Saturday, October 29, 2011

అద్వానీకి తప్పిన ముప్పు - రథయాత్ర దారిలో బాంబులు.. మదురైలో కలకలం

మదురై, అక్టోబర్ 28: బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్రకు శుక్రవారం తృటిలో ముప్పుతప్పింది. తమిళనాడులోని మదురై సమీపాన వంతెన కింద అమర్చిన పైపు బాంబును స్థానికుడు అందించిన సమాచారంతో పోలీసులు నిర్వీర్యం చేయడంతో, అద్వానీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మదురైకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని తిరుమంగళం సమీపాన అలంపట్టి వద్ద సంఘటన చోటుచేసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా ప్రస్తుతం జన చేతన యాత్ర నిర్వహిస్తున్న అద్వానీ, మధురైనుంచి బయలుదేరి విరుధునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూర్ చేరుకునేందుకు వంతెన మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆయన చివరి నిమిషంలో తన ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మరోమార్గం గుండా శ్రీవిల్లిపుత్తూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన కేరళ రాష్ట్ర సరిహద్దు సమీపాన ఉన్న షెన్‌కొట్టా ప్రాంతానికి చేరాల్సిన తరుణంలో పోలీసులు ఈ బాంబును నిర్వీర్యం చేశారు. అలంపట్టి వద్ద వంతెన కింద ఆరు అడుగుల పొడవుగల పివిసి పైపులో పేలుడు పదార్థాలను కూర్చి దీన్ని వైరుద్వారా సుమారు అర కిలోమీటరు దూరంలోని నిర్జన ప్రదేశంలో బ్యాటరీకి అనుసంధానం చేశారు. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన స్థానికుడు దీన్ని గమనించి విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో తమను అప్రమత్తం చేశారని, బాంబును గుర్తించి నిర్వీర్యం చేయగలిగామని పోలీసులు వెల్లడించారు.

No comments:

Post a Comment