న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో టెలికాం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మందిపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అభియోగాలు మోపిన నేపథ్యంలో ఈ కేసులో అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత హోంమంత్రి చిదంబరంపై కూడా సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండు చేసింది. టెలికాం మాజీ మంత్రి రాజా నేరపూరితమైన కుట్రలో పాలుపంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. తనపై మోపిన అభియోగాలన్నీ అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికీ వర్తిస్తాయని రాజా చెబుతున్నారని ఆమె అన్నారు. చిదంబరం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే ప్రభుత్వమే ఆయనను పదవి నుంచి తొలగించి, ఆయనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి ప్రధాని మన్మోహన్ సింగ్ తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అన్నారు.
ఈ వ్యవహారంలో రాజాను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని, ప్రధాని చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కేసును కాంగ్రెస్ అవినీతి కేసులతో పోల్చడం తగదని ఒక ప్రశ్నకు బదులుగా అన్నారు. కాగా, నిందితులపై కోర్టు అభియోగాలు మోపడాన్ని జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యం స్వామి స్వాగతించారు. ఆరు నెలల్లోనే నిందితుల్లో కొందరు దోషులుగా తేలే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
No comments:
Post a Comment