మాకే గనక అధికారం వస్తే.... తొలి సంతకం తెలంగాణ
జన చేతన యాత్రలో అద్వానీ యువకుల బలిదానాలు పట్టవా..? తెలంగాణపై అటో ఇటో తేల్చండి శీతాకాల సమావేశాల్లో బిల్లు తేవాలి నెగ్గించుకునే బాధ్యత బిజెపిదే...
ఆదిలాబాద్, నిర్మల్, అక్టోబర్ 18: భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ బిల్లుపై తొలి సంతకం చేస్తుందని.. ఇచ్చిన మాట తప్పే నైజం తమ పార్టీకి లేదని ప్రజల హర్షధ్వానాలు, తెలంగాణ నినాదాల మధ్య బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ ప్రకటించారు. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా అద్వానీ చేపట్టిన జనచేతన రథయాత్ర మంగళవారం మహారాష్ట్ర సరిహద్దులుదాటి ఆదిలాబాద్ చేరుకొంది. రాష్ట్రంలోకి యాత్ర అడుగిడగానే అద్వానీకి తెలంగాణ నినాదాలతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడిన అద్వానీ, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక తెలంగాణపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసి బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని, అంతవరకు యువకులు ఆత్మహత్యలు మానుకోవాలని బిజెపి అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం పది జిల్లాల్లో వందలాది యువకులు ప్రాణత్యాగాలు చేసినా, చివరికి పార్లమెంట్ భవనం ముందు యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నా యూపీఏ సర్కారుకు చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, యువకుల ఆత్మహత్యలు చూస్తుంటే దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అవగతమవుతోందని, ప్రభుత్వం విశ్వాసఘాతుక చర్యలకు పాల్పడడం శోచనీయం అన్నారు. తెలంగాణ నినాదాలపై అద్వానీ స్పందిస్తూ ఈ ఉత్సాహం వెనుక ఆవేశం, పౌరుషం వుందని, అంతకంటే పాలకుల దగా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతి, అక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యలకు ఇవ్వడంలేదన్నారు. యువకుల ఆత్మహత్యలు చూస్తూనే తెలంగాణపై ఎంత కాలం సాగదీస్తారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక ఒక్క రోజు ఆలస్యం జరగకుండా ప్రధాని ప్రకటన చేయాలని, బిల్లు పెడితే 116 మంది లోక్‌సభ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేస్తామని అద్వానీ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో బిజెపి ఎప్పుడూ ముందుంటుందన్నారు.
భారతదేశంలో పెచ్చుమీరుతున్న కుంభకోణాలతో ప్రపంచ దేశాల్లో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి భారతదేశానికి ఏర్పడిందన్నారు. అవినీతి, నల్లధనం వంటి పద్ధతులే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారతదేశానికి చెందిన దాదాపు రూ.250 లక్షల కోట్ల నల్లధనం స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతోందన్నారు. దీనిని మన దేశానికి తీసుకువస్తే దేశంలోని సౌకర్యాలు లేని దాదాపు 6 లక్షల గ్రామాల్లో అన్ని సౌకర్యాలతో దేశాన్ని సుసంపన్నం చేయవచ్చన్నారు. నల్లధనంతో ప్రతీ పల్లెలో పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, మంచినీటి సదుపాయాలు కల్పించడంతో పాటు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిని ఆదుకోవచ్చన్నారు.
రెండేళ్ళ క్రితం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని వెలికితీయడం, తెలంగాణను సాధించుకోవడమే లక్ష్యంగా అక్టోబర్ 11 నుండి నవంబర్ 20 వరకు జనచేతన యాత్ర కొనసాగుతుందని అద్వానీ తెలిపారు.
అనంతరం ప్రజల హర్షధ్వానాల మధ్య జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్, నాయకులు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, జంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, గోనె శ్యాంసుందర్‌రావు, శాంతారెడ్డి, శ్రీరాంనాయక్, సుగుణాకర్‌రావు, అయ్యన్నగారి భూమయ్య, పాకాల రాంచందర్, ఆడెపు సుధాకర్, రచ్చ మల్లేష్, గొను గొప్పుల కిషన్, ఒడిసెల శ్రీనివాస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు, బీజే వై ఎం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఆదిలాబాద్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న అద్వానీ
Source : http://www.andhrabhoomi.net/state/bjp-leader-advani-yathra-376
kishan reddy garu you are hope of the andhra pradesh
ReplyDelete