Friday, October 21, 2011

స్కాములతో దిగజారిన భారత్ ప్రతిష్ట - ఎల్‌కే అద్వానీ

స్కాములతో దిగజారిన భారత్ ప్రతిష్ట
యూపీఏ సర్కారు వరుస కుంభకోణాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట దిగజారుతోందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆవేదన వ్యక్తంచేశారు.


అవినీతి కట్టడిలో కాంగ్రెస్ విఫలం
బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ

ఈటానగర్/గువాహటి: యూపీఏ సర్కారు వరుస కుంభకోణాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట దిగజారుతోందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆవేదన వ్యక్తంచేశారు. అవినీతిని కట్టడి చేసేందుకు అధికార కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశంలో పాలన గాడితప్పుతోందని, అధిక ధరలతో జనం సతమతమవుతున్నారని పేర్కొన్నారు. జనచేతన యాత్రలో భాగంగా గురువారం అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించిన అద్వానీ పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు.

2జీ, కామన్వెల్త్, ఆదర్శ్ సొసైటీ వంటి కుంభకోణాలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను మసకబార్చాయన్నారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు.. స్విట్జర్లాండ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్కడి బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచిపెట్టిన తమ పౌరుల ఖాతాల వివరాల్ని బహిరంగపర్చాయని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 2014లో తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కితెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలతో అభినవ భారతాన్ని నిర్మిస్తామన్నారు. కాగా, గతంలో తాను చేపట్టిన ఐదు యాత్రల కన్నా, జన చేతన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అద్వానీ తెలిపారు.

అలాంటి వ్యక్తిని కాను..

పరుష పదజాలం వాడరాదంటూ ప్రధాని మన్మోహన్ తనకు చేసిన సూచనపై అద్వానీ స్పందించారు. తాను పరుష పదజాలం వాడే వ్యక్తిని కానని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న తన సహచరులను అన్యాయంగా అరెస్టు చేసినప్పుడు, అవినీతిని బయటపెట్టే వారిని జైల్లో పెట్టినప్పుడు మాత్రమే తాను సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతానని స్పష్టం చేశారు.

Courtesy : http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=252654&Categoryid=1&subCatId=32

No comments:

Post a Comment