Friday, October 28, 2011

దేశ ప్రతిష్ఠ కోసమే ‘యాత్ర’ - విమర్శలు అర్థరహితం: అద్వానీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 27: ఎన్నికల కోసమో, పార్టీ కోసమో, లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసమో తాను యాత్ర చేపట్టలేదని, యుపిఏ ప్రభుత్వ వైఫల్యాల వల్ల దెబ్బతిన్న ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించి ఇరవై ఒకటవ శతాబ్దినాటికి దేశం బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి అవసరమైన ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని ప్రజల్లో నింపటమే తన జన చేతనాయాత్ర ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటానికి చేపట్టిన జన చేతనా యాత్రకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఒక రోజు విరామం ఇచ్చి అద్వానీ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన గురువారం తిరిగి యాత్రకు వెళ్లేముందు తన బ్లాగ్‌లో ఇప్పటివరకూ ఎదురైన అనుభవాలతోపాటు భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించారు.

రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్రకు తన రాజకీయ ప్రస్థానంలో మిగతా రథ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న ఆరవ రథయాత్రకు ఎంతో తేడా ఉందని ఆయన చెప్పారు. రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన యాత్ర మతపరమైనది, భక్తిపరమైనది. రామునిపై ప్రజలకున్న భక్త్భివం యాత్ర విజయానికి దోహదపడింది. ఇప్పుడు జరుగుతున్న యాత్ర దేశభక్తికి సంబంధించింది. దైవభక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో దేశభక్తికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అద్వానీ అభిప్రాయపడ్డారు. తన ఇమేజిని పెంచుకోవటానికి లేదా ఏదోరాజకీయ ప్రయోజనాల కోసమో యాత్రను చేయటం లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాలలో దేశం వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మారబోతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే తీరులో జరిగిన సంఘటనలు ప్రజల మనోబలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను తప్పించటానికే తాను యాత్రను చేపట్టినట్లు అద్వానీ తెలియచేశారు. చివరకు పార్టీకి కూడా ఈ యాత్రతో సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

యుపిఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి పెరిగిపోయిన అవినీతి, క్రమం తప్పకుండా వెలుగుచూస్తున్న కుంభకోణాలు దేశ గౌరవ ప్రతిష్టలను మంట కలిపాయి. ఫలితంగా ప్రజలలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిందని అద్వానీ అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మంత్రులు, పార్లమెంట్ సభ్యులు జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన వారిని రక్షించవలసిన ప్రభుత్వం శిక్షిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రజల్లో పెరిగిన అవగాహన, దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న అసహనం తన యాత్రవల్ల మరింత బలం పుంజుకోగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

http://www.andhrabhoomi.net/national/desha-pratistha-kosame-yathra-570

No comments:

Post a Comment