వానీ



కోల్‌కతా, అక్టోబర్ 21: చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులను రీకాల్‌చేసే హక్కు ప్రజలకు ఉండాలన్న గాంధేయవాది అన్నా హజారే డిమాండ్‌ను బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ వ్యతిరేకించారు. ఇది దేశంలో శాశ్వత అస్థిరతకు దారితీస్తుందని అద్వానీ పేర్కొన్నారు. ‘ప్రజాప్రతినిధులను రీకాల్‌చేసే హక్కు ప్రజలకు ఉండాలన్న వాదనను నేను వ్యతిరేకిస్తున్నా. భారత్ వంటి అతిపెద్ద దేశంలో ప్రజలకు ఇటువంటి హక్కు ఉంటే అది శాశ్వత అస్థిరతకు దారితీస్తుంది’ అని అద్వానీ అన్నారు. ‘రీకాల్ హక్కు’ దేశాన్ని అస్థిరపరుస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఇసి) ఎస్.వై.ఖురేషీ కూడా ఇటీవల అభిప్రాయపడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కొన్ని చిన్నచిన్న దేశాలు మినహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ‘రీకాల్ హక్కు’ ప్రతిపాదనను అంగీకరించలేదని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్న వాదనను తాను బలంగా సమర్ధిస్తానని, ప్రత్యేకించి ధనబలం అధిక ప్రభావాన్ని చూపుతున్న మన దేశంలో ఇటువంటి సంస్కరణలు రావలసిన అవసరం ఎక్కువగా ఉందని అద్వానీ అన్నారు. 1970లో తాను రాజ్యసభ సభ్యుడిగానూ, మాజీ ప్రధాని ఎ.బి.వాజ్‌పేయి లోక్‌సభ సభ్యుడిగాను ఎన్నికైనప్పుడే ఎన్నికల సంస్కరణల కోసం తమ పార్టీ డిమాండ్ చేసిన విషయాన్ని అద్వానీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కేంద్రం తీరుపై అస్సాం, బెంగాల్ ఆగ్రహం

బంగ్లాదేశ్‌కు తమ భూభాగాన్ని బదిలీ చేయడం పట్ల అస్సామ్, తీస్తా జలాల ఒప్పందం విషయంలో పశ్చిమ బెంగాల్ కేంద్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నాయని అద్వానీ పేర్కొన్నారు. తీస్తా నదీ జలాల పంపకానికి సంబంధించి దొడ్డిదారిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సాగుతున్న ప్రయత్నాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడుతున్నారని, అలాగే అస్సాంలోని భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని సంప్రదించలేదని అద్వానీ తెలిపారు. ‘ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. కానీ అస్సాం భూమి బదలాయింపు విషయంపై ఎటువంటి చర్చా జరపలేదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన మేము టీ తాగి వచ్చేశాం. అంతే తప్ప ప్రభుత్వం ఈ విషయమై మాతో ఎటువంటి సంప్రదింపులూ జరపలేదు’ అని అద్వానీ విలేఖర్లతో అన్నారు. అస్సాం భూమి బదలాయింపు, బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి జరుగుతున్న చొరబాట్ల విషయమై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు అద్వానీ చెప్పారు. (చిత్రం) జనచేతనా యాత్రలో భాగంగా శుక్రవారం రాంచిలో జరిగిన సభలో అభిమానులకు అభివాదం చేస్తున్న బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కూడా చిత్రంలో ఉన్నారు.

Source : http://www.andhrabhoomi.net/national/re-call-021

No comments:

Post a Comment