Friday, October 21, 2011

ఎప్పుడైనా మధ్యంతరం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పిలుపు

ఎప్పుడైనా మధ్యంతరం
పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పిలుపు

బీజేపీకి అనుకూల గాలులు
తెలంగాణపై కాంగ్రెస్ కాలయాపన
మహానాడులో టీడీపీ తీర్మానం చేసింది..
సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేని వామపక్షాలు
మజ్లిస్ రాజకీయ పార్టీయా? దానికి సిద్ధాంతం ఉందా? 


హైదరాబాద్, అక్టోబర్ 20 : కేంద్ర ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలతో విసిగిపోయి, ధరల పెరుగదలతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలు యూపీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదని యూపీఏ భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్‌పవారే వ్యాఖ్యానించారని.. మరోవైపు అద్వానీ రథయాత్ర విజయవంతమైందని చెప్పారు. వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.

ఎప్పుడైనా మధ్యంతరం వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారం హైదరాబాద్ శివార్లలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి వామనాచారి, జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వివిధమోర్చాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు... 350 మంది వరకు పాల్గొంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో... తొలి రోజు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

"కేంద్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోంది. యూపీఏ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల నుంచి పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో రైతులు పంట విరామాన్ని ప్రకటించుకునే దుస్థితి నెలకొంది. యూపీఏను గద్దె దించి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎప్పుడు గద్దెనెక్కించాలా అని ప్రజలు ఆతృతపడుతున్నారు'' అన్నారు.

హిస్సార్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు తీవ్రంగా దెబ్బకొట్టారన్నారు. అంతక్రితమే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదని చెప్పారు. 'అద్వానీ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ, అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ప్రజలు ఎన్డీఏ హయాంలో చేపట్టిన పథకాలను మననం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నది స్పష్టమవుతోంది.

మనపార్టీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారితో మరింత మమేకం కావాలి. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది' అన్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. 460 మండలాల్లో కరువు నెలకొందని, సర్కారు కరెంటు కొరత తీర్చట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో 'పరిపాలనా విరామం' కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు విరామాన్ని పాటిస్తున్నారని, సచివాలయం, అసెంబ్లీ విరామంలో ఎత్తిపొడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజలు శాశ్వత విరామాన్ని ప్రకటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం, పాలనా సౌలభ్యం కోసమే తమ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టాలని కోరుకుంటోందని పునరుద్ఘాటించారు. తాము ఏ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా కాదన్నారు. 'కలిసి కలహించుకునే కంటే విడిపోయి సహకరించుకుందాం' అన్న దృక్పథంతో తెలంగాణ కోసం పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఆ ప్రాంత ప్రజలకు రక్షణగా ఉంటామన్న భరోసాను పార్టీ కార్యకర్తలు ఇవ్వాలని సూచించారు. తెలంగాణపై కాంగ్రెస్ అనవసర కాలయాపన చేస్తోందని విమర్శించారు. టీడీపీ మహానాడులో అనుకూల తీర్మానం చేసిందని, టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. వామపక్ష పార్టీలు ఏవైనా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేని స్థితిలో ఉన్నాయన్నారు.

ఇక మజ్లిస్ రాజకీయ పార్టీయా? దానికో సిద్ధాంతమంటూ ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి మతతత్వ పార్టీలతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణను అడ్డుకుంటోందని ఆరోపించారు. మిగతాపార్టీలతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం వారు బీజేపీ వైపు చూస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ తరుపున మన రాష్ట్రం నుంచే ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి పంపించాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు వి.రామారావు, దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, హరిబాబు, ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Source : https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/oct/21/main/21main7&more=2011/oct/21/main/main&date=10/21/2011

No comments:

Post a Comment