గుంటూరు, అక్టోబర్ 24: మొన్న శ్రీకాళహస్తి, నిన్న బాపట్ల, మరి రేపు ఏ దేవుడి వంతు..? ఒక్కొక్కటిగా కూలుతున్న గాలిగోపురాలను పరిశీలిస్తే సాధారణ భక్తుడి మనసులో గుబులు రేపుతున్న ప్రశ్న ఇది. తాజాగా బాపట్ల క్షీరభావనారాయణ స్వామి ఆలయ గాలిగోపురం నిట్టనిలువునా కూలిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోనే మరో చారిత్రక ఆలయ గాలిగోపురం కూలేస్థితికి చేరువైంది. మంగళగిరిలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గాలి(రాజ)గోపురం రేపో, మాపో కూలతానన్నట్లు ప్రమాదపుటంచున నిలిచి వుంది. గాలిగోపురానికి పొంచివున్న ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడిచినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. గత ఏడాది శ్రీకాళహస్తిలో గాలిగోపురం కూలిపోయిన వెంటనే మంగళగిరి గాలిగోపురం దుస్థితిపై మీడియా, భక్తులు, దేవాలయాల పరిరక్షణ కమిటీలు గగ్గోలుపెట్టాయి. దీంతో అప్పటి ప్రభుత్వం మే నెల 31న నిపుణుల కమిటీని నియమించింది. గోపురం పటిష్ఠతకు, పరిరక్షణకు కమిటీ చేసిన ప్రధాన సూచనలు, నివేదికలు ఏడాది దాటినా ఫైళ్లకే పరిమితమయ్యాయంటే చారిత్రక కట్టడాల పరిరక్షణలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎలావుందో స్పష్టమవుతోంది. 1807-09 సంవత్సరాల మధ్యకాలంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తూర్పున 153అడుగుల ఎత్తుతో గాలిగోపురాన్ని నిర్మించారు. అప్పట్లో రాష్ట్రంలోని ప్రముఖ శిల్పులను రప్పించి రెండు సంవత్సరాల్లో గాలిగోపురాన్ని, ప్రాకార మండపాల నిర్మాణాన్ని పూర్తిచేయించారు. తక్కువ వెడల్పుతో ఎత్తయిన గాలిగోపురాన్ని నిర్మించడం సామాన్యమైన విషయం కాదని ఆనాటి పనితనానికి నిదర్శనంగా ఇప్పటికీ నిపుణులు చెబుతుంటారు.
దక్షిణ భారతదేశంలోని కంచిలో ఏకాంబరనాథ దేవాలయ గోపురం, మంగళగిరిలోని తూర్పు గాలిగోపురం ఒకదానికొకటి పోటీపడుతున్నట్లు ఉంటాయి. అలాంటి విశిష్ఠత, చరిత్ర కలిగిన మంగళగిరి ఆలయ గాలిగోపురం పటిష్ఠతకు, పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. గాలిగోపురం పటిష్ఠతకు నిపుణుల కమిటీ దాదాపు ఏడు ప్రధాన సూచనలు చేసింది. ముఖమండపంలోని బీమ్స్‌లో ఏర్పడిన పగుళ్లు మరింత ఎక్కువకాకుండా ఉండేందుకు ఐఎస్‌ఎంబి, బాక్సింగ్ సెక్షన్‌ను అమర్చాల్సిందిగా సూచించింది. అయితే ఇప్పటికీ దేవాదాయ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం దీనిపై కనీసం నివేదిక కూడా తయారుచేయలేదు. అలాగే ముఖద్వారంపై లింటల్‌కు ఏర్పడిన పగుళ్లకు స్టీల్ ప్లేట్లు అమర్చి ఐఎస్‌ఎంబి, బాక్సింగ్ సెక్షన్ ద్వారా ప్యాకింగ్ చేయాలని నిపుణులు సూచించారు. గాలిగోపురం లోపలి భాగంలో పాడైపోయిన, బలహీనంగా ఉన్న రీఫర్స్ తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, బేస్‌మెంట్‌లో ఎలాంటి క్రాక్‌లు రాకుండా స్టీల్‌రోప్‌తో రెండు లైన్లుగా ఏర్పాటు చేసి దానిపై టేకు లేదా అల్యూమినియంతో కవర్ చేయాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది. అయితే కమిటీ సూచనలకు సంబంధించిన ఏ అంశాలపై కూడా నేటికీ కనీసం కన్నెత్తి చూడకపోగా, అంచనాలు రూపొందించక పోవడం గమనార్హం. కేవలం రీ చెదలమందు చల్లడం మినహా కమిటీ చేసిన సూచనలను ఏ ఒక్కదాన్ని కూడా అటు దేవాదాయ శాఖ అధికారులు గాని, ఇటు ప్రభుత్వం గాని ఆచరణలో పెట్టకపోవడంపై భక్తులు, దేవాలయ పరిరక్షణ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
http://www.andhrabhoomi.net/state/gaali-gopuram-134
No comments:
Post a Comment